'పుష్ప -2'  రివ్యూ:  ఊరమాస్‌ ట్రీట్‌!

'పుష్ప -2' రివ్యూ: ఊరమాస్‌ ట్రీట్‌!

13 days ago | 5 Views

(చిత్రం: పుష్ప: ది రూల్, దర్శకత్వం: సుకుమార్, రేటింగ్ : 3.5/5, విడుదల : 5 డిసెంబర్-2024,  నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, సునీల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు.  సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, నిర్మాణం : మైత్రి మూవీ మేకర్స్ ,  నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి)

 తెలుగు సినీ  ప్రేక్షకులే కాదు.. భారతీయ  ప్రేక్షకులు సైతం ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప 2`.  మూడేళ్ల క్రితం వచ్చిన 'పుష్ప`కి ఈ సినిమా  రెండో పార్ట్. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్  రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీలీలా ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు నెగటివ్‌ రోల్స్ చేశారు. అనసూయ, సునీల్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.  అల్లు అర్జున్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 2021 డిసెంబర్‌లో వచ్చిన 'పుష్ప'  పార్ట్ 1 విడుదలైనప్పుడు ఆ సినిమాని బాగా  ట్రోల్ చేశారు. అయితే.. సినిమా  విడుదలయ్యాక  వచ్చిన రెస్పాన్స్ అసలు ఎవరూ  ఊహించి ఉండరు. బహుశా దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ కూడా ఉహించి ఉండరంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.ఆ సినిమా ఓ రేంజ్‌లో హిట్ అయ్యింది. ఆ సినిమా  అల్లు అర్జున్ ని  తెలుగు హీరోల్లో వరల్డ్ వైడ్ హీరోని చేసింది.  'పుష్ప' చిత్రం  అల్లు అర్జున్ కు అంతటి పేరు తీసుకొచ్చిపెట్టింది.  అలా  పేరు తెచ్చిన సినిమాకు సీక్వెల్ 'పుష్ప: ది రూల్'' నేడు (5 డిసెంబర్-2024)  ప్రపంచవ్యాప్తంగా విడుదలయింది.  ఈ  సినిమాపై భారీ అంచనాలున్నాయి. బిజినెస్ కూడా భారీ స్థాయిలో అయ్యింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్మురేపింది. మరి ఇంతటి భారీ స్థాయిలో అందరూ ఎంతో  ఆసక్తిగా ఎదురు చూస్తున్న  పుష్ప 2 సినిమా  ఎలా ఉందో  తెలుసుకుందాం...  

