'గేమ్ ఛేంజర్' మూవీ రివ్యూ : ఎమోషనల్, పొలిటికల్ వార్!
5 hours ago | 5 Views
(చిత్రం : గేమ్ ఛేంజర్, విడుదల : 10 జనవరి 2025, రేటింగ్ 3/5, నటీనటులు: రామ్ చరణ్, అంజలి, కియారా అద్వానీ, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ జైరాం, సముద్రకని, బ్రహ్మానందం, సునీల్, రాజీవ్ కనకాల తదితరులు. దర్శకత్వం: ఎస్ శంకర్, నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్, సహ నిర్మాత: హర్షిత్, సమర్పణ: శ్రీమతి అనిత, కథ: కార్తీక్ సుబ్బరాజ్, రచనా సహకారం: ఎస్‌యు వెంకటేశన్, వివేక్, సినిమాటోగ్రఫీ: ఎస్ తిరుణ్ణావుక్కరసు, సంగీతం: ఎస్ ఎస్ తమన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, లైన్ ప్రొడ్యూసర్స్: నరసింహా రావు ఎన్, ఎస్ కే జబీర్ లైన్, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల, కొరియోగ్రాఫర్స్: అన్బరివు, కొరియోగ్రాఫర్స్: ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ, కూర్పు : రూబెన్, సమీర్, సాహిత్యం: రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్)
టాలీవుడ్ ప్రేక్షకులకు సంక్రాంతి కానుకగా వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్”. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ లెవెల్లో నేడు ( 10 జనవరి 2025) విడుదలయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విడుదలకు ముందే ఏర్పడ్డ అంచనాలు అందుకుందో లేదో తెలుసుకుందాం...
కథ: ఏపీలో అభ్యుదయం పార్టీ పేరిట బొబ్బిలి సత్య మూర్తి (శ్రీకాంత్) ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య)కి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీ పై కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్ గా రామ్ నందన్ (రామ్ చరణ్) వస్తాడు. ఐపీఎస్ ఆఫీసర్ నుంచి ఐఏఎస్ గా మారిన రామ్ నందన్ సొంత ఊరు వైజాగ్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఏపీలో సీఎం బొబ్బిలి సత్యమూర్తి కు పార్టీ పరంగా, ప్రభుత్వంలో అవినీతి పరంగా కుమారులు బొబ్బిలి మోపిదేవి , రామచంద్ర నుంచి తలనొప్పులు ఉంటాయి. అనుకోకుండా సీఎం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతాడు. ఆ సమయంలో కుమారులిద్దరూ సీఎం కుర్చిపై ఆశలు పెట్టుకొంటారు. కానీ సీఎం సత్యమూర్తి మాత్రం రామ్ నందన్‌ను ముఖ్యమంత్రిగా, తన వారసుడిగా ప్రకటిస్తాడు. రామ్ నందన్ ఐపీఎస్ నుంచి ఐఏఎస్‌కు ఎందుకు మారాడు? సీఎం సత్యమూర్తికి కుమారుల నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? రామ్ నందన్‌ను సత్యమూర్తి సీఎంగా ఎందుకు ప్రకటించాడు? సీఎం పదవిని రామ్ నందన్ ఎందుకు నిరాకరించాడు? ముఖ్యమంత్రి పదవిని మోపిదేవీకి అప్పగించి అతడికి రామ్ నందన్ ఎలాంటి షాక్ ఇచ్చాడు? దీపిక (కియారా అద్వానీ)తో ప్రేమాయణానికి ఎందుకు బ్రేక్ పడింది? రామ్ నందన్ తన తల్లిదండ్రులు అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (అంజలి)కి ఎందుకు దూరమయ్యాడు? అప్పన్నకు సీఎం సత్యమూర్తికి ఉన్న విభేదాలు ఏంటి? చివరకు మోపిదేవీ సీఎం పదవిపై ఆశలకు రామ్ నందన్ ఎలా చెక్ పెట్టి.. ఏపీని రాక్షస పాలన నుంచి ఎలా కాపాడాడు? మరి తనకి మోపిదేవికి జరిగిన యుద్ధం ఏంటి? ఈ క్రమంలో సత్యమూర్తి రామ్ నందన్ ని ఏపీ ముఖ్యమంత్రి గా ఎందుకు ప్రకటిస్తాడు? తను ముఖ్యమంత్రి అవుదాం అనుకున్న మోపిదేవి ఏం చేస్తాడు? ఇలా రామ్ నందన్ నడుమ మోపిదేవి నడుమ జరిగిన పొలిటికల్ వార్ ఎలా సాగింది? ఈ మొత్తానికి అభ్యుదయ పార్టీ అసలు స్థాపకుడు అప్పన్న(మరో రామ్ చరణ్) కి సంబంధం ఏంటి అనేవి తెలియాలి అంటే చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే...
