మూవీ రివ్యూ :   రొటీన్‌ కథల నుంచి బయటపడని శ్రీనువైట్ల..  'విశ్వం' లో కనిపించని కొత్తదనం

మూవీ రివ్యూ : రొటీన్‌ కథల నుంచి బయటపడని శ్రీనువైట్ల.. 'విశ్వం' లో కనిపించని కొత్తదనం

2 months ago | 5 Views

నటుడు గోపీచంద్‌.. దర్శకుడు శ్రీను వైట్ల ఇద్దరూ కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న క్రమంలో... ఇప్పుడీ ఇద్దరూ కలిసి విజయమే లక్ష్యంగా 'విశ్వం’తో విజయదశమి బరిలో నిలిచారు. ఇది వీళ్ల కాంబోలో తొలి సినిమా. ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

కథేంటంటే.. జలాలుద్దీన్‌ ఖురేషి (జిషు సేన్‌) కరుడుగట్టిన ఐఎస్‌ఐ టెర్రరిస్ట్‌. సంజయ్‌ శర్మ అనే మారుపేరుతో భారత్‌లో నివసిస్తూ.. విద్యా వ్యవస్థ ముసుగులో విద్యార్థుల్ని తీవ్రవాదులుగా తయారు చేస్తుంటాడు. వాళ్ల సాయంతో పెద్ద ఎత్తున మారణహోమం సృష్టించి భారత్‌ను నాశనం చేయాలని ప్రణాళిక రచిస్తుంటాడు. దీనికోసం కేంద్రమంత్రి సీతారామరాజు (సుమన్‌) సోదరుడైన బాచిరాజు (సునీల్‌) సాయం తీసుకుంటాడు. కానీ, తన ఉగ్రచర్యల సంగతి సీతారామరాజుకు తెలియడంతో బాచిరాజుతో కలిసి అతన్ని  జలాలుద్దీన్‌ కిరాతకంగా చంపేస్తాడు. ఈ హత్యను దర్శన అనే ఓ చిన్న పాప చూస్తుంది. దీంతో ఆ పాపను కూడా చంపాలని బాచిరాజుతో చెప్పి ఓ పని విూద కశ్మీర్‌కు వెళ్తాడు జలాలుద్దీన్‌. అయితే బాచిరాజు ముఠా ఆ పాపను చంపబోగా ఆ చిన్నారి కుటుంబానికి గోపిరెడ్డిగా పరిచయమైన విశ్వం (గోపీచంద్‌) కాపాడతాడు. శ్రీను వైట్ల చిత్రాల్లో కథలు ఓ థీమ్‌లో సాగుతుంటాయి. దేశానికి కొన్ని విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఏర్పడటం.. ఆ కుట్రల్ని భగ్నం చేసేందుకు హీరో తన ఐడిరటిటీని  దాచి పెట్టి మారుపేరుతో ఓ ఇంటిలో చేరి రహస్యంగా మిషన్‌ను చేపట్టడం.. ఈ క్రమంలో తన తెలివితేటలతో ఆ విద్రోహ శక్తుల్ని తన ట్రాప్‌లో పడేలా చేసి వాళ్ల ఆట కట్టించడం కనిపిస్తుంటుంది. 

