L2: ఎంపురాన్ మూవీ రివ్యూ :  పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

L2: ఎంపురాన్ మూవీ రివ్యూ : పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

4 days ago | 5 Views

చిత్రం : L2: ఎంపురాన్

విడుదల : 2025-03-27 

రేటింగ్ 3.25/5 దర్శకత్వం: పృథ్వీరాజ్ సుకుమారన్ 

నటీనటులు: మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌, 

మంజు వారియర్, టొవినో థామస్, 

అభిమన్యు సింగ్, సాయికుమార్,

 సూరాజ్ వెంజరాముడు, 

ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, 

సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు 

కథ: మురళీ గోపి 

నిర్మాతలు: ఆంటోని పెరుంబవూర్, గోకుళం గోపాలన్ 

సినిమాటోగ్రఫి: సుజిత్ వాసుదేవ్ 

ఎడిటింగ్: అఖిలేష్ మోహన్ 

మ్యూజిక్: దీపక్ దేవ్ 

బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకుళమ్ మూవీస్

మోహన్‌లాల్‌ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తూ నటించిన మూవీ ఎల్‌ 2 ఎంపురాన్‌. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఎల్‌2 ఎంపురాన్‌(లూసిఫర్‌ 2). పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇందులో మరో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. 2019లో వచ్చిన `లూసిఫర్‌`కిది సీక్వెల్. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఆ మూవీ పెద్దవిజయం సాధించింది. తెలుగులో చిరంజీవి దీన్ని `గాడ్‌ ఫాదర్‌`గా రీమేక్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత సీక్వెల్‌ వస్తుంది. ఇందులో అభిమాన్యు సింగ్‌, టోవినో థామస్‌, మంజు వారియర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించా. ఆశిర్వాద్‌ సినిమాస్‌, శ్రీ గోకులమ్‌ మూవీస్‌ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆంటోని పెరుంబవూర్‌, గోకులమ్‌ గోపాలన్‌ నిర్మాతలు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్‌ రాజు విడుదల చేశారు.  నేడు గురువారం (మార్చి 27) ఈ చిత్రం విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందో  తెలుసుకుందాం. .. 

కథ: జతిన్ రామ్‌దాస్ (టొవిన్ థామస్)కేరళ రాష్ట్ర ఎన్నికలకు సిద్దమవుతూ తన తండ్రి పీకేఆర్ (సచిన్ ఖేడ్కర్) స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టాలనుకొంటాడు. అయితే తన సోదరుడి నిర్ణయంతో షాక్ తిన్న ప్రియదర్శిని రాందాస్ (మంజు వారియర్) తన తండ్రి పార్టీ ఐయూఎఫ్‌లో చేరుతుంది. దాంతో సెంట్రల్ పార్టీ ఆమెను అరెస్ట్ చేస్తుంది. పీకేఆర్ కుటుంబ కలహాలను పరిష్కరించడానికి స్టీఫెన్ (మోహన్ లాల్) రంగంలోకి దిగుతాడు.  పీకేఆర్ స్థాపించిన ఐయూఎఫ్ పార్టీ నుంచి జతిన్ ఎందుకు బయటకు వచ్చాడు? ప్రియదర్శిని ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? బల్రాజ్ అలియాస్ బాబా భజరంగీ కేరళ రాజకీయాల్లో ఎందుకు తలదూర్చాడు? నెడూంపల్లి నుంచి స్టీఫెన్ ఎందుకు? ఎక్కడికి వెళ్లిపోయాడు? నెడూంపల్లిలో డ్యామ్ కట్టే విషయంలో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకొన్నాయి? తన నియోజకవర్గాన్ని కాపాడుకొనేందుకు స్టీఫెన్ ఏం చేశాడు? స్టీఫెన్‌కు నీడలా ఉండే సయీద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఎవరు? సయీద్ ఎవరిపై పగ తీర్చుకోవాలనుకొన్నాడు? చివరకు జతిన్ రామ్ దాస్‌ పరిస్థితి ఏమైంది? అబ్రామ్ ఖురేషి (మోహన్ లాల్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఎంపురాన్ సినిమా కథ. 