విశ్లేషణ: దర్శకుడు శంకర్ గత కొన్నాళ్ల నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దానిని చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. కథ కార్తిక్ సుబ్బరాజ్ ది అయినప్పటికీ తన మార్క్ కథనం, బలమైన ఎమోషన్స్ తో నడిపిన విధానం బాగుంది. ప్రతీ నటీనటులు నుంచి బెస్ట్ ని తను రాబట్టారు. స్క్రీన్ ప్లే నడిపిన విధానం సినిమాలో ఎంగేజ్ చేస్తుంది. ఓవరాల్ గా తన వర్క్ సినిమాకి బాగుంది. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులే కాకుండా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరి వారి అంచనాలకి ఏమాత్రం తీసి పోని విధంగా ఉంటుంది. సినిమా విషయంలో శంకర్ చెప్పినట్టే ఆడియెన్స్ ని అటు ఇటు చూడకుండా ఆద్యంతం తెర వైపే చూసే సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ తో క్రేజీ స్క్రీన్ ప్లే తో సినిమా పరుగులు పెడుతుంది. సినిమాలో ఎలివేషన్స్ గాని కొన్ని ట్విస్ట్ బాగా ఆసక్తి కలిగిస్తాయి. ఇక వీటికి మించి శంకర్ మార్క్ కొన్ని కొత్త ఆలోచనలు, తన పొలిటికల్ రిలేటెడ్ సినిమాల్లో కనిపించే మాస్ సన్నివేశాలు తరహాలో ఇందులో కూడా ఉన్నాయి. శంకర్ సినిమాల్లో ముఖ్యం అయ్యిందనే ఆ ఎమోషన్స్. తన హీరోల నుంచి శంకర్ ఏ తరహా పెర్ఫామెన్స్ లని చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి 'గేమ్ ఛేంజర్' లో కూడా అన్ ప్రెడిక్టబుల్ గా రామ్ చరణ్ తన నటనతో షాకిచ్చాడు. గత ఐదేళ్ల క్రితం నుంచి ఆంధ్ర ప్రదేశ్ జరిగిన అస్తవ్యస్త పాలన టార్గెట్‌గా చేసుకొని దర్శకుడు శంకర్ సంధించిన పొలిటికల్ సెటైర్ ఈ సినిమా. ఏపీ మాజీ సీఎం, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పాత్రల మధ్య జరిగిన రాజకీయ ఘర్షణ వాతావరణాన్ని కథకు ఇంధనంగా వాడుకొని.. స్వచ్చమైన ప్రజా పాలనను సాగించే ఓ కలెక్టర్ కథగా శంకర్ తెరకెక్కించారు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడిని పూర్తిగా టార్గెట్ చేసుకొని అవినీతిపై సీనీ అస్త్రాన్ని సంధించే ప్రయత్నం చేయడంలో దర్శకుడు శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కాకపోతే ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ఆయన విజన్ గాడి తప్పిందనిపిస్తుంది. ఏపీలో ఇసుక, ఐరన్ మైనింగ్, గంజాయి వ్యాపారం చేసే మోపిదేవీ, రామచంద్రారెడ్డి అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసే కలెక్టర్ కథతో సినిమాను