 కథ:  పుష్పరాజ్‌(అల్లు అర్జున్‌) తన ఎర్రచందనంతో జపాన్‌కి వెళ్తాడు. జపాన్‌ పోర్ట్ లో అక్కడి మాఫియాతో ఫైట్‌ చేస్తాడు. కట్‌ చేస్తే చిత్తూరు శేషాచలం అడవుల్లో పుష్పరాజ్‌ ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో అడ్డులేకుండా ఎదుగుతాడు. సిండికేట్‌ మొత్తం తన కంట్రోల్‌లోకి వస్తుంది. మరోవైపు పుష్పని అడ్డుకోవాలని ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షేకావత్‌ (పహద్‌ ఫాజిల్‌) ప్లాన్‌ చేస్తున్నాడు. ఓ కూలీ  వాడిగా అడవుల్లోకి వెళ్లి అందరినీ చితక్కొట్టి  అరెస్ట్ చేస్తాడు.  తన మనషులను విడిపించడానికి వచ్చిన పుష్పతో పోలీసులు అతి చేయడంతో  పోలీసులందరినీ  కొనేస్తాడు. పోలీస్ స్టేషన్‌ మొత్తం ఖాళీ. దీంతో రెచ్చిపోయిన షేకావత్‌ ఒక సిండికేట్‌ని చంపేస్తాడు. అప్పుడు  మిగిలిన సిండికేట్లు అంతా భయపడతారు. పుష్ప చేత సారీ చెప్పించాలని ఎంపీ సిద్దప్ప(రావు రమేష్‌) సమక్షంలో సిండికేట్‌ పార్టీ ఏర్పాటు చేయిస్తారు. అందులో పుష్ప బాగా తాగి వచ్చి షేకావత్‌కి సారీ చెబుతాడు. అయితే దాన్ని ఆయన అవమానంగా భావించి మళ్లీ వెళ్లి షేకావత్‌ కారుని ఢీ కొడతాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో టాయిలెట్‌ పోసి అవమానిస్తాడు. అప్పటికే ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌తో భారీ డీల్‌ కుదుర్చుకుంటాడు పుష్ప. రెండువేల టన్నులు ఎర్రచందనం అందించడం ఆ డీల్. భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. దానికోసమే పుష్ప ప్లాన్‌. దాన్ని అడ్డుకోవాలని షేకావత్‌ గట్టి ప్లాన్‌ చేస్తాడు. అయితే అంతకు ముందే సీఎంని కలవడానికి వెళ్లిన పుష్పకి అవమానం జరుగుతుంది. సీఎం ఫోటో ఇచ్చేందుకు వెనకాడతాడు. స్మగ్లర్‌తో ఫోటో దిగితే తనకు సమస్య వస్తుందని వద్దు అంటాడు. అక్కడ పుష్ప ఈగో దెబ్బతింటుంది. దీంతో సీఎంనే మార్చేయాలని ప్లాన్‌ చేస్తాడు. అందుకోసమే భారీగా డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఈ డీల్‌ సెట్‌ చేస్తాడు. మరి షేకావత్‌ని దాటుకుని పుష్ప సరుకుని బార్డర్‌ దాటించాడా? సీఎంని మార్చేశాడా? ఈ క్రమంలో సెంట్రల్‌ మినిస్టర్‌, మైనింగ్‌ కింగ్‌ ప్రతాప్‌ రెడ్డితో గొడవేంటి? తనని అవమానించిన ఫ్యామిలీ పుష్ప వద్దకు ఎందుకు వచ్చింది? వారి కోసం పుష్ప ఏం చేశాడు? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:  ఈ చిత్రంలో ఇష్టం వచ్చినట్టుగా సీన్లు పెట్టుకుని, పేర్చుకుంటూ పోయినట్టు ఉంటుంది.  ఎమోషనల్‌ సన్నివేశాలు  చాలా బలంగా ఉన్నా, ఆ ఫీల్‌ ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఫస్టాఫ్ లో  ఫస్ట్ ఫైట్‌ బాగుంది. అందులో బాస్‌ ఎవడ్రా మీ అందరికి నేనే బాస్‌ అని చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది.  ఆ తర్వాత గతంలోకి వెళ్తుంది కథ. అయితే అది కలనా, నిజంగా జరిగిందా అనేది క్లారిటీ లేదు. పుష్పని పట్టుకునేందుకు షేకావత్‌ చేసే ప్రయత్నం మొదట్లోనే బాగుంది. ఆ తర్వాత ప్రతి సారి షేకావత్‌ విఫలమవుతుంటాడు. ఆయన ఎత్తులు వేస్తే పై ఎత్తులు వేసి పుష్ప సరుకుని పంపిస్తుంటాడు. ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని కామెడీగానూ ఉన్నాయి. మరికొన్ని పిచ్చెక్కించేలా ఉన్నాయి. సీఎం అవమానించాడని, సీఎంనే మార్చేయడం ఈ క్రమంలో వచ్చే సీన్లు సినిమాటిక్‌గానే ఉన్నాయి. సహజత్వంగా అనిపించలేదు. ఇలా కమర్షియల్‌ అంశాలను జోడించే క్రమంలో ఎలాంటి లాజిక్ లు పట్టించుకోలేదు. కానీ ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఒక్క హై ఇచ్చే సీన్‌ పెట్టి థియేటర్లలో ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించారు. దానికి తగ్గట్టుగానే పుష్ప రెచ్చిపోయిన తీరు బాగుంది. ఇంటర్వెల్‌ టైమ్‌లో వచ్చే సిండికేట్‌ పార్టీలో షేకావత్‌ కి వార్నింగ్‌, ఛాలెంజ్‌ విసరడం ఆశించిన స్థాయిలో పేలలేదు. ఉన్నంతలో ఓకే అనిపించింది. సెకండాఫ్‌లో జాతర ఎపిసోడ్‌ హైలైట్‌. ఇందులో అమ్మోరుగా వేషం వేసి పుష్ప చేసిన డాన్స్ నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఫైట్‌ సీన్స్ గూస్‌ బమ్స్ పక్కా. దానికి కొనసాగింపుగానే ఫ్యామిలీ ఎమోషనల్‌ సీన్‌తో పిండేశాడు. ఇందులో రష్మిక పాత్ర సైతం రెచ్చిపోయిన తీరు బాగుంది.  ఆ తర్వాత పడుతూ లేస్తూ షేకావత్‌ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, సీఎంని మార్చడం వంటి సీన్లతో సాగిపోతుంది. ఇక తన అన్న కూతురుని కిడ్నాప్‌ సందర్బంగా వచ్చే క్లైమాక్స్ ఫైట్‌ విరోచితంగా ఉంది. పూనకాలు తెప్పించేలా ఉంది. ఎవ్వరికైనా ఆ సీన్లు చూస్తుంటే ఒళ్లుగగుర్పొడుపు రావడం పక్కా. ఆ రేంజ్‌లో దాన్ని డిజైన్‌ చేశారు. అంతకు ముందు వచ్చే సీన్లు నార్మల్‌గానే సాగుతాయి. సెకండాఫ్‌లో ఈ రెండు ఎపిసోడ్లు హైలైట్‌గా నిలుస్తాయి. ఇక క్లైమాక్స్ ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్‌తో ముగించాడు.  కథనంలో క్లారిటీ లేదు.  చాలా లాజిక్‌లు కూడా లేవు. కమర్షియల్‌ ఫ్రీడమ్‌ అతిగా తీసుకున్నట్టు ఉంటుంది. అందుకే చాలా సీన్లు అసహజంగా అనిపిస్తాయి. కొన్ని సీన్లు ఇరికించినట్టుగానే ఉంటాయి. స్టోరీని బలంగా రాసుకుంటే బాగుండేది. విలన్‌ బలంగా లేకపోవడంతో వార్‌ వన్‌ సైడ్‌ అయిపోతుంది. అది చప్పగా అనిపిస్తుంటుంది. అంతగా కిక్‌ ఇవ్వడు. సెంట్రల్‌ మినిస్టర్‌ ప్రతాప్‌ రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు పరిచయంకే పరిమితమయ్యాయి. డెప్త్ లేదు. మూడో పార్ట్ కి దాచి ఉంచారని అనిపిస్తుంది. డైలాగ్స్ లోనూ క్లారిటీ లేదు. చాలా డైలాగులు అర్థం కావడం లేదు. అది పెద్ద మైనస్‌. అయితే ఇప్పుడు మాస్‌, యాక్షన్‌ సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవాలోనే దీన్ని డిజైన్‌ చేశారు. ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్లకి ప్రయారిటీ ఇచ్చారు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు.

థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ కి, మాస్‌ ఆడియెన్స్ కి మాత్రం పూనకాలు పక్కా.  పుష్పకు ఇగో సానా ఎక్కువ.  ఎర్రచందనం సిండికేట్‌లో పని చేసే ఒక కూలీ డబ్బు సంపాదించాలనే కసితో కోట్ల రూపాయిలు సంపాదించడాన్ని అక్కడ సిండికేట్ లో అంతకు ముందే  పాతుకుపోయిన విలన్లను లేపేసి.. ఉన్నవాళ్ళ అందరిని డామినేట్ చేసి ఎలా రైజ్ అయ్యాడనేది పుష్ప పార్ట్ 1 అయితే.. అలా రైజ్ అయిన పుష్ప పెళ్లి తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? అసలు పుష్పకు ఎదురైన సంఘటనలు ఏంటి?  సినిమాలో పుష్ప తల కొరివి పెట్టింది ఎవరికి? ఉంచుకున్న ఆమెకు పుట్టిన పుష్పకు ఇంటి పేరు వస్తుందా లేదా? అసలు హీరోయిన్ కు సినిమాలో పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుంది అనే డైలాగ్ ఎందుకు వచ్చింది? పుష్పను శ్రీవల్లి కోరిన కోరిక ఏంటి?  అనేవి ఆసక్తి కలిగించే సన్నివేశాలు.  మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్లు, యాక్షన్‌ సీన్లు  గట్టిగా దట్టించి వండిన వంటకం పుష్ప 2: ది రూల్‌. లాజిక్‌లు, కథ ఫ్లోకి సంబంధం లేకుండా ఎలివేషన్ సీన్లు, ఆ తర్వాత కాస్త రొమాన్స్, చిన్న కామెడీ, మళ్లీ యాక్షన్‌ సీన్ ఎలివేషన్‌, షేకావత్‌తో ఛాలెంజ్‌లో, సీఎంతో ఛాలెంజ్‌లు, ఇలా హై ఇచ్చే సీన్లతోనే కథనాన్ని నడిపించాడు సుకుమార్‌. ఎప్పటికప్పుడు మ్యాజిక్‌ చేస్తూ బోర్‌ లేకుండా చేసే ప్రయత్నం చేశాడు.  ఈ సినిమాలో   పుష్ప గాడి శివతాండవాన్ని  ఎవడూ ఆపలేరనిపిస్తుంది.  అల్లు అర్జున్ అలియాస్ పుష్ప నటన,  జాతర సీన్,  సుకుమార్ దర్శకత్వ ప్రతిభ , పీలింగ్స్ సాంగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ లు  సినిమాకు బాగా ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి అని చెప్పొచ్చు.  అయితే.. ఫస్ట్ హాఫ్ సాగదీత,  హీరోయిన్ రష్మిక నటన, శ్రీలీలా స్పెషల్ సాంగ్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.  ఈ సినిమాలో ఓ సీన్ ఉంది.. అదే జాతర సీన్… ఆ సీన్ చూడటానికి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు రావడం ఖాయం…. ఆ సీన్ కు ఒక్క అభిమానులకే కాదు..  సినిమా చూసే ప్రతిఒక్కరికీ పూనకాలు రావడం గ్యారెంటీగా చెప్పొచ్చు. పుష్ప సినిమాలో  కూలీగా ప్రారంభమై చిన్నపాటి సిండికేట్‌ మెంబర్‌గా ఎదుగుతాడు పుష్పరాజ్. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన ఎస్పీ షేకావత్‌తో గొడవ పెట్టుకుని ఆయనకు ఛాలెంజ్‌ విసురుతాడు. `పుష్ప 2`లో సిండికేట్‌ని పుష్పరాజ్‌ రూల్‌ చేయడం ప్రధానంగా సాగుతుంది. తనకు అడ్డు వచ్చిన వారిని డబ్బుతో కొనేస్తాడు. చివరికి డబ్బుతోనే సీఎంని కూడా మార్చేసే స్థాయికి ఎదుగుతాడు. నేషనల్‌ దాటి ఇంటర్నేషనల్‌ డీల్స్ సెట్‌ చేస్తుంటాడు. ట్రైలర్‌లో డైలాగ్‌ చెప్పినట్టు ఇంటర్నేషనల్‌ టార్గెట్‌తో ఆయన ముందుకు వెళ్తుంటాడు. క్లుప్తంగా ఇదే కథ. దీని కోసం పుష్ప ఏం చేశాడనేదే సినిమా. కథగా చెప్పడానికి పెద్దగా ఏం లేదు. కమర్షియల్‌ ఫార్మాట్‌లో యాక్షన్‌ సినిమాలకు కావాల్సిన ఎలిమెంట్లు గట్టిగా జోడించి, ఎలివేషన్లు, అదిరిపోయే పాటలు, బీజీఎం, ఫైట్లతో సినిమాని నడిపించాడు సుకుమార్‌. మధ్యలో రష్మిక మందన్నాతో రొమాంటిక్ సీన్లు, అందులోనే కామెడీ పెట్టాడు. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్లు, ఎమోషనల్‌ సీన్లని కూడా మధ్య ఒకటి రెండు చోట్ల యాడ్‌ చేసి ఆయా ఆడియెన్స్ ని కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. 