విశ్లేషణ: ఈ  L2: ఎంపురాన్ సినిమా యాక్షన్, ఎమోషన్స్, పాలిటిక్స్ మిళితం చేసి రూపొందించిన చిత్రం. లూసిఫర్‌ సినిమాలో అనుసరించిన పంథానే ఈ మూవీకి పాటించి.. చాలా సేఫ్‌గా గేమ్ ప్లే చేశారు. మోహన్ లాల్ ఎలివేషన్స్‌పై ఎక్కువగా ఆధారపడి ఉండటం రొటీన్‌గా మారింది. సినిమాలో చాలా వరకు కేరళా రాజకీయాలను ప్రతిబింబించేలా రూపొందించారు. వాటి చుట్టూనే కథంతా సాగుతుంది. రాజకీయ పరిణామాలను ఉత్కంఠభరితంగా నడిపించారు. కామన్‌ ఆడియెన్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. మంజు వారియర్‌ రాజకీయక్రియా శీలక ఎంట్రీ కూడా అదిరిపోయింది. అయితే సినిమాలో చాలా లేయర్లు ఉంటాయి. వాటిని లింక్‌ చేసే విషయంలో విఫలమయ్యాడు దర్శకుడు. ఒక కథకి, మరో కథకి సంబంధం లేదు. అదే ఆడియెన్స్ ని డీవియేట్‌ చేస్తుంది. ప్రారంభంలో చూపించిన కథకి, లూసిఫర్‌ కథకి సంబంధం లేదు. కేవలం పృథ్వీరాజ్‌ పాత్ర కోసం ఆయా సీన్లు పెట్టినట్టుగా ఉంది. అలాగే డైలాగులు పెద్ద మైనస్‌. క్రిస్టియన్‌ పదాలను ఒరిజినల్‌గా ట్రాన్స్ లేట్‌ చేయడంతో సహజత్వం మిస్‌ అయ్యింది. క్రిస్టియన్‌ని ఫాలో అయ్యేవారికి మాత్రమే అర్థమయ్యేలా ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు నెటివిటీని ఫాలో కావాల్సింది. మరోవైపు స్టీఫెన్‌, లూసిఫర్‌ పాత్రల్లో ఉన్న సస్పెన్స్ కూడా కొంత కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ అవుతుంది. విదేశాల్లో జరిగే సీన్లు, లోకల్‌ పాలిటిక్స్ కి లింక్‌ చేసే సీన్లు కూడా కొంత కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేసేలా ఉన్నాయి. కథ, కథనాల విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ స్క్రీన్ ప్లే నార్మల్ ఆడియెన్స్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. లెంగ్త్ ఈ సినిమాకు కొంత మైనస్. యాక్షన్ లవర్స్, మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫ్యాన్స్‌కు, లూసిఫర్‌ను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ సినిమా ఇరాక్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌లో మొదలై ఆసక్తిని కలిగిస్తుంది. ఆ తర్వాత 2002 సంవత్సరంలో జరిగిన మతకల్లోల ఎపిపోడ్ హృదయాన్ని పిండేసేలా పృథ్వీరాజ్ సుకుమారన్ చూపించాడు. సుదీర్ఘంగా ఎపిసోడ్‌తో దర్శకుడిగా తాను ఏం చెప్పబోతున్నాడో భారీ హింట్ ఇచ్చాడు. కానీ ఫస్టాఫ్‌ను సాగదీసి.. ఓ దశలో సహనానికి పరీక్ష పెట్టేలా చేశాడు. కానీ సన్నివేశాలు, భారీ ఎపిసోడ్స్ విషయంలో బోర్ కొట్టుకుండా తన ప్రతిభను చూపించాడు. కేరళ రాజకీయాలు, విదేశాల్లో కుట్రల నేపథ్యంగా అబ్రామ్ ఖురేషి పాత్రను పరిచయం చేసి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు.  ఇక సెకండాఫ్‌లో సాగదీత లేకుండా కేరళ పాలిటిక్స్‌‌తో కథను రసవత్తరంగా చెప్పాడు. వారసత్వం రాజకీయాలు, పదవి కోసం గొడవలు రొటీన్‌గా ఉన్నప్పటికీ.. ఆ పాయింట్ చుట్టే స్టీఫెన్ అలియాస్ ఖురేషి పాత్ర తిరుగుతుంది. కథలో ట్విస్టులు, టర్నులతోపాటు హీరోయిజం, ఎలివేషన్‌తో పృథ్వీరాజ్ తన పని కానిచ్చేశాడు. అయితే పార్ట్ 2 విషయానికి వస్తే.. బలమైన, కొత్త పాయింటేమీ లేకపోవడం మైనస్‌గా అనిపిస్తుంది. ఇక పార్ట్ 3 కోసం మంచి ఎలివేషన్ ఎపిసోడ్ ఇచ్చి మరింత క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశాడనపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే.. సినిమాలోని అన్ని పాత్రలను బాలెన్స్ చేస్తూ.. ప్రతీ పాత్రకు తగిన క్యారెక్టరైజేషన్‌ డిజైన్ చేయడం ఈ సినిమాకు బ్యూటీగా మారింది. ఇక మోహన్ లాల్ పాత్ర సన్నివేశాలు రొటీన్ అవుతున్నాయనే సమయంలో ఎంట్రీ ఇచ్చి స్టోరీకి హై ఇచ్చే ప్రయత్నం చేసింది. మోహన్ లాల్ తన ఇమేజ్ ఏ మాత్రం తగ్గుకుండా హీరోయిజం, హుందాగా నటించాడు. ఇక జతిన్, మంజు వారియర్ కూడా సినిమాకు బలంగా నిలిచే విధంగా ఫెర్ఫార్మెన్స్ చేశారు. ప్రధానం మంజు వారియర్.. పొలిటికల్ ఎంట్రీ ఎపిసోడ్ సినిమాకు క్రేజీగా మారింది. చివర్లో సయీద్ పాత్ర ద్వారా పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌లో హీరోయిజాన్ని చూపించి సినిమాను పరిపూర్ణంగా