తెలుగు ప్రజలపై చెరగని ముద్ర  రామోజీ రావు!

తెలుగు ప్రజలపై చెరగని ముద్ర రామోజీ రావు!

26 days ago | 14 Views

పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన రామోజీ రావు.. సినీరంగంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థను స్థాపించి, వివిధ భాషల్లో 87 చిత్రాలను నిర్మించి ఎంతోమంది కొత్త నటీనటులను రంగుల పరిశ్రమకు పరిచయం చేశారు. సమున్నత పాత్రికేయ విలువలకు పట్టంగట్టే ఈనాడుకు అనుబంధంగా ప్రారంభమైనదే 'సితార’ సినిమా వారపత్రిక. రంగుల లోకంలోని విశేషాలను సమగ్రంగా అందించేలా దాన్ని ప్రారంభించారు. 1976లో ఇది పాఠకుల ముంగిటకు వచ్చింది. కేవలం వార్తలు, కథనాలను అందించేందుకు పరిమితం కాకుండా విలువలున్న చిత్రాల్ని ప్రోత్సహించే దిశగానూ రామోజీ ఆలోచన చేశారు. ఆరోగ్యకరమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలనే సదుద్దేశంతో 1983లో రామోజీరావు ఉషాకిరణ్‌ మూవీస్‌ను ప్రారంభించారు. ఉషాకిరణ్‌ మూవీస్‌పై నిర్మించిన తొలి సినిమానే సూపర్‌ హిట్‌గా నిలిచింది. 'ప్రేమలేఖ’ నవలను చిత్రంగా మలచాలని భావించారు. ఆ కథను తెరకెక్కించే బాధ్యతను జంధ్యాలకు అప్పగించారు. ఆ సినిమానే 'శ్రీవారికి ప్రేమలేఖ’. ఈ చిత్రం 1984 మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పు పొందింది. కథలనేవి కల్పనల్లోంచి కాదు.. జీవితాల్లోంచి పుడతాయని ఉషాకిరణ్‌ మూవీస్‌ నిరూపించింది. అందుకు ఉదాహరణెళి ఈ సంస్థ నుంచి వచ్చిన నాలుగో చిత్రం 'మయూరి’. ఒక హిందీ పత్రికలో వచ్చిన వార్తను సినిమాగా మలిచి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. ప్రమాదంలో కాలును పోగొట్టుకొని, కృత్రిమ పాదంతో నాట్యంలో రాణించిన సుధా చంద్రన్‌ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. ఆ పాత్రలో సుధా చంద్రన్నే నటించారు. స్ఫూర్తివంతమైన ఆ చిత్రం వచ్చి రెండున్నర దశాబ్దాలు దాటిపోయినా ఉషాకిరణ్‌ మూవీస్‌ అనగానే 'మయూరి’ తప్పకుండా గుర్తుకొస్తుంది. సినిమా అంటే రెండున్నర గంటలపాటు ఊహాలోకంలో విహరింపజేయడం మాత్రమే కాదని నిరూపించిన చిత్రమిది. 'మౌనపోరాటం' యథార్థ సంఘటనలను తెరకెక్కించడంలో ఉషాకిరణ్‌ మూవీస్‌ కి ఓ ప్రత్యేకత ఉంది. ఒడిశాలో జరిగిన సంఘటన ఆధారంగా 'మౌన పోరాటం’ చిత్రాన్ని నిర్మించారు. మగాడి చేతిలో మోసపోయిన ఓ వనిత పోరాటాన్ని ప్రభావశీలంగా తెరపై ఆవిష్కరించారు. 1989లో విడుదలైన ఆ చిత్రం ఎందరినో ఆలోచింపచేసింది. 'ప్రతిఘటన'  ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ ఏనాడూ కథానాయికనుగానీ, ఏ స్త్రీ పాత్రనుగానీ బలహీనంగా చూపించలేదు. ఆ పాత్రకు ఔచిత్యం, మనో ధైర్యం ఉండేలా తీర్చిదిద్దారు. ఇందుకు 'ప్రతిఘటన’ తార్కాణం. సంఘ విద్రోహులతో పోరాడే తెగువ ఉన్న ఓ వనిత గాథను ఆవిష్కరించిన విధానం ప్రేక్షకుల మదిలో చెరిగిపోకుండా ఉంది. ఆ చిత్రంలోని 'ఈ దుర్యోధన...’ పాటను ఎవరైనా మరువగలరా? ఆ పాటలోని సాహిత్యాన్ని ఆమోదించేందుకు ముందుగా నిర్మాతకు సంకల్ప బలం కావాలి. అది రామోజీరావుకు ఉంది కాబట్టే రచయిత వేటూరి రాయగలిగారు... దర్శకుడు టి. కృష్ణ అంతే శక్తిమంతంగా చిత్రించగలిగారు.క్రీడా కారిణి అశ్విని నాచప్పను కెమెరా ముందుకు తీసుకొచ్చింది కూడా ఈ సంస్థే. క్రీడా నేపథ్యంలో స్ఫూర్తిదాయక చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదే 'అశ్వని’ కథ. ఆ పాత్రకు నిజ జీవితంలో క్రీడాకారిణి అయితే బాగుంటుందన్న ఆలోచనతోనే అశ్వని నాచప్పను ఎంచుకున్నారు. క్రీడలకే పరిమితమైన ఆమె.. కథ  నచ్చడంతోపాటు, ఉషాకిరణ్‌ మూవీస్‌ విశిష్టతను తెలుసుకుని నటించేందుకు పచ్చజెండా ఊపారు. ఇలా చెబుతూ వెళ్తే ప్రతి చిత్రం వెనక ఓ బలమైన నేపథ్యం, ఓ సంకల్పం ఉంటాయి. 'తేజ’, 'మనసు మమత’, 'అమ్మ’, 'జడ్జిమెంట్‌’, 'పీపుల్స్‌ ఎన్‌ కౌంటర్‌’... అన్నీ నాటి సామాజిక పరిస్థితులకు దర్పణం పట్టినవే. 'చిత్రం’, 'నువ్వే కావాలి’, 'ఆనందం’ వంటి ఘనవిజయాలున్నాయి. 'నచ్చావులే’, 'బెట్టింగ్‌ బంగా ర్రాజు’, 'నువ్విలా’ లాంటి ప్రేక్షకులను ఉల్లాసపరిచే చిత్రాలు వచ్చాయి. 'నువ్వే కావాలి’ సాధించిన వసూళ్లూ, సృష్టించిన రికార్డులూ ఆ ఏడాది ఏ మాస్‌ హీరోకీ తీసిపోనివే. చిన్న చిత్రాల రూపకర్తలకు ధైర్యాన్నిచ్చినవే. కొత్త ట్రెండ్‌ సృష్టించినవే. కేవలం తెలుగు చిత్రాలకే ఉషాకిరణ్‌ మూవీస్‌ పరిమితం కాలేదు. 'నాచే మయూరి’, 'ప్రతిఘాత్‌’, చిత్రాలతో బాలీవుడ్‌లోనూ జయకేతనం ఎగరేసింది. కన్నడ, తమిళ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ఇప్పటి వరకూ 87 చిత్రాలు నిర్మించిందీ సంస్థ. తొలి చిత్రం 'శ్రీవారికి ప్రేమలేఖ’ నుంచే ప్రేక్షకుల మెప్పుతో పాటు ప్రభుత్వ పురస్కారాలూ వరించాయి. 'కాంచనగంగ’, 'మయూరి’, 'ప్రతిఘటన’,'తేజ’, 'మౌనపోరాటం’ లాంటి చిత్రాలకు నంది అవార్డులు దక్కాయి. 'మయూరి’లో నటించిన సుధాచంద్రన్‌కు ఏకంగా జాతీయస్థాయిలో ప్రత్యేక పురస్కారం లభించింది. 'నువ్వే కావాలి’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయస్థాయి అవార్డు అందుకుంది. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటీనటులు ఎందరో ఉన్నారు. ప్రతిభ ఉంటే చాలు అవకాశమిచ్చి ప్రోత్సహించారు. శ్రీకాంత్‌, వినోద్‌కుమార్‌, చరణ్‌ రాజ్‌, యమున, వరుణ్‌ రాజ్‌, ఎన్టీఆర్‌, ఉదయ్‌ కిరణ్‌, తరుణ్‌, రీమాసేన్‌, శ్రియ, జెనీలియా, రితేశ్‌ దేశ్‌ముఖ్‌, రిచా పల్లోడ్‌, మాధవీలత... ఇలా ఎందరో నటులు ఈ సంస్థ ద్వారానే చిత్రసీమకు పరిచయమయ్యారు. గాయనిగా ఉన్న ఎస్‌. జానకి సంగీత దర్శకురాలైంది కూడా 'మౌనపోరాటం’ చిత్రంతోనే. మల్లికార్జున్‌, ఉష, గోపికా పూర్ణిమ లాంటి గాయనీగాయకులను శ్రోతలకు చేరువ చేసింది కూడా ఈ సంస్థే. సినిమా తీయడం ఒక ఎత్తు. దాన్ని ప్రేక్షకుల ముంగిటకు తీసుకువెళ్లడం మరో ఎత్తు. చిత్ర నిర్మాణంతోపాటే పంపిణీ విభాగానికీ 'మయూరి ఫిల్మ్‌ డిస్టిబ్యూట్రర్స్‌’ ఏర్పాటుతో శ్రీకారం చుట్టారు.

