మూవీ రివ్యూ : లవ్ థ్రిల్లర్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’
1 month ago | 5 Views
నిఖిల్ సిద్దార్థ్ హీరోయిన్ గా, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లవ్ థ్రిల్లర్ సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మాణంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా ఎప్పుడో తీసినా అనేక కారణాలతో ఇన్నాళ్లు వాయిదా పడి ఇప్పుడు రిలీజయింది. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 8, 2024) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...
కథ విషయానికొస్తే.. రేసర్ అవ్వాలనుకుంటున్న రిషి(నిఖిల్) తన కాలనీలోనే ఉండే తార(రుక్మిణి వసంత్)ని ప్రేమిస్తాడు. కానీ తనతో మాట్లాడే ధైర్యం లేక ఒక రోజు తార ఫోన్ కి తన ప్రేమ విషయం మెసేజ్ చేస్తాడు. కానీ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రిప్లై వస్తుంది. దీంతో లవ్ ఫెయిల్యూర్ అయిన రిషి తనతో అసలు మాట్లాడకుండానే రేసర్ గా పనిచేయడం కోసం లండన్ వెళ్తాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్) పరిచయమై తనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. కానీ పెళ్లి రోజు తులసి కనిపించకుండా పోతుంది.
కొన్నాళ్ల తర్వాత తార కూడా లండన్ వచ్చి రిషికి తారసపడుతుంది. మళ్ళీ వీరిద్దరి మధ్యలో ప్రేమ మొదలవుతుంది. తార ప్రపోజ్ చేసే టైంకి మిస్ అయిన తులసి వస్తుంది. దీంతో తార రిషిని వదిలేసి వెళ్ళిపోతుంది. అదే సమయంలో తులసి హత్యకు గురవుతుంది. అదే సమయంలో ఓ లండన్ డాన్ బద్రి నారాయణ్(జాన్ విజయ్) రిషి, అతని ఫ్రెండ్ యాజీ(వైవా హర్ష)ని ఓ డివైజ్ కోసం కిడ్నాప్ చేస్తారు. అసలు వీళ్ళను ఎందుకు కిడ్నాప్ చేసారు? ఆ డివైజ్ ఏంటి? వెళ్లిపోయిన తులసి మళ్ళీ ఎందుకు వచ్చింది? తార – రిషి ప్రేమ ఫలించిందా?తులసిని ఎవరు హత్య చేసారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ.. ఈ సినిమా ఎప్పుడో కొన్నేళ్ల క్రితం తీసినా కానీ పలు కారణాలతో ఈ సినిమా ఇన్నాళ్లు ఆగిపోయి ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాని ఎక్కువ ప్రమోట్ చేయకుండానే సింపుల్ గా రిలీజ్ చేసారు. గతంలో సుధీర్ వర్మ – నిఖిల్ కాంబోలో స్వామి రారా, కేశవ సినిమాలు వచ్చి మెప్పించాయి. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాలో స్క్రీన్ ప్లే కొంచెం కష్టంగానే రాసుకున్నాడు. తులసి చనిపోయే సీన్ తో సినిమా ఓపెన్ చేసి ఒకేసారి రెండు లవ్ స్టోరీలు, ఓ క్రైం స్టోరీ నడిపిస్తూ వాటన్నిటిని తీసుకొచ్చి సెకండ్ హాఫ్ లో కలుపుతాడు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోరింగ్ అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్ట్ లు రివీల్ చేస్తుంటే ఆసక్తిగా ఉంటుంది. ఈ సినిమాని ఇంకొంచెం హీరో, హీరోయిన్స్ ప్రమోట్ చేసి ఉంటే ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉండేది. కన్నడ సినిమా ‘సప్త సాగరాలు దాటి’తో తెలుగు వాళ్లకు బాగా నచ్చేసిన రుక్మిణి వసంత్ కి ఇది మొదటి తెలుగు సినిమా కావడం గమనార్హం.
నటీనటుల పర్ఫార్మెన్స్.. నిఖిల్ రిషి పాత్రలో బాగానే నటించాడు. ఇది ఎప్పుడో సినిమా కావడంతో ఆ లుక్, యాక్టింగ్ ఇప్పటి నిఖిల్ కి డిఫరెంట్ అనిపిస్తాయి. రుక్మిణి వసంత్ తన క్యూట్ నటనతో మెప్పించింది. దివ్యాంశ కౌశిక్ కూడా రెండు వేరియాక్షన్స్ లో తన నటనతో అదరగొట్టేసింది. డాన్ పాత్రలో బద్రి నారాయణ కామెడీ విలన్ గా బాగానే నటించారు. వైవా హర్ష, అజయ్, సత్య, సుదర్శన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు కూడా యావరేజ్. కొన్ని చోట్ల డబ్బింగ్ మిస్ అయింది. స్వామిరారా స్క్రీన్ ప్లేతోనే ఓ కథని మళ్ళీ కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు సుధీర్ వర్మ. నిర్మాణ పరంగా మాత్రం SVCC బ్యానర్ బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ అంతా లండన్ లోనే జరిగింది.
రేటింగ్: 3.25
ఇంకా చదవండి: సినిమా రివ్యూ : ‘గ్యాంగ్ స్టర్'.