మూవీ రివ్యూ: రాధాకృష్ణల లవ్ స్టోరీ...'భలే ఉన్నాడే'
2 months ago | 34 Views
కథానాయకుడు రాజ్‌తరుణ్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేస్తున్నా.. ఏ ఒక్కటీ ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతుంది. ఈ క్రమంలోనే 'భలే ఉన్నాడే’తో మరోసారి తెరపైకి వచ్చాడు. ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకునేలా ఉండటంతో ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం...
కథ: వైజాగ్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు రాధ (రాజ్‌తరుణ్). శారీ డ్రేపర్ (అమ్మాయిలకు చీర కట్టే వృత్తి)గా పని చేస్తుంటాడు. గుణంలో రాముడు. తల్లి గౌరి (అభిరామి)కి అన్ని పనుల్లోనూ సాయం చేస్తుంటాడు. గౌరి పని చేసే బ్యాంకులోనే కొత్తగా ఉద్యోగంలో చేరుతుంది కృష్ణ (మనీషా). ఆమె కాస్త మోడ్రన్ అమ్మాయి. ప్రేమ, పెళ్లి విషయాల్లో తనకంటూ కొన్ని ఆలోచనలుంటాయి. తను గౌరీ తీసుకొచ్చే లంచ్ బాక్స్ తిని రాధ వంటలకు ఫిదా అయిపోతుంది. రాధ మొహం కూడా చూడకుండానే అతనిపై మనసు పారేసుకుంటుంది. రాధ కూడా కృష్ణను చూడకుండానే లంచ్ బాక్స్ ద్వారా ఆమె పంపే లేఖలు చదువుతూ తనతో ప్రేమలో పడిపోతాడు. అయితే ఇద్దరూ ఒకరికొకరు పరిచయమయ్యాక కూడా కృష్ణ అవకాశమిచ్చినా రాధ తన హద్దుల్లోనే ఉంటాడు. వీళ్లిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవ్వగా.. నిశ్చితార్థం సమయంలో కృష్ణ స్నేహితురాలు ఆమెకు ఓ విషయం చెబుతుంది. దీంతో కృష్ణకు రాధ వ్యక్తిత్వంపై అనుమానం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే అతను అసలు పెళ్లికి పనికొస్తాడా? లేదా? తెలుసుకునేందుకు ఓ పరీక్షకు సిద్ధమవుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? రాధ అమ్మాయిలకు దూరంగా ఉండటానికి కారణమేంటి? వీరి పెళ్లికథ సుఖాంతమైందా అన్నదే కథ.
విశ్లేషణ: రాముడిలా ఉండాలనుకునే కుర్రాడిని అమ్మాయిలు.. చుట్టూ ఉన్న సమాజం ఈ రోజుల్లో ఎలా చూస్తుంది? శారీరక సుఖాన్ని అందించడమే నిజమైన మగతనమా.. మనసిచ్చిన అమ్మాయిని ఏ కష్టం రాకుండా కాపాడుకోవడం మగతనమా? అసలు నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు ఈ చిత్రంతో తనదైన శైలిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఈతరం యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథే. నిజానికి దీంట్లో ఓ బోల్డ్ పాయింట్ ఉన్నా.. దర్శకుడు తను చెప్పాలనుకున్న విషయాన్ని వినోదం, భావోద్వేగాలు మేళవించి వీలైనంత వరకు క్లీన్‌గానే చెప్పే ప్రయత్నమే చేశాడు. ప్రథమార్ధం ఓవైపు నాయకానాయికల లవ్‌ట్రాక్‌తో మరోవైపు తల్లీకొడుకుల అనుబంధాలతో సరదా సరదాగా సాగిపోతుంది. రాధ-కృష్ణల ప్రేమ ముదిరి పాకాన పడుతుందో అక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుంది. మరి రాధ.. అమ్మాయిలకు దూరంగా ఉండటానికి వెనకున్న కారణమేంటనే నేపథ్యంగా ద్వితీయార్ధం సాగుతుంది. ప్రథమార్ధంతో పోల్చితే ద్వితీయార్ధం చాలా చప్పగా సాగిన అనుభూతి కలుగుతుంది. రాధను పరీక్షించేందుకు కేరళలోని ఓ ఆశ్రమానికి తీసుకెళ్లడం.. అక్కడ వైద్యం పేరుతో శ్రీకాంత్ అయ్యంగార్ చేసే హంగామా కాస్త బోరింగ్. కాకపోతే ఆ ట్రాక్‌లో వచ్చే సింగీతం శ్రీనివాస్, లీలా శాంసన్ ఎపిసోడ్ అందర్నీ హత్తుకుంటుంది. ఇక రాధ, కృష్ణ విడిపోయిన తీరు.. ఆ తర్వాత రాధ పడే మానసిక వేదన కథను భావోద్వేగభరితంగా మారుస్తుంది. ఒక రొటీన్ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది.
ఇంకా చదవండి: ‘భలే ఉన్నాడే’ మూవీ రివ్యూ : ఎంగేజింగ్ న్యూ ఏజ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Bhaleunnade # Rajtarun # Manishakandkur