మార్చే ప్లాన్ చేశారు. మతకల్లోలా ఎపిసోడ్‌లో అమీర్ ఖాన్ సోదరి తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. కార్తీకేయ దేవ్ మంచి యాక్టింగ్‌తో ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు దీపక్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫి హైలెట్‌గా నిలుస్తాయి. విదేశాల్లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించాల్సి ఉందనిపిస్తుంది. ఫస్టాఫ్ నిడివి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఆ విషయంలో కొంత కేర్ తీసుకొని ఉంటే.. సినిమా కథనంలో వేగం పెరిగి ఉండేదనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి. నటీనటుల ఎంపిక, లొకేషన్స్ సెలక్షన్‌తో సినిమాకు రిచ్‌నెస్ తెచ్చిపెట్టింది.  ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్‌ చిత్రానికి కంటిన్యూగా దీన్ని తెరకెక్కించారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. పీఆకేఆర్‌ వారసత్వంగా వచ్చిన జితిన్‌ తప్పుదారి పట్టడం, రాష్ట్రాన్ని అవినీతి మయంగా చేసి తాను స్వలాభం పొందే ప్రయత్నం చేయగా దాన్ని లూసిఫర్‌, ప్రియదర్శిని రామ్‌ దాస్‌ ఎలా ఎదుర్కొన్నారనేది ఈ మూవీ సారాంశం. ప్రారంభంలో 2002 నాటి మత కలహాలు చూపించారు. ఆ సమయంలో సయ్యాద్‌ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని చూపించి కథలో అటెన్షన్‌ క్రియేట్‌ చేశారు. లూసిఫర్‌ ఎంట్రీకి సంబంధించిన ముందస్తు ప్రణాళిక, ఆయన రావాల్సిన రాజకీయ పరిణామాలను క్రియేట్‌ చేసిన తీరు బాగుంది. మరోవైపు స్టీఫెన్‌గా మోహన్‌లాల్‌ ఎంట్రీ సీన్లు అదిరిపోయాయి. అయితే ఆయన ఎంట్రీ కోసం చాలా టైమ్‌ తీసుకోవడమే కొంత అసహనంగా అనిపిస్తుంది. బాగా లాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ మోహన్‌ లాల్‌ ఎంట్రీ సీన్‌ మాత్రం అదిరిపోయింది. లేట్‌గా అయినా వాహ్‌ అనిపించేలా ఆయన ఎంట్రీ ఉండటం విశేషం. భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌తో కూడిన ఆ సీన్లు బాగున్నాయి. హైలైట్‌గా నిలిచాయి. ఓ వైపు స్టీఫెన్‌ విదేశాల్లో మాఫియాని అంతం చేస్తూ రావడం, మరోవైపు కేరళా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలను చూపించిన తీరు బాగుంది. ఆద్యంతం ఎంగేజ్‌ చేసేలా ఉంది. ఇంటర్వెల్‌లో స్టీఫెన్‌ కి సంబంధించిన సన్నివేశాలను చూపించి ఉత్కంఠకి గురి చేశారు. ట్విస్ట్ తో క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు. సెకండాఫ్‌లో ఆ ట్విస్ట్ రివీల్‌ చేసిన తీరు బాగుంది. జితిన్‌ని కిడ్నాప్‌ చేసి ఆయన వార్నింగ్‌ ఇవ్వడం, కేరళా రాజకీయాల్లో మంజు వారియర్‌ కీలకంగా మారడం వంటి సీన్లు గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉన్నాయి. లూసిఫర్‌ మూవీ చాలా వరకు స్థానిక రాజకీయాలపై సాగుతుంది. కనెక్టివిటీ ఉంది. కానీ `ఎల్‌2 ఎంపురాన్‌`లో మాత్రం మోహన్‌లాల్‌ పాత్ర విదేశాల్లోనే ఉంటుంది. ఆయన ఎందుకు పోరాడుతున్నాడు? దేనికోసం పోరాడుతున్నాడనేది క్లారిటీ మిస్‌ అయ్యింది. దీనికితోడు ఎలివేషన్లు ఓవర్‌గా ఉన్నాయి. మోహన్‌లాల్‌ ఎంట్రీ ఇచ్చిన ప్రతిసారి ఎలివేషన్ ఇవ్వడం టూ మచ్‌గా ఉంటుంది. అలాగే యాక్షన్‌ సీన్లు, ఆయన పాత్రలోని సన్నివేశాలు విదేశాల్లో సాగడంతో హాలీవుడ్‌ సినిమాలను, బాలీవుడ్‌ యాక్షన్‌ మూవీస్‌ని తలపిస్తాయి. మన అనే ఫీలింగ్‌ మిస్‌ అయ్యింది. అయితే స్టయిలీష్‌ గా వాటిని తీర్చిదిద్దడం, మోహన్‌లాల్‌ పాత్రని కూడా అంతకు మించి స్టయిలీష్‌గా చూపించడం అదిరిపోయింది. మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లు బాగున్నాయి. కానీ రియాలిటీకి దగ్గరగా సినిమా కథని నడిపిస్తే బాగుండేది. ఇంటలిజెంట్‌ స్క్రీన్‌ప్లే కూడా కొంత ఇబ్బంది పెట్టే అంశమని చెప్పొచ్చు. పాన్‌ ఇండియా మోజులో పడి మూలాలను మర్చిపోయినట్టుగా ఈ మూవీ ఉంది. మనవైన అంశాలకు, ఎలిమెంట్లకి ప్రయారిటీ ఇస్తే బాగుండేది. కనీసం బ్యాలెన్స్ చేసినా బాగుండేది. విలన్‌ రోల్‌ కూడా బలంగా లేదు. సరళమైన కథనంతో సినిమాని నడిపిస్తే బాగుండేది. కానీ స్టయిలీష్‌ టేకింగ్‌ బాగుంది. ఆడియెన్స్ అది మాత్రమే సరిపోదు.

