'ఉరుకు పటేల' మూవీ రివ్యూ : అలరించే కామెడీ థ్రిల్లర్!
3 months ago | 43 Views
లీడ్ ఎడ్జ్ పిక్చర్స్ బ్యానర్‌పై కంచర్ల బాల భాను నిర్మాణంలో వివేక్ రెడ్డి దర్శకత్వంలో తేజస్ కంచర్ల, కుష్బూ చౌదరి జంటగా తెరకెక్కిన సినిమా ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ సినిమా ట్యాగ్ లైన్. 'ఉరుకు పటేల' సినిమా నేడు (వినాయక చవితి రోజు సెప్టెంబర్ 7న) థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...
కథ విషయానికొస్తే.. పటేల(తేజస్) ఊరి సర్పంచ్(గోపరాజు రమణ) కొడుకు. చిన్నప్పుడే తనకు చదువు రాదని అర్ధమయిపోయి చదువు మధ్యలోనే వదిలేసి ఎప్పటికైనా బాగా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాడు. అప్పట్నుంచి ఊళ్ళో చదువుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడుక్కొని ఛీ కొట్టించుకుంటాడు. బాగా డబ్బులు ఉండటం, సర్పంచ్ కొడుకు కావడంతో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒక పెళ్ళిలో అక్షర(కుష్బూ చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. తను డాక్టర్ అని తెలియడంతో ఎలాగైనా ఆ అమ్మయిని ప్రేమలో పడేసి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కొడుకు కోసం ఆ డాక్టర్ తో ఊళ్ళో మెడికల్ క్యాంప్ పెట్టిస్తాడు సర్పంచ్. మెడికల్ క్యాంప్ సమయంలో ఇద్దరూ దగ్గరవుతారు.
ఓ యాక్సిడెంట్ లో అక్షరని కాపాడబోయి పటేల గాయపడతాడు. దీని వల్ల పటేలకు ఒక కాలు చచ్చుబడిపోతుంది. అయినా అక్షర పటేలని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. రెండు కుటుంబాలు ఒప్పుకుంటాయి. ఓ రోజు అక్షర పుట్టిన రోజు అని హాస్పిటల్ లో పూజ ఉందని పటేలని రమ్మంటారు. పటేల అక్కడికి వెళ్ళాక అక్షర కుటుంబం ఒక మనిషిని చంపుతుంది, అలాగే పటేలని కూడా చంపబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పటేల షాక్ అయి అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. మరి పటేల అక్షర కుటుంబం నుంచి తప్పించుకున్నాడా? అసలు అక్షర ఫ్యామిలీ పటేలని ఎందుకు చంపాలి అనుకుంటుంది? అక్షర ఫ్యామిలీ ఎవర్ని చంపింది? పటేల - అక్షర పెళ్లి చేసుకుంటారా? పటేల కాలు బాగు అవుతుందా? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. ఉరుకు పటేల సినిమా థ్రిల్లర్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఊళ్ళో తిరిగే పటేల, అక్షర కనపడ్డాక పటేల వెంటపడటం, ఇద్దరి ప్రేమతో సాగుతుంది. ఇంటర్వెల్ కి పటేల అక్షర బర్త్ డే అని వెళ్లి వాళ్ళ ఫ్యామిలీకి చిక్కుకోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా పటేల అక్కడ నుంచి ఎలా తప్పించుకున్నాడు? అసలు అక్షర ఫ్యామిలీ ఎందుకు పటేలని చంపాలనుకుంటుంది అని సాగుతుంది. సినిమా అయిపోతుంది అనుకున్న టైంలో రెండు ట్విస్టులు ఇచ్చి ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తారు. అసలు ఈ ట్విస్ట్ లను ప్రేక్షకుడు ఊహించలేరు.
ఫస్ట్ హాఫ్ రొటీన్ కమర్షియల్ సినిమాల్లాగే అనిపిస్తుంది. కొంచెం సాగదీసినట్టు కూడా ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తిగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని టెన్షన్ క్రియేట్ చేసి, క్లైమాక్స్ ట్విస్ట్ లతో ఆశ్చర్యపరిచి సక్సెస్ అయ్యారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ ఒక పల్లెటూళ్ళో ఈ కథని నడిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక పల్లెటూళ్ళో తీసేస్తే సెకండ్ హాఫ్ అంతా ఒక హాస్పిటల్ లో తీసేసారు. టైటిల్ కథకి సరిగ్గా సరిపోయేలా పెట్టుకున్నారు.
తేజస్ కంచర్ల కొంచెం గ్యాప్ తీసుకోని ఉరుకు పటేల సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో ఎలా తప్పించుకోవాలి అని భయపడే పాత్రలో అదరగొట్టేసాడు. ఉరుకు పటేల సినిమాని తన భుజాలమీదే మొత్తం నడిపించాడు. ఇక కుష్భు చౌదరి క్యూట్ గా తన నటనతో మెప్పించింది. తెలుగమ్మాయి కాకపోయినా తెలుగమ్మాయిలా కనిపించి అలరించింది. పటేల తండ్రి పాత్రలో గోపరాజు రమణ బాగా నటించారు. సుదర్శన్, చమ్మక్ చంద్ర అక్కడక్కడా నవ్విస్తారు. మిగిలిన నటీనటులు కూడా ప్రేక్షకులని మెప్పిస్తారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ మొత్తం రాత్రి పూట ఒకే హాస్పిటల్ లో కథ జరగడంతో దానికి తగ్గట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పాటలు యావరేజ్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. రొటీన్ కథకి కొత్త స్క్రీన్ ప్లే జత చేసి మొదటి సినిమాని బాగానే తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వివేక్. ఇక నిర్మాణ పరంగా కూడా సినిమాకు కావలసినంత ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. ఈ వీక్ ఎండ్ లో సరదాగా చూసేయండి.
రేటింగ్: 3.25
ఇంకా చదవండి: SPEED220 మూవీ రివ్యూ : స్వచ్ఛమైన ప్రేమకథ!
# UrukuPatela # TejasKancherla # KushbooChowdary # September7