ఎవరెలా చేశారంటే... నటన విషయానికి వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది అల్లు అర్జున్ గురించే. 'పుష్ప'గా  నటవిశ్వరూపం చూపించేశాడు. నటించమంటే జీవించేశాడు. అసలు 'గంగోత్రి' లో నటించింది ఇతనేనా? అనిపించక మానదు.   పుష్ప పాత్రకు ఒక్క అల్లు అర్జున్ తప్ప మరే హీరో న్యాయం చెయ్యలేరు.  ఇక జాతర సీన్స్ లో అయితే పుష్ప రాజ్ నటించిన తీరు యాంటీ ఫ్యాన్స్ కు సైతం పూనకాలు తెప్పిస్తుంది.      మరోసారి పుష్పరాజ్‌గా దుమ్ములేపాడు. మొదటి భాగం మించి ఆయన రెచ్చిపోయారు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడని చెప్పొచ్చు. ఫహద్‌ ఫాజిల్‌, జగపతిబాబు, సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ వంటి వారు ఉన్నా, వాళ్లని డామినేట్‌ చేశాడు. ఇక జాతర ఎపిసోడ్‌లో అమ్మోరు గెటప్‌లో బన్నీని చూస్తే పూనకాలే అని చెప్పొచ్చు. యాక్షన్స్ లోనూ అదరగొట్టాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. డాన్సులతో ట్రీట్‌ ఇచ్చాడు. శ్రీవల్లిగా రష్మిక మందన్నా సైతం తన బెస్ట్ ఇచ్చింది. సినిమాలో ఆమెది మరో హైలైట్‌ అయ్యే పాత్ర అని చెప్పొచ్చు.   రష్మిక నటనకు ఓ రేంజ్ లో వావ్ అనలేం కానీ శ్రీవల్లి పాత్రకు న్యాయం చేసింది.  పాటల్లో బన్నీ, రష్మిక లు బాగా చేశారు. కనువిందు కలిగించారు. . శ్రీలీలా స్పెషల్ సాంగ్ కంటే కూడా ఈమె చేసిన ఫీలింగ్స్ సాంగ్ కే ఎక్కువ మార్కులు వేయొచ్చు.   ఫహద్ ఫాజిల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.  అసలు ఈయన పాత్రను చూస్తున్నప్పుడు అబ్బా ఎంత శాడిస్ట్ అని అనకుండా ఉండలేరు.  పుష్ప ది రైజ్ లో పెద్దగా కనిపించని అనసూయ రోల్ లో అసలు ఏం లేదు.. అనసూయ ఏదో ఉందంటే ఉంది అంతే..  ఇక సునీల్, రావు రమేష్ తదితరులు అంతా చక్కటి నటనను ప్రదర్శించి ఊహించని రేంజ్ లో నటించేశారు.  పీలింగ్‌` పాటలో కూడా శ్రీలీలతో రెచ్చిపోయి చేశాడు బన్నీ. షేకావత్‌గా ఫాహద్‌ ఫాజిల్‌ సైతం రచ్చ చేశాడు. నెగటివ్‌ షేడ్ ఉన్న రోల్‌లో ఆయన పిచ్చెక్కించాడు. అయితే ఆయన పాత్రని డల్‌గా చూపించడం మైనస్‌గా చెప్పొచ్చు. అనసూయ, సునీల్‌ పాత్రలు అలరించేలా ఉన్నాయి. జగపతిబాబు పాత్ర కొత్తగా యాడ్‌ అయ్యింది. సెంట్రల్‌ మినిస్టర్ ప్రతాప్‌ రెడ్డి పాత్రలో ఉన్నంత సేపు హై ఇచ్చాడు. ఆయన కూడా చిత్తూరు యాసలో కొత్త గెటప్‌లో రెచ్చిపోయాడు. రావు రమేష్‌కి మరో  బలమైన పాత్ర పడింది. ఎప్పటికీ గుర్తిండిపోతుంది. కేశవ పాత్రలో జగదీష్‌ మరోసారి మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే.  

