పగ..ప్రతీకారమే సత్యదేవ్‌  'కృష్ణమ్మ'

పగ..ప్రతీకారమే సత్యదేవ్‌ 'కృష్ణమ్మ'

4 months ago | 69 Views

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు సత్యదేవ్‌. కానీ, కొన్నాళ్లుగా ఆయన నుంచి వచ్చిన ఏ సినిమా హిట్టు మాట వినిపించలేకపోయింది. దీంతో ఈసారి విజయమే లక్ష్యంగా 'కృష్ణమ్మ’తో బాక్సాఫీస్‌ బరిలో అడుగు పెట్టారు. దీనికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం.. పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల చూపు ఈ సినిమాపై పడింది.   అనాథలైన భద్ర (సత్యదేవ్‌), 

శివ (కృష్ణ బూరుగుల), కోటి (లక్ష్మణ్‌ విూసాల) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. చిన్నతనంలోనే జైలు జీవితం గడిపిన శివ బయటకొచ్చాక ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి స్మగ్లింగ్‌ చేసి పొట్ట నింపుకొంటుంటారు. వీళ్లంతా తమకంటూ ఓ కుటుంబం ఉండాలని ఆశ పడతారు. ఈ క్రమంలోనే విూనాతో శివ ప్రేమలో పడతాడు. ఆమె భద్రకు రాఖీ కట్టడంతో తనూ ఆమెను సొంత చెల్లిగా చూడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్‌ వంటి తప్పుడు పనులు మానేసి ఆటో నడుపుతూ సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తాడు భద్ర. అయితే ఓసారి విూనా తల్లి ఆపరేషన్‌కు రూ.2లక్షలు అవసరమైతే.. ఆ డబ్బు సంపాదించడం కోసం భద్ర, శివ, కోటి తప్పనిసరి పరిస్థితుల్లో గంజాయి స్మగ్లింగ్‌ చేయడానికి సిద్ధపడతారు. అలా వాళ్లు పాడేరు నుంచి వైజాగ్‌కు గంజాయి తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోతారు. సరిగ్గా అప్పుడే వాళ్లు అనుకోకుండా ఓ యువతి హత్యాచారం కేసులోనూ ఇరుక్కుంటారు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ హత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు? ఈ కేసు ఏమిటన్నది తెలియకుండానే దాన్ని భద్ర, కోటి, శివ తమపై వేసుకోవడానికి కారణమేంటి? కేసు గురించి తెలిశాక ఈ ముగ్గురు ఏం చేశారు? శివని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్న విూనా ఏమైంది? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. 

స్నేహంతో ముడిపడి ఉన్న ప్రతీకార కథ ఇది. బలమైన భావోద్వేగాలతో రా రస్టిక్‌ కోణంలో సాగుతుంది. అయితే ఈ అసలు కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. ఒకరకంగా ప్రథమార్ధమంతా సాగతీత వ్యవహారమే.అడవిలో జరిగే ఓ హత్యతో సత్యదేవ్‌ పాత్రను పరిచయం చేస్తూ.. కథను ఆరంభించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. ఆ తర్వాత భద్ర, శివ, కోటిల గతాన్ని చూపిస్తూ నెమ్మదిగా సినిమాని ముందుకు నడిపించాడు దర్శకుడు. వీళ్ల ముగ్గురి స్నేహం, విూనాతో శివ ప్రేమలో పడటం.. మొదట్లో వీళ్ల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు.. ఆఖరికి వాళ్లంతా ఓ కుటుంబంలా కలిసిపోవడం.. అంతా రొటీన్‌ వ్యవహారంలా సాగుతుంది. ఈ మధ్యలో హీరోకి ఓ చిన్న లవ్‌ట్రాక్‌ తగిలించే ప్రయత్నం చేశారు దర్శకుడు. కానీ, అదీ ఏమాత్రం మెప్పించదు. విరామానికి ముందు భద్ర తన మిత్రులతో కలిసి గంజాయి స్మగ్లింగ్‌కు సిద్ధమవడం.. దాన్ని తీసుకొచ్చే క్రమంలో పోలీసులకు దొరికిపోవడం.. అదే సమయంలో అనుకోకుండా ఓ హత్యాచారం కేసును తమపై వేసుకోవడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడి నుంచి ద్వితీయార్ధమంతా సీరియస్‌ టోన్‌లో సాగిపోతుంది. హత్యాచారానికి గురైన యువతి ఎవరన్నది తెలిశాక భద్ర, కోటి, శివ పోలీసులపై తిరగబడే సన్నివేశాలు ఆసక్తిరేకెత్తిస్తాయి. పోలీసులు వాళ్లని చిత్రహింసలకు గురి చేసి బలవంతంగా ఆ కేసును ఒప్పించే సీక్వెన్స్‌ 'జైభీమ్‌’, 'విచారణ’ చిత్రాల్ని గుర్తు చేస్తుంది. భద్ర, కోటి జైలు నుంచి బయటకు వచ్చాక చేసే వరుస హత్యలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ముగింపు ఊహలకు తగ్గట్లుగా ఉన్నా.. పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా అనిపిస్తాయి.

ఇంకా చదవండి: సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ మూవీ రివ్యూ : రివేంజ్ డ్రామా!

# Krishnamma     # SatyadevKancharana     # ArchanaShastry     # TeluguCinema    

trending

View More