!['కల్కి 2898 ఏడీ' మూవీ రివ్యూ : హాలీవుడ్ రేంజ్ లో కళ్లు చెదిరే విజువల్స్.!](https://cdn.mobilemasala.com/image/post-img/kalki27june2024.webp)
'కల్కి 2898 ఏడీ' మూవీ రివ్యూ : హాలీవుడ్ రేంజ్ లో కళ్లు చెదిరే విజువల్స్.!
3 days ago | 32 Views
(చిత్రం : 'కల్కి 2898 ఏడీ' , విడుదల : జూన్ 27, 2024, రేటింగ్:4/5 , నటీనటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోనే, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్ తదితరులు కథ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, నిర్మాత: సి. అశ్వినీదత్, సహ నిర్మాతలు : స్వప్న దత్- ప్రియాంక దత్, మాటలు : నాగ్ అశ్విన్- సాయి మాధవ్ బుర్రా, వివేక్ (తమిళ్), సినిమాటోగ్రఫీ : డోర్డ్జే స్టోజిల్కోవిక్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: సంతోష్ నారాయణ్, నిర్మాణం: వైజయంతీ మూవీస్).
తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తంగా చేసిన హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకరు. 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఆయన.. అప్పటి నుంచి బహుభాషా సినిమాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలతో వచ్చి అటు అభిమానులను ఇటు సినీ ప్రేక్షకులను అలరించాడు. మంచి హిట్ కోసం డార్లింగ్ ప్రభాస్ ఎదురుచూస్తున్నాడు. 'బాహుబలి 2' తర్వాత ఆయన చేసిన సినిమాలేవీ విజయం సాధించలేదు. అనుకున్నంతగా ఆడలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. రూ.600 కోట్ల బడ్జెట్ తో భారీ తారాగణంతో నాలుగున్నరేళ్ల నిరీక్షణ తర్వాత ఈ సినిమా విడుదలైంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్‌తో పాటు దిశా పటానీ, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారతీయ పురాణాలను ఆధారంగా తీసుకుని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ పై ముందు నుంచి భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. కలి యుగాంతంలో అవతరించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు.. అంతేకాకుండా మొత్తం మూడు కొత్త ప్రపంచాలను సృష్టించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో సినిమాపై అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయి. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. నేడు (జూన్ 27 గురువారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం....
కథలోకి వస్తే... మహాభారత యుద్దంలో అశ్వత్తామ హత: కుంజర ఎపిసోడ్ తర్వాత జరిగిన మోసానికి తట్టుకోలేక అభిమన్యు భార్య, గర్భవతి శశిరేఖపై ఓ అస్త్రాన్ని అశ్వత్తామ ప్రయోగిస్తాడు. మహిళలపై నీ ప్రతాపమా అంటూ అశ్వత్తామకు శ్రీకృష్ణుడు శాపం పెడతాడు. అయితే కలియుగంలో తనను రక్షించే సమయం వస్తుంది. నన్ను రక్షించిన తర్వాతే నీకు విమోచనం కలుగుతుంది అని శాప విమోచనం గురించి చెబుతాడు. ఆ తర్వాత ఆరు వందల సంవత్సరాల అనంతరం కాశీ పరిసర ప్రాంతంలో అశ్వత్తామ (అమితాబ్ బచ్చన్) భైరవ (ప్రభాస్), సుమతి (దీపిక పదుకోనే), సుప్రీం యాస్కిన్ (కమల్ హాసన్) మధ్య భవిష్యత్ కోసం పోరాటం జరుగుతుంది. జల్సాగా తన వాహనం బుజ్జితో తిరిగే భైరవ ఎవరు? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్ కె. లక్ష్యం ఏమిటి? ప్రాజెక్ట్ K కోసం సుమతితోపాటు అమ్మాయిలను ఎందుకు బలి ఇస్తుంటాడు? యాస్కిన్ సామ్రాజ్యం కాంప్లెక్స్, శంబాల ప్రాంతాల మధ్య పోరాటం ఏమిటి? కాశీలో భైరవ ఏం చేస్తుంటాడు? కట్టుదిట్టమైన కాంప్లెక్స్ నుంచి సుమతి ఎలా తప్పించుకొని అశ్వత్తామను కలుసుకొన్నది? ఇంతకు అశ్వత్తామ కోసం వచ్చిన భైరవ ఎవరు? అశ్వత్తామ శాప విమోచనం జరిగిందా? తప్పించుకొన్న సుమతి కోసం యాస్కిన్ వేటాడాలని ఎందుకు అనుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'కల్కి 2898 ఏడీ' సినిమా కథ.
