రోడ్డు ప్రమాదంలో గాయని శివప్రియ దుర్మరణం
29 days ago | 5 Views
ఇందారపు శివప్రియ అద్భుత గాయని! సినీ, శాస్త్రీయ, జానపద సంగీతం లో రాణిస్తూ గురుకుల స్కూల్ లో సంగీత ఉపాధ్యాయని గా పని చేస్తోంది! శాస్త్రీయ కచేరిలు, సంగీత విభావరిలతో, సినిమా అవకాశాలతో రాణించాలని కలలు కన్నది! కానీ, ఆమె కోరిక అంతగా నెరవేరలేదు! 2019లో లక్షేట్టిపేట ఎస్సి గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్ గా ఉద్యోగం రావడంతో మంచిర్యాల లో వుంటూ స్కూటర్ పై స్కూల్ కు వెళ్లి వస్తుండేది! శుక్రవారం స్కూల్ కు వెళుతుండగా ఎదురుగా వస్తూ అదుపు తప్పిన కారు ఆమె స్కూటర్ ను ఢీ కొనగా ఆమె అక్కడికక్కడే మృతిచెందారు.
విధి ఎంత బలీయమైందో! కొందరిని వరస ఇబ్బందులకు గురి చేస్తుంటుంది! ఏడాది క్రితమే శివప్రియ భర్త శివప్రసాద్ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం పొందాడు! ఆ విషాదంలోంచి తేరుకుంటూ ఉండగా ఇలా జీవితం ముగిసిపోయింది! కుమారుడు హాసిత్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతడికి సంగీతం నేర్పుతోంది! తాను చేయలేని కచేరిలు తన కుమారుడితో చేయించాలని, ఒక మంచి సినీ గాయకుడ్ని చేయాలనేది ఆమె కల!
ఇళయరాజా అంటే చాలా ఇష్టం! ఎలాగయినా ఆయన్ని కలవాలంటే ఒకసారి కల్పించాను. రవీంద్రభారతి విఐపి రూమ్ లో ఇళయరాజా గారిని కలసినప్పుడు "మంచి గాయని" అని పరిచయం చేయగానే "ఏది ఒక పల్లవి పాడండి" అన్నారు. వెంటనే ఆమె "నెమలికి నేర్పిన నడకలివి" పాట అందుకుంటే... పూర్తిగా పాడించుకున్నారు. బాలు గారంటే శివప్రియకు ఇష్టం. కొన్ని సినిమాల్లోనూ పాడింది! ఇష్టంగా, రాయలసీమ లవ్ స్టోరీ, అసలేం జరిగింది, బతుకు బస్టాండ్ తదితర సినిమాల్లోను పాడింది! బతుకమ్మ, మన దేశం, ఏందన్న చిన్నబోయినవ్ లాంటి ఆల్బమ్స్ విడుదల చేసింది.
శివప్రియ ఇందారపు యు ట్యూబ్ ఛానెల్ లో ఆమె పాడే పాటలకు మిలియన్ల వ్యూయర్స్ ఉన్నారు! గత ఏడాది జూలై లో అన్నమాచార్య భావనవాహిని లో శాస్త్రీయ సంగీత కచేరి చేసి పద్మశ్రీ డా. శోభారాజుతో ప్రశంసలు అందుకున్నారు! కాగజ్ నగర్ కు చెందిన శివప్రియ పాడుతా తీయగా తో వెలుగులోకి వచ్చారు. స్టూడియో ఎన్ లో యాంకర్ గా పని చేశారు. ఆహా ఇహి ఓహో అనే టివి కార్యక్రమంలో పేరడీ పాటలు పాడారు. కామెడీ స్కిట్స్ లో నటించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక వేదికలపై గాయనిగా తన సత్తా చాటుకున్నారు. ఒక మంచి మనసున్న గాయని ఇలా అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో అశువులు బాయడం విచారకరం, దురదృష్టకరం. శివప్రియకు అశ్రు నివాళి. ఆమె లేదు, ఆమె పాటలు ఉన్నాయి, ఉంటాయి!
ఇంకా చదవండి: మా నాన్నగారిలా నేనూ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది - 'నేనెక్కడున్నా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మిమో చక్రవర్తి
"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"