‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ : మెప్పించే యాక్షన్ డ్రామా!
4 months ago | 60 Views
(చిత్రం : ‘మిస్టర్ బచ్చన్’ , విడుదల తేదీ : ఆగస్టు 15, 2024, మొబైల్ మసాలా రేటింగ్ : 3/5, నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తదితరులు. దర్శకత్వం : హరీశ్ శంకర్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్, సంగీతం: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ: అయానక బోసే, ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి)
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో గతంలో ‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి సినిమాల తర్వాత రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చారు. . ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలన్నీ విశేష ఆదరణ పొంది చార్ట్ బస్టర్స్ అయ్యాయి. విడుదలకు ముందే ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడింది, టీజర్, ట్రైలర్ వంటివి కూడా అభిమానుల్ని, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా నేడు ( ఆగస్టు 15, 2024) థియేటర్లలో అడుగు పెట్టింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం...
కథ: మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంతో నిజాయితీ పరుడు. అవినీతికి వ్యతిరేకి. అలాంటి మిస్టర్ బచ్చన్ ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేయడంతో, ఆగ్రహించిన పై అధికారులు అతడిని డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వస్తాడు. అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ)ని చూసి సహజంగానే లవ్ లో పడతాడు. మరి ఆ జిక్కీ ప్రేమ కోసం బచ్చన్ ఏం చేశాడు?, బచ్చన్ తో జిక్కీ ఎలా ప్రేమలో పడింది?, వీరి ప్రేమవ్యవహారం విషయం ఇంట్లో ఎలా తెలిసింది?, పెద్దలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నారు ?, అంతలో బచ్చన్ కి ఉద్యోగంలో చేరమని ఫోన్ రావడం, బచ్చన్ తన తదుపరి రైడ్ ఎంపీ అయిన ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి రావడంతో కథ మలుపు తిరుగుతుంది. అధికారులని సైతం భయపెట్టే ముత్యం జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు ?, అక్కడ అతడికి ఎదురైన సంఘటనలు ఏమిటి ?, చివరకు మిస్టర్ బచ్చన్ ఏం సాధించాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
విశ్లేషణ : ఈ సినిమాలో ఒక ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నిజాయితీతో పని చేస్తే.. సిస్టమ్ కి ఎంతో మేలు జరుగుతుందని చూపించిన విధానంతో పాటు హరీశ్ శంకర్ కమర్షియల్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ అంటూ స్టయిలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో.. రవితేజ నటనతో పాటు ఆయన క్యారెక్టరైజేషన్ మరియు యాక్షన్ సీన్స్, అలాగే మాస్ ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఐతే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే ఈ చిత్రంలో కనెక్ట్ అవుతాయి. యాక్షన్ డ్రామాగా సాగిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో మొదట కాసేపు హీరో ప్రొఫెషనల్ ఎపిసోడ్ .. ఓ పెళ్లి చూపులు.. అక్కడ జరిగే ఇన్కమ్ టాక్స్ రైడ్ హైలెట్ గా ఉంటుంది. తర్వాత హీరో తన సొంత ఊరికి రావడం. అక్కడ తన ఫ్రెండ్స్ తో జరిగే కామెడీ ట్రాక్స్, లవ్ ఎపిసోడ్ హైలెట్ . ఇంటర్వెల్లో హీరో విలన్ ఇంటికి రైడ్ కోసం వెళ్లడం నుండి కథ ఇంకో టర్న్ తీసుకుంటుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా గడిచిపోతుంది. ఇక సెకండాఫ్ లో వచ్చే హీరో ఎలివేషన్ సీన్స్ ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా ఉంటాయి. డైలాగ్స్ అభిమానులకి మంచి ఫీస్ట్ ఇస్తాయి. మిస్టర్ బచ్చన్ పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ ను బాగా డిజైన్ చేసుకున్న హరీశ్ శంకర్, అంతే స్థాయిలో ఈ సినిమా ట్రీట్మెంట్ ను రాసుకోలేదనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఆసక్తికరమైన కథనాన్ని రాసుకోవడంలో ఆయన విఫలం అయ్యారు. కొన్ని సన్నివేశాలు స్లోగా మరియు రెగ్యులర్ గా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో – విలన్ మధ్య మైండ్ గేమ్ ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే బావుండేది. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఆసక్తి మిస్ అయ్యింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి హరీశ్ శంకర్ డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం బాగున్నప్పటికీ.. సినిమా మాత్రం సోసోగానే అనిపిస్తుంది. సెకండాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు విలన్ పాత్రను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉండి ఉంటే సినిమాకి మరింత హైప్ క్రియేట్ అయ్యేది. మిస్టర్ బచ్చన్ గా రవితేజ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. తన శైలి కామెడీ టైమింగ్ తో పాటు స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్ తో మరియు బలమైన ఎమోషన్స్ తోనూ రవితేజ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రవితేజ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో మరియు తన లుక్స్ తో రవితేజ చాలా బాగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్ తో అలరించింది. ముఖ్యంగా సాంగ్స్ లో భాగ్యశ్రీ బోర్సే లుక్స్, స్టెప్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. విలన్ గా జగపతి బాబు తన పాత్రకు పూర్తి నాయ్యం చేశారు. కమెడియన్ సత్య తన కామెడీతో నవ్వించాడు. ఫస్ట్ హాఫ్ లో సత్య సీన్స్ దాదాపు వర్కౌట్ అయ్యాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన సచిన్ ఖేడేకర్, తనికెళ్ళ భరణి, గౌతమి, ప్రవీణ్ తమ పాత్రలో ఒదిగిపోయారు. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. మొత్తం మీద దర్శకుడు హరీశ్ శంకర్ తన టేకింగ్ తో మెప్పించినా.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారనిపించింది.
సాంకేతిక విభాగం : ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవలసింది.. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ అందించిన పాటల గురించి. సాంగ్స్ వినడానికే కాదు.. చూట్టానికి కూడా హైలెట్ అని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, అభిషేక్ పాఠక్ ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో నిర్మించారు. వారి నిర్మాణ విలువలు మెచ్చుకోతగ్గవి. సినిమా స్థాయికి తగ్గ్గట్టుగానే ఉన్నాయి.
ఇంకా చదవండి: వినూత్న కథాంశంతో 'సింబా'
# MrBachchan # RaviTeja # HariShankar # August15