ఎవరెలా చేశారంటే:  కంప్లీట్‌ యాక్టర్‌ మోహన్‌లాల్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటనతో ఆయన తోపు. ఇందులో ఆయన ఖురేషిగా, స్టీఫెన్‌ గా, లూసీఫర్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన కనిపిస్తే చాలు పూనకాలే అనేలా ఓ రేంజ్‌లో ఎలివేషన్లు ఉన్నాయి. ఉన్నంత సేపు సెటిల్డ్ యాక్టింగ్‌తో అదరగొట్టారు. యాక్షన్‌ సీన్లలోనూ తన జోరు చూపించారు. ఆయన కనిపించేది తక్కువే అయినా సినిమా మొత్తం ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక పృథ్వీరాజ్‌ సుకుమారన్‌  సయ్యాద్‌గా ఫర్వాలేదనిపించారు. ఇందులో డైరెక్షన్‌ చేస్తూ నటించడం పెద్ద టాస్క్. కానీ ఆయన అవలీలగా చేసేశారు. పాత్రలను రక్తికట్టించారు. టోవినో థామస్‌ జతిన్‌ రామ్‌ దాస్‌గా సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించారు. డిఫరెంట్‌ షేడ్స్‌ చూపించారు. పొలిటీషియన్ గా ఆయన ఎత్తులు, పై ఎత్తులు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. మంజు వారియర్‌ సైతం మరోసారి ఆకట్టుకున్నారు. ఆమె పొలిటికల్‌ లీడర్‌గా బాగా చేశారు హుందాగా కనిపించారు. ఆమె ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది. ఇక బాబా భజరంగీగా అభిమాన్యు సింగ్‌ తన పాత్ర పరిధి మేరకు అదరగొట్టాడు. ఇతర పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు.