ముగించి.. మధ్యలో తన కాలేజీలో లవ్ స్టోరీతో ఫస్టాప్‌ను నెగ్గుకొచ్చాడు. అయితే రొటీన్‌గా సాగుతుందనిపించే సమయంలో బ్రహ్మండమైన ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై హైప్ క్రియేట్ చేయడంలో శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో పెంచి అంచనాలకు తగినట్టుగానే అప్పన్న, సత్యమూర్తి జర్నీ, అలాగే పార్వతీతో ప్రజా పోరాటాలను ఆసక్తికరంగా తెరకెక్కించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాడు. సెకండాఫ్‌లో రామ్ నందన్, పార్వతి (తల్లి కొడుకులు) మధ్య సెంటిమెంట్ ఎమోషనల్‌గా మార్చేసిందనే చెప్పాలి. మదర్ సెంటిమెంట్ సీన్లు బాగా వర్క్ అయ్యాయి. అంతా బాగానే వెళ్తుందనే సమయంలో ఎలక్షన్ ఎత్తుగడ సినిమాపై ఉన్న పాజిటివ్ ఫీలింగ్‌ను నెగిటివ్‌గా మార్చింది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు ఊరమాస్ సన్నివేశాలతో రొడ్డ కొట్టుడు ఫైట్స్‌తో సినిమాను ముగించడం నిరాశే అని చెప్పాలి. గేమ్ ఛేంజర్ సినిమా పవర్ ప్యాక్ట్ క్యారెక్టర్లతో రూపొందిన రెగ్యులర్ పొలిటికల్ డ్రామా. ఏపీ ఎన్నికలకు ముందు వచ్చి ఉంటే ఈ మూవీ ఇంపాక్ట్ మరో విధంగా ఉండేదనిపించింది. ఈ సినిమాలో కొన్ని లాజిక్స్‌ను శంకర్ గాలికి వదిలేయడం మింగుడు పడని విషయం. కానీ మదర్ సెంటిమెంట్‌ను ఎలివేట్ చేసిన తీరు బాగుంది. రాంచరణ్, సూర్య, అంజలి, శ్రీకాంత్ పెర్ఫార్మెన్స్‌తో చూసి మంచి అనుభూతిని పొందాలంటే.. థియేటర్‌లోనే చూస్తే థ్రిల్ ఉంటుంది. సంక్రాంతి పండుగ సమయంలో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటింది ఈ తరహా కథలు కొత్తేమి కాదు. అలాగే ఫస్టాఫ్ లో మొదటి పది పదిహేను నిమిషాలు కొంచెం సో సో గానే ఉంటుంది. రామ్ చరణ్ పై ఇంట్రడక్షన్ ఫైట్ ని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే జరగండి సాంగ్ విజువల్స్ విఎఫ్ఎక్స్ వరకు సినిమాలో బాగలేవు. ఆ సాంగ్ కి థమన్, ఎస్ జె సూర్య చాలా హైప్ ఇచ్చారు కానీ ఆ రేంజ్ లో లేదు. ఇంకా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడా లైట్ గా రొటీన్ అనిపించవచ్చు. వీటితో పాటుగా అప్పన్న పాత్రని ఇంకొంచెం సేపు చూపించినా బాగుండు అనిపిస్తుంది కదిలించే ఎమోషన్స్ మాంచి మాస్ మసాలా పొలిటికల్ సీన్స్ సినిమాలో ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. అయితే కొంచెం రొటీన్ కథ, కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి.
