చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ చూసి టెన్షన్ పడ్డా: తొలినాటి అనుభవాలను పంచుకున్న నాగార్జున
24 days ago | 5 Views
చిరంజీవి డ్యాన్స్‌లో గ్రేస్ చూసి కాస్త టెన్షన్ పడ్డానని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన.. ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. 2024గానూ ఆ పురస్కారం చిరంజీవికి దక్కింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..చిరంజీవి హిట్లు, సూపర్‌హిట్లు, రికార్డుల గురించి అందరికీ తెలుసు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా సాధించారు. ఆయనతో నాకు మంచి జ్ఞాపకాలున్నాయి. నేను సినిమాల్లోకి రావాలనుకునే సమయంలో.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిరంజీవి ఓ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. నాన్న నన్ను పిలిచి.. 'చిరంజీవి అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు.
సినిమాల్లోకి వద్దామనుకుంటున్నావ్ కదా వెళ్లి చూడు. నేర్చుకోవచ్చు’ అని చెప్పారు. నాన్న చెప్పినట్టుగా షూటింగ్ చూసేందుకు వెళ్లా.. అది రెయిన్ సాంగ్. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో రాధతో కలిసి చిరంజీవి డ్యాన్స్ చేస్తున్నారు. ఆయన డ్యాన్స్‌లో ఉన్న గ్రేస్ చూసి కొంచెం భయం పట్టుకుంది. ఈయనలాగా మనం డ్యాన్స్ చేయగలుతామా అని అనిపించింది. సినిమా కాకుండా మరో దారి వెతుక్కుందాం అనుకుంటూ బయటకు వచ్చేశా అని నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం చిరంజీవిది. ఇదే స్టూడియోలో కొన్నాళ్ల క్రితం అమితాబ్ బచ్చన్‌కు ఈ అవార్డు ఇచ్చాం. ఆ సమయంలో.. వేదికపై కొంతమంది అతిథులే ఉండేలా ప్రొటోకాల్ పెట్టాం. ఈవెంట్‌కు రమ్మని అడగ్గానే చిరంజీవి వస్తానన్నారు. కొన్ని పరిమితుల వల్ల వేదికపైకి ఆహ్వానించలేమని చెప్పా. 'అందులో అభ్యంతరం ఏముంది? నేను వస్తా. ముందు కూర్చొని వేడుక చూస్తా’ అని అన్నారు. అమితాబ్‌కు శాలువాతో సత్కరించొచ్చా అని అనుమతి కోరారని పేర్కొన్నారు.
ఇంకా చదవండి: ఏఎన్నార్‌తో సరితూగడం ఎవరికైనా కష్టమే: అక్కినేని అవార్డు ప్రదానోత్సవంలో అమితాబ్