మూవీ రివ్యూ :  రొటీన్‌కు భిన్నంగా 'సరిపోదా శనివారం'

మూవీ రివ్యూ : రొటీన్‌కు భిన్నంగా 'సరిపోదా శనివారం'

2 months ago | 33 Views

ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న కథానాయకుడు నాని 'అంటే... సుందరానికి’ తర్వాత నాని - వివేక్‌ ఆత్రేయ కలిసి చేసిన చిత్రమిది. తొలి సినిమాతో మిశ్రమ ఫలితాన్ని సొంతం చేసుకున్న ఈ కలయిక. ఈసారి ఎలాంటి ప్రభావం చూపించింది తెలుసుకుందాం... 

'సరిపోదా శనివారం’ కథేంటంటే..: సూర్య (నాని)కి చిన్నప్పట్నుంచీ కోపం ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం తను చనిపోతూ ఓ మాట తీసుకుంటుంది తల్లి ఛాయాదేవి (అభిరామి). అప్పట్నుంచి వారమంతా ఎంతగా కోపం వచ్చినా నియంత్రించుకుంటూ, శనివారం మాత్రమే తన కోపానికి కారణమైన వాళ్ల పని పడుతుంటాడు. వారమంతా చిత్రగుప్తుడులా చిట్టా రాసుకుంటూ, శనివారం యముడిలా చెలరేగిపోతాడన్న మాట. దాంతో ఆ గొడవలు ఇంటిదాకా వస్తుంటాయి. తండ్రి (సాయికుమార్‌),  అక్క (అదితి) ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఎన్‌.ఎల్‌.ఐ.సిలో మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న సూర్య చిట్టాలోకి సీఐ దయానంద్‌ (ఎస్‌.జె.సూర్య) చేరతాడు. తన సొంత అన్న కూర్మానంద్‌ (మురళీశర్మ)తోనే వైరం ఉన్న సీఐ దయానంద్‌ కథేమిటి?అతనికీ, సోకులపాలెం అనే ఊరికీ సంబంధమేంటి? దయానంద్‌పై సూర్యకు ఉన్న కోపం, సోకులపాలేనికి ఎలాంటి మేలు చేసింది? వీళ్ల కథలోకి చారులత (ప్రియాంక మోహన్‌) ఎలా ప్రవేశించింది? అన్నది చిత్ర కథ!

విశ్లేషణ: వివేక్‌ ఆత్రేయ మార్క్‌ తెలివైన కథనంతో సాగే ఓ యాక్షన్‌ డ్రామా ఇది. విడుదలకు ముందు చిత్రబృందం కూడా కథ కంటే, ఆ కథని ఎలా చెప్పామన్నదే కీలకం అంటూ ప్రచారం చేసింది. అందుకు తగ్గట్టే బలమైన పాత్రలు, సంఘర్షణకి వైవిధ్యమైన కథనాన్ని మేళవించి ’సరిగ్గా సరిపోయింది’ అనిపించేలా చిత్రాన్ని మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఏ కథ అయినా అమ్మ నుంచే మొదలవుతుందంటూ అమ్మ, ఆమె తన కొడుకు నుంచి తీసుకున్న మాటతోనే సినిమా ప్రారంభమవుతుంది. ఆ ఎపిసోడ్‌తోనే సినిమాకి ఈ పేరు ఎందుకో స్పష్టమవుతుంది. కథ, పాత్రల పరిచయంతో కూడిన ఆరంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపించినా, దయా పాత్ర ప్రవేశంతో అసలు కథ ఊపందుకుంటుంది. సోకులపాలెంని ఓ వస్తువులా చూస్తూ, తన కోపాన్ని ఆ ఊరిపై చూపించే ఇన్‌స్పెక్టర్‌ దయ, అతనికి అన్నతో ఉన్న వైరం చిత్రంలో కీలకం. ఆరంభం, మలుపు, పీటముడి, మధ్యభాగం, ముగింపు అంటూ పార్శ్వాలుగా కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మలుపు అంకం నుంచి సన్నివేశాలు ఆసక్తికరంగా సాగిపోతుంటాయి. ఆ క్రమంలోనే పరిచయమయ్యే చారులత, కూర్మానంద్‌ పాత్రలు... వాటి ద్వారానే అన్నదమ్ముల మధ్య సంఘర్షణ, సోకులపాలెం కథలు వెలుగులోకి వచ్చే క్రమం ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేస్తాయి. సూర్య, చారులత ప్రేమకథలో వచ్చే ఈగ స్టోరీ నవ్విస్తుంది. సినిమాలో కీలకమైన ప్రతి పాత్ర వెనకా ఓ కథ ఉంటుంది. ఆ కథల్ని వివరించే క్రమంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్న భావన కలిగినా, పీటముడి, మధ్యభాగం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సూర్య, చారులత దగ్గరయ్యే సన్నివేశాలు... చారులతకి సూర్య తన శనివారం సంగతిని చెప్పాలనుకోవడం, ఆ క్రమంలోనే వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌, విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. అప్పటి నుంచి కథ సూర్య వర్సెస్‌ దయా అన్నట్టుగా మారిపోతుంది. సోకులపాలెంలో ధైర్యం నింపడం కోసం సూర్య, చారు కలిసి ఓ వ్యూహాన్ని రచించడం, ఆ క్రమంలో అనూహ్యంగా చోటు చేసుకునే సంఘటనలు, సూర్య ఇంట్లో సాగే పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. కోపం నలుగురిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలంటూ పతాక సన్నివేశాల దిశగా సినిమా సాగుతుంది.  నాని  యాక్షన్‌ అవతారం ఆకట్టుకుంటుంది. సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఉద్యోగిగా సహజ సిద్ధమైన లుక్‌, నటనతో ఒకవైపు అలరిస్తూనే, మరోవైపు కోపంతో రగిలిపోయే కోణాన్ని ప్రదర్శించాడు. ఎస్‌.జె.సూర్య పోషించిన ఇన్‌స్పెక్టర్‌ దయానంద్‌ పాత్ర సినిమాకి కీలకం. క్రూరత్వం ప్రదర్శిస్తూ, తన చూపులతోనే భయపెడుతూ విలనిజం ప్రదర్శించాడు. ఆ పాత్రకి సరైన ఎంపిక అని చాటి చెప్పారు. చారులత పాత్రలో ప్రియాంక మోహన్‌ అలరిస్తుంది. నా జడ్జిమెంట్‌ ఎప్పుడూ తప్పే అంటూ మురళీశర్మ  తెరపై కనిపించిన విధానం, ఆయన పాత్ర సినిమాకి మరో ఆకర్షణ. సాయికుమార్‌, అదితి బాలన్‌, అభిరామి, హర్షవర్ధన్‌, మైమ్‌ మధు, అజయ్‌ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపించి మెప్పిస్తారు.

ఇంకా చదవండి: 'డబుల్ ఇస్మార్ట్' మూవీ రివ్యూ : సాదాసీదా కమర్షియల్ డ్రామా !

# Nani     # SaipodhaaSanivaaram     # SJSuryah    

trending

View More