విశ్లేషణ: దర్శకుడు శ్రీను వైట్ల నుంచి వచ్చిన ’దూకుడు’, ’బాద్‌షా’ చిత్రాలు ఈ కోవకు చెందినవే. ఈ థీమ్‌ రొటీన్‌గా మారిపోవడంతో శ్రీనుకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అందుకే ఈసారి తన పంథాను పూర్తిగా మార్చుకుని.. ఈతరం ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం నిండిన కథతో 'విశ్వం’ను సిద్ధం చేసినట్లు ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. కానీ, తెరపై సినిమా చూస్తున్నప్పుడు ఆయన ఇంకా తన పాత పంథా నుంచి అసలు బయటకు రాలేదనే అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే 'దూకుడు’కు గోపీచంద్‌ వెర్షన్‌లా ఉంటుంది. మహేశ్‌బాబు 'దూకుడు’లో తండ్రి ఎమోషన్‌ను కనిపిస్తే.. ఇందులో ఓ పాప ఎమోషన్‌ కీలకంగా నిలుస్తుంది. మిగతాదంతా శ్రీను వైట్ల మార్క్‌ వినోదం.. గోపీచంద్‌ శైలి యాక్షన్‌ హంగామాతో రొటీన్‌గానే సాగిపోతుంది. ద్వారకలో జరిగే బాంబు బ్లాస్ట్‌ ఎపిసోడ్‌తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆ వెంటనే జలాలుద్దీన్‌ పాత్రను పరిచయం చేసి నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయారు దర్శకుడు. కథలో సీరియస్‌నెస్‌ మిస్సయి పోతుంది. ఇక్కడి నుంచి శ్రీను వైట్ల మార్క్‌ వినోదం మొదలవుతుంది. జాలిబాబుగా పృథ్వీ చేసే అల్లరి.. మ్యారేజ్‌ బ్రోకర్‌గా శ్రీనివాస్‌ కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి. ఇక నాయకా నాయికల మధ్య వచ్చే ఇటలీ లవ్‌ట్రాక్‌ ఎపిసోడ్‌ బోరింగ్‌గా అనిపిస్తుంది. పాపను చంపేందుకు బాచిరాజు మళ్లీ కుట్ర మొదలు పెట్టినప్పటి నుంచి కథలో సీరియస్‌నెస్‌ మొదలవుతుంది. ఈ క్రమంలో గోవా నేపథ్యంలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌తో విరామమిచ్చిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. గోపీచంద్‌ ఎప్పటిలాగే తనకు అలవాటైన యాక్షన్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్‌, కామెడీ సీక్వెన్స్‌లలో తనదైన శైలిలో చెలరేగి పోయారు. కావ్య థాపర్‌ తెరపై తన అందచందాల తో గ్లామర్‌గా కనిపించింది. తన పాత్ర నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది. డ్యాన్సుల్లో ప్రతిభ చూపే అవకాశం దొరికింది. కాకపోతే నటన పరంగా ప్రతిభ చూపించుకునే ఛాన్స్‌ దొరకలేదు. ప్రధాన ప్రతినాయకుడిగా జిషు సేన్‌ గుప్తా అలవాటైన విలనిజంతో ఆకట్టుకున్నాడు. సునీల్‌ను ఒకటి రెండు సీన్స్‌ మినహా ఆద్యంతం కామెడీ విలన్‌గానే చూపించారు. ఈ కథకు కీలకమైన దర్శన పాత్రను పోషించిన చిన్నారి చక్కటి నటనతో ఆకట్టుకుంది. నరేశ్‌, ప్రగతి, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, వీటీవీ గణెళిశ్‌, అజయ్‌ ఘోష్‌.. ఇలా బోలెడంత మంది కమెడియన్లు కనిపించారు. వీరిలో ప్రతి ఒక్కరూ వాళ్ల పాత్ర పరిధి మేరకు నవ్వించే ప్రయత్నమే చేశారు. కమర్షియల్‌ డైరెక్టర్‌గా శ్రీను వైట్ల ప్రతిభకు వంక పెట్టాల్సిన పనిలేదు. కాకపోతే తన రొటీన్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌ నుంచి బయట పడటం లేదు. రచయిత గోపీమోహన్‌ కూడా ఒకే థీమ్‌ను పట్టుకుని బండి నడిపిస్తున్నట్లు అనిపిస్తోంది. కథ.. కథనాల్లో కొత్తదనం చూపించలేకపోతున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. భీమ్స్‌ చేసిన ’గుంగురూ గుంగురూ’ పాట మాస్‌ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. విజువల్స్‌ గ్రాండ్‌గా ఉంటాయి. ఇలాంటి రొటీన్‌ కథను నమ్మి భారీగా ఖర్చు పెట్టిన నిర్మాతల సాహసాన్ని మెచ్చుకోవాలి.

ఇంకా చదవండి: 'స్వయంభూ' సెట్‌లో.. ఆయుధపూజ!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Srinuvaitla     # Viswam     # Gopichand    

trending

View More