విశ్లేషణ: పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్.. ఈ మూడు కాలాలకు లింక్ పెడుతూ ఈ కథ రాసుకున్నారు నాగ్ అశ్విన్. అందులోనే అశ్వద్ధామ లాంటి ఇమ్మోర్టల్ కారెక్టర్ తీసుకుని.. అతడి వైపు నుంచే కథ మొత్తం నడిపించారు. మహాభారతంలోని రిఫరెన్సులతో పాటు.. హాలీవుడ్ మార్వెల్ సినిమాల రిఫరెన్సులు కూడా సినిమాలో చాలానే కనిపించాయి. అవన్నీ అత్యున్నతంగా ఉండటం గమనార్హం. కల్కి షూటింగ్ కంటే విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువ టైమ్ తీసుకున్నట్టుంది. ఒక్కో ఫ్రేమ్ కోసం వాళ్లు పడిన కష్టం కనిపించింది. ప్రపంచానికి వచ్చే ఆపదను కాపాడే కథానాయకుడిగా ప్రభాస్, హీరోను సరైన మార్గంలో గైడ్ చేసే గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ సినిమాకు హైలెట్ గా నిలిచారు. ఇంత సీరియస్ సినిమాలోనూ ప్రభాస్ కారెక్టర్‌ను చాలా ఎంటర్టైనింగ్గా డిజైన్ చేసారు నాగ్ అశ్విన్.
'కల్కి 2898 ఏడీ' సినిమాకు పూర్తి క్రెడిట్ అంతా దర్శకుడు నాగ్ అశ్విన్, అమితాబ్‌కు ఇవ్వాల్సిందే. నాగ్ అశ్విన్ రాసుకొన్న కథ, పురాణాలకు, అడ్వాన్స్ టెక్నాలజీ వరల్డ్‌కు కనెక్ట్ చేసిన తీరు ఓ మ్యాజిక్ అనే చెప్పాలి. దర్శకుడు రాసుకొన్న పాత్రలు, అనుసరించిన స్క్రీన్ ప్లే కొత్తగా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది.ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్లో విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బాస్టర్, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది. ఇక ఊహించని క్లైమాక్స్ అయితే పూనకాలే తెప్పించింది. హాలీవుడ్ స్థాయిని మైమరపింపజేసింది. మహాభారతం యుద్దం నేపథ్యంగా కథ మొదలై.. ఆ తర్వాత ఆరువందల ఏళ్ల టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. అత్యాధునిక వాహనాలు, ఊహకు అందని వస్తువులు లాంటి వస్తువులు నిజంగానే థ్రిల్ చేస్తాయి. కొన్ని పాత్రల్లో ఆర్జీవి, ఎస్ఎస్ రాజమౌళి, దుల్కర్ లాంటి పాత్రలు రావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. విశ్రాంతికి ముందు కొద్దిసేపు సినిమా మరో రేంజ్‌కు వెళ్తుంది. మంచి ట్విస్ట్‌తో ఫస్టాఫ్ ముగిసి సెకండాఫ్‌పై అంచనాలు పెరుగుతాయి. ఇక సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుకొన్న ప్రేక్షకుడికి చివరి 30 నిమిషాల సినిమా కొత్త అనుభూతికి గురిచేయడమే కాకుండా సీట్లకు అత్తుకుపోయేలా చేస్తుంది. సెకండాఫ్‌లో అమితాబ్, ప్రభాస్ మధ్య ఫైట్ సినిమాకు ఎనర్జీని ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్, కమల్ (యాస్కిన్) ఎపిసోడ్ సినిమాను సంపూర్ణంగా మంచి సినిమాను చూశామనే సంతృప్తిని కలిగిస్తుంది. ఈ కల్కి చిత్రానికి కి అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపమే తెరపై విలయతాండవం చేసింది. ఇక ప్రభాస్ ఫన్నీ క్యారెక్టర్ సినిమాకు ఫీల్ గుడ్‌గా అనిపిస్తుంది. అలాగే ప్రభాస్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీపిక పదుకోనే ఎమోషనల్ పాత్రలో ఒదిగిపోయింది. కమల్ హసన్‌కు ఈ సినిమాలో చాలా చిన్న పాత్రే. కానీ ఉన్నంత సేపు ఆయన పాత్ర ప్రజెన్స్ తెర మీద కనిపిస్తుంది. సీనియర్ నటి శోభన మంచి పాత్రలో మెప్పించింది. అలాగే ఈ 'కల్కి'లో రాంగోపాల్ వర్మ, దర్శకధీరుడు రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ ప్రత్యేక పాత్రల్లో కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. వీరి పాత్రలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటాయి.
టెక్నికల్ విభాగాల పనితీరును విశ్లేషిస్తే... ముఖ్యంగా సినిమాలో సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ విభాగాల పనితీరు మెచ్చుకునేలా ఉంది. సినిమాటోగ్రఫీ గురించి అయితే.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. డోర్డ్జే స్టోజిల్కోవిక్ కెమెరా సినిమాని ఎంతో రిచ్ గా తెరకెక్కించింది. ప్రతీ ఫ్రేమ్ ని తన కెమెరాలో బంధించింది. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ సోసోగానే ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంతమాత్రంగానే ఉంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ ప్రమాణాలకు అనుగుణంగా సీ అశ్వినీదత్, ప్రియాంక, స్వప్న దత్ అనుసరించిన నిర్మాణ విలువలు బావున్నాయి. మొత్తమీద ఏం తీసాడ్రా.. అచ్చం హాలీవుడ్ సినిమాలా ఉంది అంటారు హాలీవుడ్ రేంజ్ లో కళ్లు చెదిరే విజువల్స్ చూశాక.
ఇంకా చదవండి: మూవీ రివ్యూ : మెసేజ్ ఇచ్చి.. మెప్పించే ‘ఇట్లు... మీ సినిమా’
# Kalki2898ad # Prabhas # Amitabhbachchan