 టెక్నీకల్ గా చూస్తే...   సినిమాకి మిరోస్లవ్‌ క్యూబా బ్రోజెక్‌  విజువల్స్ ది బెస్ట్ అనేలా ఉన్నాయి.  బాగా షూట్‌ చేశారు. క్లోజప్‌లు, లాంగ్‌ షాట్ లు బాగున్నాయి. విజువల్స్ గా ట్రీట్‌ అనేలా ఉంది.   దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన అన్ని పాటలు ఉర్రూతలూగించేలా ఉన్నాయి. పాటలకంటే సౌండింగ్‌, హీరోహీరోయిన్లు డాన్సులు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. పాటలకు థియేటర్లలో ఆడియెన్స్ సీట్లలో కూర్చోరంటే అతిశయోక్తి కాదు. చిత్రీకరణ, డాన్స్ కంపోజింగ్‌ కూడా అంతే బాగుంది. ఫైట్‌ సీన్లకి బీజీఎం మోతమోగించారు. రొటీన్‌ కి భిన్నంగానే ఉంది. థమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌, సామ్‌ సీఎస్‌ బీజీఎంతో అదరగొట్టారు. నవీన్‌ నూలి  ఎడిటింగ్ ఓకే! సినిమాకి అదే పెద్ద బలం. దర్శకుడు సుకుమార్‌ సేఫ్‌ గేమ్‌ ఆడాడని చెప్పొచ్చు. పుష్ప రాజ్‌ పాత్రని మెయిన్‌గా తీసుకుని కథని నడిపించాడు.  డైలాగ్‌లు పవర్‌ కిక్‌ ఇచ్చేలా ఉన్నాయి. మొత్త మీద  మాస్‌కి, ఫ్యాన్స్ కి నచ్చే ట్రీట్‌ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్‌.

ఇంకా చదవండి: 'ఉద్వేగం' మూవీ రివ్యూ : ఓ కొత్త అనుభూతి!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# పుష్ప2     # అల్లుఅర్జున్‌     # రష్మికమందన్నా     # డిసెంబర్‌5    

trending

View More