ఎవరెలా చేశారంటే... నటీనటులు పోటీ పడి పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చారని చెప్పొచ్చు. రామ్ నందన్‌గా, అప్పన్నగా రాంచరణ్ తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు. కలెక్టర్‌గా, ప్రజా నాయకుడిగా రెండు పాత్రల్లో అద్బుతమైన వైవిధ్యాన్ని చూపించాడు. రామ్ చరణ్ డెఫినెట్ గా తన కెరీర్ లో నిలిచిపోయే మరో ఐకానిక్ పెర్ఫార్మన్స్ ని అందించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘రంగస్థలం’ లో ఒక చిట్టిబాబు ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో అప్పన్న అని చెప్పాల్సిందే. ఊహించని విధంగా తనలోని నటుడు ఆడియెన్స్ ని మెప్పిస్తాడు. అప్పన్న పాత్రలోని అమాయకత్వం ఆ పాత్ర కోసం తాను చూపించిన డెడికేషన్ కి ఖచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే. అలాగే రామ్ నందన్ గా కూడా స్టైలిష్ లుక్స్ లో అలాగే తన యంగ్ లుక్స్ లో చరణ్ ట్రీట్ ఇస్తాడు. సినిమాలో సందర్భానికి తగ్గట్టుగా తనలోని వేరియేషన్స్ అదిరిపోయాయి అంతే. ఇక మోపిదేవీగా ఎస్‌జే సూర్య పవర్ ప్యాక్ట్ క్యారెక్టర్‌తో అల్లాడించాడు. రామ్ చరణ్‌తో నువ్వా నేనా అనే విధంగా నటించాడు. ఇక పార్వతి పాత్రలో అంజలి ఉత్తమ నటనను, సినిమాకు కావాల్సిన బోలెడంత ఎమోషన్‌ను అందించింది. చరణ్ కెరీర్ లో ఆ పాత్రలు ఎలాగో అంజలి కెరీర్లో ఈ పాత్ర కూడా మిగిలిపోతుంది. తన రోల్ లో అద్భుతంగా అంజలి నటించారు. తనపై వచ్చే కొన్ని సన్నివేశాలు అయితే హృదయం కదిలేలా అనిపించక మానవు.కొన్ని సీన్లలో కంటతడి పెట్టించే భావోద్వేగాన్ని పండించింది.ఇక నటుడు శ్రీకాంత్ మంచి రోల్ లో కనిపించారు. జయరామ్, సముద్రఖని తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. సునీల్, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల పర్వాలేదనిపించారు. ఇంకా విలన్ రోల్ లో చేసిన ఎస్ జే సూర్య తన మార్క్ విలనిజాన్ని చూపించారు. చరణ్ కి తనకి నడుమ కొన్ని హోరాహోరీగా సాగే సీన్స్ ఆడియెన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే తన మ్యానరిజం, లుక్స్ తో తన పాత్రలో సాలిడ్ పెర్ఫార్మన్స్ ని తను అందించారు. ఇంకా హీరోయిన్ కియార అద్వానీ తన గ్లామర్ తో పాటుగా నటిగా కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరిస్తుంది. అలాగే సునీల్ నుంచి మళ్లీ చాలా కాలం తర్వాత చిన్నపాటి సహాయక పాత్ర కనిపిస్తుంది. ఇంకా కామెడీ బ్రహ్మ బ్రహ్మానందంపై ఉన్న ఒక కామెడీ సీన్ బాగుంది. జైరాం కామిక్ రోల్ లో అలరిస్తారు. సినిమాలో పాటలు, గ్రాండ్ విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయి. అలాగే శంకర్ మార్క్ హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్ సినిమాలో పండాయి. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఉండే పవర్స్ ఇంకా పొలిటికల్ గా పలు సీన్స్ ఫస్టాఫ్, సెకండాఫ్ లో చప్పట్లు కొట్టిస్తాయి.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు, తిరు సినిమాటోగ్రఫి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. పాటలు సినిమాలో కనువిందుగా చిత్రీకరించారు. గ్రాఫిక్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇతర విభాగాల పనితీరు ఫర్వాలేదనిపించేలా ఉంది. ఈ సినిమాలో దిల్ రాజు పెట్టిన ఖర్చు అంతా కనిపిస్తుంది. దిల్ రాజు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే విఎఫ్ఎక్స్ లో ఇంకా బెటర్ గా చేయాల్సింది. జరగండి సాంగ్ థియేటర్స్ లో డిజప్పాయింట్ చేస్తుంది. మిగతా అన్ని పాటలు మాత్రం శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గ లెవెల్లో క్రేజీ థాట్స్ తో ఉన్నాయి. థమన్ పై చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు కానీ డెఫినెట్ గా శంకర్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా ఇచ్చాడు. మొత్తం మీద ఈ ఎమోషనల్, పొలిటికల్ వార్ ని హాయిగాచూసేయొచ్చు.
ఇంకా చదవండి: 'విడుదల 2' మూవీ రివ్యూ : వన్ మ్యాన్ షో!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# గేమ్ చేంజర్ # దిల్ రాజు # రామ్ చరణ్