నయన ప్రేమకథ అలా మొదలైంది..!?
1 month ago | 5 Views
అగ్ర నాయిక నయనతారను ఆమె అభిమానులు లేడీ సూపర్‌స్టార్ అని గర్వంగా పిలుచుకుంటారు. బుల్లితెర ప్రయోక్తగా కెరీర్‌ను మొదలుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో ‘నయనతార: బీయాండ్ ది ఫెయిరీటేల్’ పేరుతో ఆమె విజయవంతమైన సినీ ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ రూపొందిన డాక్యుమెంటరీ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇందులో ఆమె వ్యక్తిగత, సినీ జర్నీకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార ప్రేమాయణం, పెళ్లి వరకు సాగిన వారి ప్రయాణాన్ని కూడా ఈ డాక్యుమెంటరీలో వివరించారని తెలిసింది.
ఈ సందర్భంగా విఘ్నేష్ శివన్‌తో తాను ప్రేమలో పడిన క్షణాలను నయనతార గుర్తు చేసుకుంది. విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ‘నానుమ్ రౌడీదాన్’ (2015) సెట్స్‌లో తొలిసారి వీరిద్దరూ కలుసుకున్నారు. నయనతార మాట్లాడుతూ ‘పాండిచ్చేరిలోని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్ పెట్టారు. విజయ్ సేతుపతి మీద సీన్స్ షూట్ చేస్తున్నారు. అప్పుడే నేను దూరంగా విఘ్నేష్ శివన్‌ను గమనించా. మోముపై చెరగని చిరునవ్వు, సన్నివేశాన్ని వివరించే శైలి, దర్శకుడిగా అతని ప్రత్యేకమైన పనితీరు నన్ను ఆకట్టుకుంది.
ఆ క్షణంలోనే అతని ప్రేమలో పడిపోయా’ అని నయనతార చెప్పింది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం 2022 జూన్ 9న ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు సరోగసీ విధానం ద్వారా ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.
ఇంకా చదవండి: షారుఖ్ ఖాన్ తరువాత ఆ రికార్డు అల్లు అర్జున్‌దే!