'మత్తువదలరా-2' మూవీ రివ్యూ: మర్డర్‌ కేసు ఛేదన!

'మత్తువదలరా-2' మూవీ రివ్యూ: మర్డర్‌ కేసు ఛేదన!

3 months ago | 46 Views

కొనసాగింపు సినిమాలకు, ఫ్రాంఛైజీలకు తెలుగు చిత్రసీమ బాగా అలవాటుపడిపోయింది. ఆ కోవలో రూపొందిన చిత్రమే 'మత్తు వదలరా-2'. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా  కథానాయకుడిగా 'మత్తు వదలరా'తో పరిచయమై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే బృందం చేసిన ప్రయత్నమే 'మత్తువదలరా-2'.  మరి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం... 

కథ:  డెలివరీ ఏజెంట్స్‌ ఉద్యోగాలు ఊడటంతో బాబూ మోహన్‌ (శ్రీసింహా), యేసు (సత్య) ఎన్నో పాట్లు పడి హై ఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్‌ ఏజెంట్స్‌గా చేరతారు. కిడ్నాప్‌ కేసుల్ని ఛేదించి, నిందితుల్ని పట్టుకోవడంలో ఆరితేరిపోతారు. ఆ క్రమంలోనే చేతివాటం ప్రదర్శిస్తూ కొద్ది మొత్తంలో డబ్బు తస్కరిస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇలా కొంచెం కొంచెం సంపాదన ఎంత కాలమని, కొడితే కుంభ స్థలాన్ని కొట్టాలని ఓ నిర్ణయానికొస్తారు. ఆ సందర్భంలోనే ఓ కిడ్నాప్‌ కేసు వస్తుంది. రూ.2 కోట్లు లావాదేవీలతో ముడిపడిన కేస్‌ అది. ఆ కేసును ఛేదించి, దాంతో సంబంధం ఉన్న రూ.2 కోట్లు సొంతం చేసుకుకోవాలనే వ్యూహంతో రంగంలోకి దిగుతారు. కానీ, అనూహ్యంగా కిడ్నాప్‌నకు గురైన యువతి వీళ్ల కారులోనే శవమై తేలుతుంది. వీళ్లే కిడ్నాప్‌ చేశారనే రుజువుతో కూడిన ఓ వీడియో కూడా బయటికొస్తుంది. మరింతకీ ఆ హత్య చేసిందెవరు? ఈ కేస్‌ నుంచి బాబు మోహన్‌, యేసు బయట పడ్డారా? లేదా? డబ్బు సంపాదించాలనే వీళ్ల కోరిక నెరవేరిందా అన్నదే చిత్ర కథ. 

 విశ్లేషణ:  కొనసాగింపు చిత్రం అనగానే అంతకుముందు వచ్చిన సినిమాతో పోల్చి చూడటం మొదలవుతుంది. అయితే కథ, కథనాల పరంగా మెరుపులు లేకపోవడం ఈ సినిమాకి ప్రధాన లోపం. తొలి సినిమా తరహాలోనే బాబూ మోహన్‌, యేసుదాసుకి డబ్బుపై ఆశ పుట్టడం, తస్కరణ కోసం ప్లాన్‌ చేయడం, తీరా కథ అడ్డం తిరిగి సమస్యల్లో చిక్కుకోవడం, వాటినుంచి బయట పడేందుకు పడే పాట్లు, ఆ పాట్లు పుట్టించే హాస్యం. ఇదే 'మత్తువదలరా-2' కూడా. తొలి సినిమాలోని 'ఓరి నా...’ సీరియల్‌ ఇందులోనూ కొనసాగుతుంది. కాకపోతే, ఈసారి రచనలో బలం లేకపోవడంతో తొలి సినిమా స్థాయిలో సహజంగా, ఆ మోతాదులో హాస్యం పండదు. డెలివరీ ఏజెంట్స్‌ కాస్త స్పెషల్‌ ఏజెంట్స్‌ ఎలా అయ్యారో, వాళ్ల తస్కరణ ఈసారి ఎలా సాగుతుందో చూపిస్తూ సినిమాని మొదలుపెట్టాడు దర్శకుడు. ఆ సన్నివేశాలన్నీ నవ్వుల్ని పంచుతాయి. రూ.2 కోట్లతో ముడిపడిన కిడ్నాప్‌ వ్యవహారం నుంచే కథలో డ్రామా మొదలవుతుంది. ఊహించని విధంగా ఆ కిడ్నాప్‌ కేసు ప్రధాన పాత్రధారుల మెడకు చుట్టుకోవడం, దాన్నుంచి వాళ్లు బయట పడేందుకు చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. విరామ సన్నివేశాలు కథకి మంచి మలుపునిస్తూ ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతాయి. హత్య కేసు నుంచి ఆ ఇద్దరూ ఎలా బయట పడతారన్నది ద్వితీయార్ధంలో కీలకంగా మారుతుంది. తాము ఆ కేసులో ఎలా ఫ్రేమ్‌ అయ్యామో ప్రధాన పాత్రధారులు కనుక్కుంటూ, అసలు సూత్రధారులెవ్వరో కనిపెట్టే క్రమం సినిమాని ఓ ఇన్వెస్టిగేషన్‌ డ్రామాగా మార్చేసింది. ఆ క్రమంలో కామెడీ మోతాదు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. మొత్తంగా వన్‌ లైనర్స్‌తో కూడిన పంచ్‌లు, సత్య చేసే అల్లరి, ట్రెండీ డైలాగ్స్‌, అగ్ర తారల సినిమాలకి సంబంధించిన రెఫరెన్సులు సినిమాని సందడిగా మార్చేశాయి. ఈ తరహా చిత్రాల్లో చమత్కారాన్ని ఆస్వాదించాలి కానీ, తర్కం గురించి ఆలోచించకూడదు.కాల భైరవ సంగీతం చిత్రానికి ప్రధాన బలం. కెమెరా, ఎడిటింగ్‌ విభాగాలూ చక్కటి పనితీరుని కనబరిచాయి. దర్శకుడు రితేష్‌ రాణా మార్క్‌ సంభాషణలు నవ్విస్తాయి. కథనం పరంగానే పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది.

ఇంకా చదవండి: మూవీ రివ్యూ: రాధాకృష్ణల లవ్‌ స్టోరీ...'భలే ఉన్నాడే'

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# MathuVadalara2     # Satya     # RiteshRana    

trending

View More