‘లగ్గం’ మూవీ రివ్యూ :   మెప్పించే కథ!

‘లగ్గం’ మూవీ రివ్యూ : మెప్పించే కథ!

2 days ago | 5 Views

(చిత్రం : ‘లగ్గం’ ,  విడుదల తేదీ : 25, అక్టోబర్ -2024, రేటింగ్ : 2./5, నటీనటులు : సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్, రోహిణి, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు తదితరులు, దర్శకత్వం : రమేష్ చెప్పాల,  నిర్మాత : సుభిషి వేణుగోపాల్ రెడ్డి, సంగీత దర్శకుడు : చరణ్ అర్జున్, నేపథ్య సంగీతం : మణిశర్మ, సినిమాటోగ్రఫీ : బాల్ రెడ్డి, ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి)

పూర్తి ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన సినిమా ‘లగ్గం’. పక్కా  తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఎమోషన్స్‌తో అలరిస్తుందని  ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ చెబుతూ వచ్చారు. టాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ  ‘లగ్గం’ ఈ శుక్రవారం (25, అక్టోబర్ -2024) థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను  ఈ మేరకు  ఆకట్టుకుందో  తెలుసుకుందాం... 

కథలోకి వెళదాం...  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తన మేనల్లుడు చైతన్య(సాయి రోనక్)ని తన కూతురు మానస(ప్రగ్యా నగ్రా)కి ఇచ్చి పెళ్లిచేయాలని రాజేంద్ర ప్రసాద్ భావిస్తాడు. ఈ మేరకు తన చెల్లి(రోహిణి)తో మాట్లాడి సంబంధం కుదుర్చుతాడు. ఆమె కూడా తన మేనకోడల్ని తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. ఈ క్రమంలో పెళ్లికి ఏర్పాట్లు కూడా   చేస్తారు. అనుకోని విధంగా వీరిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఇంతకీ వీరి పెళ్లి ఎందుకు ఆగిపోయింది..?  పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరు..? చైతన్యతో పెళ్లికి మానస నిజంగానే ఒప్పుకుందా..? చివరికి వీరిద్దరి పెళ్లి జరుగుతుందా లేదా..? అనేది తెలియాలంటే సినిమాచూడాల్సిందే... 

విశ్లేషణ:  ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఇష్టపడేవారిని ఈ ‘లగ్గం’ ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. ‘లగ్గం’ అనే ఆసక్తికర టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా  ప్రేక్షకులను ఎమోషనల్‌గా కొంతమేర ఆకట్టుకుంది.  అయితే, సినిమాలో స్లోగా సాగే స్క్రీన్‌ప్లే, కథను నెరేట్ చేసిన విధానం కొంచెం మెరుగ్గా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకా బెటర్‌గా ఉండేది. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఎమోషన్స్‌ను ఇష్టపడేవారిని ఈ ‘లగ్గం’ మూవీ కొంతమేర మెప్పించొచ్చు. తెలంగాణ యాసలో, ఇక్కడి సంప్రదాయాలను మరోసారి ఆడియెన్స్‌కు పరిచయం చేస్తారు. చక్కటి ఎమోషన్స్‌తో సాగే కథ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది. ఇందులోని నటీనటులు తెలంగాణకు చెందని వారు అయినా, వారు పలికే తెలంగాణ యాస ఆకట్టుకుంటుంది. కథ సెకండాఫ్‌లో కాస్త సీరియస్ మోడ్‌లోకి వెళ్లినా, అనవసరమైన కామెడీ పెట్టి సినిమాను సాగదీసినట్లుగా ప్రేక్షకులు ఫీల్ అవుతారు. సీనియర్ ఆర్టిస్టులు కూడా డైలాగులను బలవంతంగా పలికినట్లు అనిపించడం ప్రేక్షకులను ఆకట్టుకోదు.  ఎమోషనల్ కంటెంట్ అయినప్పటికీ ఈ సినిమాలోని పేస్ చాలా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు ఫ్లాట్ సీన్స్ వస్తుండటం ప్రేక్షకులను ఆకట్టుకోవు. ఇంట్రెస్టింగ్ అంశాలు, ఆకట్టుకునే పాటలు లేకపోవడం ఫస్ట్ హాఫ్‌కు డ్యామేజ్ చేశాయి. నటీనటులకు కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ ఫస్ట్ హాఫ్‌లో కనిపించకపోవడం మైనస్.  సాయి రోనక్ తన పాత్రలో చక్కగా నటించాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో చక్కటి ప్రతిభ కనబరిచాడు. నటి రోహిణి కూడా తన నటనతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. రఘుబాబు, సప్తగిరి, రచ్చ రవి లాంటి కమెడియన్స్ ఆకట్టుకున్నారు. 

టెక్నీకల్ గా చూస్తే...   ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా బీజీఎం నిలిచింది. సెకండాఫ్‌లోని ఓ మాస్ బీట్‌తో వచ్చే సాంగ్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సాంగ్ రెండూ ఆకట్టుకున్నాయి. సెకండాఫ్‌లోని ఓ ట్రాజెడీ సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో నటీనటుల పర్ఫార్మెన్స్ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటాయి. దర్శకుడు రమేశ్ చెప్పాల ఎంచుకున్న కథ ప్రేక్షకులను ఎమోషనల్‌గా సినిమాకు కనెక్ట్ చేస్తుంది. అయితే కథనం విషయంలో ఆయన కొంతమేర జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా రిజల్ట్ ఇంకా బెటర్‌గా ఉండేది. ఫస్ట్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే స్లోగా సాగింది. చరణ్ అర్జున్ సంగీతం బాగుంది. రెండు పాటలు ప్రేక్షకులకు నచ్చుతాయి. మణిశర్మ బీజీఎం ఎమోషనల్ సీన్స్‌ను పండించింది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా కలర్‌ఫుల్‌గా చూపెట్టారు. ఎడిటింగ్  ఓకే.  నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి.

ఇంకా చదవండి: 'పొట్టేల్' మూవీ రివ్యూ : విభిన్నమైన ఎమోషనల్ డ్రామా !

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# లగ్గం     # సాయి రోనక్     # ప్రగ్యా నగ్రా     # రాజేంద్ర ప్రసాద్