'పేకమేడలు' మూవీ రివ్యూ :  మధ్యతరగతి ప్రజల జీవితం

'పేకమేడలు' మూవీ రివ్యూ : మధ్యతరగతి ప్రజల జీవితం

2 months ago | 24 Views

నటుడు రాకేష్‌ వర్రే ఒక పక్క నటుడిగా సినిమాలు చేస్తూ, ఇంకో పక్క కొత్త టాలెంట్‌ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కొత్తవాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు. రాకేష్‌ వర్రే ఇంతకు ముందు 'ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో కథానాయకుడిగా విజయం సాధించాడు. తరువాత క్రేజీ యాంట్స్‌ అనే ఒక ప్రొడక్షన్‌ సంస్థని ప్రారంభించి నిర్మాతగా కూడా విజయం సాధించాడు. ఇప్పుడు మళ్ళీ నిర్మాతగా 'పేకమేడలు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తమిళ నటుడు వినోద్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తే అనూష క్రిష్ణ అతనికి జంటగా నటించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. లక్ష్మణ్‌ (వినోద్‌ కిషన్‌) ఇంజనీరింగ్‌ చదివాడు, పెళ్లయింది, బాబు కూడా వున్నాడు, కానీ భాద్యతలు లేకుండా ఎప్పుడూ మొబైల్‌లో పేకాడుతూ కాలం గడిపేస్తూ ఉంటాడు. పాపం భార్య కష్టపడి సంపాదించి ఇంటిలో దాచుకున్న డబ్బులు వెతికి మరీ తీసుకొని ఖర్చు పెట్టేస్తాడు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండానే, పెద్ద రియల్‌ ఎస్టేట్‌ డీల్‌ చేసేవాడిలా పోజులు ఇచ్చి ఒక్కసారిగా లక్షలు సంపాదించాలని అనుకుంటూ ఉంటాడు. ఆ కోవలోనే శ్వేత (రితికా శ్రీనివాస్‌) పరిచయం అవుతుంది, పరిచయం ఇంకాస్తా దూరం కూడా పోతుంది. ఇల్లు గడవడం కోసం భార్య వరలక్ష్మి (అనూష క్రిష్ణ) ఒక పోలీసాఫిసర్‌ ఇంట్లో పని చెయ్యడమే కాకుండా, కర్రీ పాయింట్‌ లాంటిది పెట్టి కష్టపడి డబ్బు సంపాదించాలి, కొడుకుని బాగా చదివించాలి అని అనుకుంటుంది.

భార్య, బిడ్డ వారి గురించి ఆలోచన, భాద్యత లేని లక్ష్మణ్‌ తానొక పెద్ద వ్యాపారవేత్త అని చెపుతూ శ్వేత వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరుగుతుంది, లక్ష్మణ్‌ బండారం బయట పడుతుంది. శ్వేతకి, లక్ష్మణ్‌ కి మధ్య వున్న సంబంధం వరలక్ష్మి కి ఎలా తెలిసింది? తెలిసి ఆమె ఏమి చేసింది? శ్వేతకి లక్ష్మణ్‌ వ్యాపారవేత్త కాదన్న విషయం ఎలా బయటపడిరది. భార్య భర్తల మధ్య చివరకి ఏం జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ’పేకమేడలు’ సినిమా చూడాల్సిందే.  కొత్త టాలెంట్‌ కూడా ఈ చిన్న సినిమాలతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతూ వుంటారు. అలాంటి కోవలోకే వస్తుంది పేకమేడలు’ అనే సినిమా. సమాజంలో జరిగే ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని ఈ సినిమా కథని రాసుకున్నాడు. ఒక పెద్ద సినిమా బాగోలేకపోయినా, టికెట్‌ రేట్‌ ఎక్కువున్నా ప్రేక్షకుడు చూస్తాడు, కానీ వాటితోపాటుగా ఒక్కోసారి చిన్న సినిమాలని కూడా ప్రోత్సహించాలి. మొదటి సగం కొంచెం మామూలుగా వున్నా, రెండో సగం నుండి దర్శకుడు ప్రేక్షకుడిని కథలోకి తీసుకువెళతారు. భర్త వుద్యోగం చేస్తున్నాను అని భార్యని మభ్య పెట్టడం, మళ్ళీ కొన్ని రోజుల తరువాత వుద్యోగం లేదనటం, వాళ్ళిద్దరి మధ్య వాగ్యుద్ధం ఇవన్నీ సహజంగా చిత్రీకరించాడు దర్శకుడు. అలాగే కష్టపడకుండా ఎదో మాయమాటలు చెప్పి డబ్బు సంపాదించాలనుకునే లక్ష్మణ్‌ లు సమాజంలో ఎంతోమంది వున్నారు. అందుకే అతని పాత్ర ద్వారా చెప్పే సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. భర్త చెప్తున్న మాయమాటలు భరిస్తూ, ఓర్పుతో కష్టపడుతూ వున్న భార్యలు కొందరైతే, భర్త ఆగడాలు భరించలేక కొంతమంది భార్యలు ఎదురుతిరిగి మహిళా శక్తి ఏంటో కూడా చూపిస్తారు. ఈ సినిమాలో దర్శకుడు భార్యని రెండో కోవలో చూపించడం బాగుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు సినిమాకి ఎంతో బలం. అలాగే భావోద్వేగాలు కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. సినిమాలో చాలా సన్నివేశాలు సహజంగా, మనచుట్టూ జరుగుతున్నవిగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ’పేక మేడలు’ సినిమా ఆకట్టుకుంటుంది. సినిమాలో కథ, కథనం, భావోద్వేగాలు అన్నీ బాగా పండాయి, దర్శకుడు అవి బాగా చిత్రీకరించాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే లక్ష్మణ్‌ పాత్రలో వినోద్‌ కిషన్‌ అతుక్కుపోయాడు. సహజంగా నటించి తన ప్రతిభని చూపించాడు. ముఖ్యంగా పతాకసన్నివేశంలో అదరగొట్టాడు. ఇక అనూష క్రిష్ణ కూడా వినోద్‌ కిషన్‌ కి పోటీగా ఎంతో అద్భుతంగా నటించింది. అసలు ఆమెని చూస్తే నిజంగానే వరలక్షి అనే ఆమె వుంది అన్నంత సహజంగా నటించింది. పతాక సన్నివేశాల్లో భర్తపై తిరుగుబాటు చేసే భార్యగా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టేంత బాగా చేసింది. రితికా శ్రీనివాస్‌ తన పాత్రకు తగ్గట్టుగా చేసింది. మిగతా పాత్రల్లో తమ పాత్రల పరిధి మేరకు చేశారు. రెండో సగంలో వచ్చే పాటలో మంచి భావుకత వుంది. సంగీతం, ఛాయాగ్రహణం బాగున్నాయి.

ఇంకా చదవండి: 'డార్లింగ్' మూవీ రివ్యూ : కామెడీ ఎంటర్టైనర్ !

# Pekamedalu     # Vinodkishan     # Anushakrishna    

trending

View More