సాంకేతికవర్గం: ఈ సినిమాకి దీపక్‌ దేవ్‌ సంగీతం అందించారు. ఆయన మ్యూజిక్‌ హైలైట్‌ అని చెప్పాలి. ముఖ్యంగా బీజీఎం విషయంలో ఇరగదీశారు. మాస్‌, స్టయిలీష్‌ బీజీఎంతో పూనకాలు తెప్పించారు. యాక్షన్‌ సీన్లలో ఆ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోప్‌ వాహ్‌ అనిపిస్తుంది. ఎడిటర్‌ అఖిలేష్‌ మోహన్‌ ఓకే అనిపించారు. ఇంకా క్లారిటీగా ట్రిమ్‌ చేయాల్సింది. కథనాన్ని స్పీడ్‌గా చేయాల్సింది. సుజీత్‌ వాసుదేవ్‌ కెమెరా వర్క్ బాగుంది. లావిష్‌ విజువల్స్ కనువిందు చేసేలా ఉన్నాయి. దర్శకుడు పృథ్వీరాజ్‌.. డైరెక్టర్‌గా ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇప్పుడు మరోసారి తన మ్యాజిక్‌ చేశారు. మొదటి సినిమాని మించి దీన్ని తీర్చిదిద్దారు. మోహన్‌ లాల్‌ ఎలివేషన్లు ఒక రేంజ్‌లో చూపించారు. యాక్షన్‌ సీన్లు హైలైట్‌గా తీర్చిదిద్దారు. డైలాగుల విషయంలో కేర్‌ తీసుకోవాల్సింది.
ఇంకా చదవండి:  'పెళ్లి కాని ప్రసాద్' మూవీ రివ్యూ : అలరించని కామెడీ !

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# L2     # మోహన్‌లాల్‌    

trending

View More