'తిరగబడరసావిూ ' మూవీ రివ్యూ : కాలం చెల్లిన కథ!

'తిరగబడరసావిూ ' మూవీ రివ్యూ : కాలం చెల్లిన కథ!

3 months ago | 45 Views

గతవారం 'పురుషోత్తముడు’ అంటూ పలకరించిన రాజ్‌తరుణ్‌ ఈ శుక్రవారం ’తిరగబడరసావిూ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రాజ్‌తరుణ్‌ వ్యక్తిగత జీవితం, వివాదాలు హాట్‌టాపిక్‌.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాక్‌ టు బ్యాక్‌ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందన్న ఆసక్తి కలుగుతోంది.

కథ: గిరి (రాజ్‌తరుణ్‌) చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమవుతాడు. అనాథలా పెరిగి పెద్దవుతాడు. తనలా కుటుంబాలకు దూరమైన వాళ్లని వెతికిపట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించడమే పనిగా పెట్టుకుంటాడు. అలా అతని పేరు అందరికీ తెలిసిపోతుంది. ఓ టీవీ ఇంటర్వ్యూలో గిరిని చూసిన శైలజ (మాల్వి మల్హోత్రా) దగ్గరవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. పెళ్లితో ఒక్కటవుతారు. ఇంతలో కొండారెడ్డి (మకరంద్‌ దేశ్‌పాండే) ముఠా శైలజ కోసం వేట మొదలుపెడుతుంది. గిరి గురించి తెలుసుకుని అతన్ని కూడా పిలిపించి శైలజని వెతికి పెట్టాలని లేదంటే ప్రాణాలతో ఉండవని బెదిరిస్తాడు. తన భార్య  శైలజ రూ.2 వేల కోట్ల ఆస్తికి వారసురాలని తెలిశాక గిరి ఏం చేశాడు? ఇంతకీ శైలజకీ, కొండారెడ్డికీ సంబంధ మేమిటి? తన భార్యని కాపాడుకోవడం కోసం గిరి ఏం చేశాడు? తదితర విషయాలతో కథ సాగుతుంది.

విశ్లేషణ:  ఒకవైపు వెబ్‌సిరీస్‌లు కట్టి పడేస్తున్నాయి. మరోవైపు లార్జర్‌ దేన్‌ లైఫ్‌ తరహా భారీ సినిమాలు థియేటర్లలో వారానికొకటి సందడి చేస్తున్నాయి. వీటి మధ్య పరిమిత వ్యయంతో కూడిన సినిమా చూడాలంటే అందులో ఏదో ప్రత్యేకత ఉండి తీరాల్సిందే. కథ, కథనాల్లో కొత్తదనం.. హాస్యం.. హృద్యమైన భావోద్వేగాలో ఇలా ప్రేక్షకుడిని కట్టిపడేయాల్సిన అంశం ఉండాలి. మూసధోరణిలో సాగే సినిమాలకైతే ఎప్పుడో మంగళం పాడేశాడు నవతరం ప్రేక్షకుడు. అది ప్రతిసారీ రుజువవుతున్నా ఇంకా ఆ తరహా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ’తిరగబడర సావిూ’ కూడా ఆ తాను ముక్కే. ఊహకు అందే కథ, కథనాలతో ఏ దశలోనూ ఆసక్తిని రేకెత్తించదు ఈ సినిమా. ప్రేక్షకుడి మనసును తాకే భావోద్వేగాలు, కాసేపు కాలక్షేపాన్నిచ్చే హాస్యం కానీ మచ్చుకైనా కనిపించవు. యువ జంట నటించిన సినిమా కదా, సరదా సన్నివేశాలు, ప్రేమ నేపథ్యమేదైనా ఉంటుందేమో అని ఆశిస్తే అదీ భంగపాటే. కొండారెడ్డి ముఠా వేట, హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి... ఇలా  సాదాసీదాగా సాగుతుంది చిత్రం. విరామం ఎపిసోడ్‌ కూడా ప్రేక్షకుడు ఊహించిందే.  విరామం తర్వాత  శైలజని కొండారెడ్డి ముఠా నుంచి కాపాడుకోవడం కోసం హీరో వేసే ఎత్తుగడలు, ఆమె నేపథ్యంతో సాగే కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపించినా, ఆ తర్వాత  మళ్లీ మామూలే. కొండారెడ్డి ముందుకెళ్లి హీరో ఎలా తిరగబడ్డాడనేది పతాక సన్నివేశాల్లో చూపించారు. రెండు గంటల నిడివి కూడా లేని ఈ సినిమా,  కాలం చెల్లిన కథ, పాత్రలు, సన్నివేశాలతో  ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపిస్తుంది.

ఇంకా చదవండి: మూవీ రివ్యూ : ఆకట్టుకునే 'అలనాటి రామచంద్రుడు'

# ThiragabadaraSaami     # MalviMalhotra     # RajTarun     # August3    

trending

View More