సినీరంగంలోనూ రామోజీ ముద్ర... 

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (88) శనివారం ఉదయం కన్నుమూశారు. ఇక రామోజీ రావు మృతితో విూడియా రంగంతో పాటు సినీ రంగం శోకసంద్రంలో మునిగిపోయింది. రామోజీరావు కెరీర్‌లో కీలక మలుపు అంటే ఈనాడు పత్రికను మొదలుపెట్టడమే. వైజాగ్‌ వేదికగా 1974లో ఈనాడు పత్రికను ప్రారంభించిన ఆయన దాని ద్వారా కొన్ని వేలమంది పాత్రికేయులను తయారు చేశారు. దీని తర్వాత 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీని ప్రారంభించారు. తక్కువ సమయంలోనే ఈ ఛానల్‌ అభిమానులు మనసులను దోచుకుంది. ఇక ఈటీవీలో వచ్చే రాత్రి 9 గంటల వార్తలకు అయితే ఇప్పుడు కూడా జనాలు ఆసక్తిగా చూస్తారు. మరోవైపు సినీ రంగంలో కూడా రామోజీ రావు విశేష కృషి చేశారు. తన సోంత నిర్మాణ సంస్థ ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఇప్పటివరకు వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్‌తోనే టాలీవుడ్‌ నటులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌, దర్శక దిగ్గజం రాజమౌళి తదితరులు సినిమా ఇండస్టీల్రోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌లో చివరిగా 2015లో రాజేందప్రసాద్‌ నటించిన దాగుడుమూత దండాకోర్‌ సినిమా వచ్చింది. కేవలం పెద్ద తెరకు మాత్రమే పరిమితం కాకుండా బుల్లితెరపై తన సత్తా చూపించారు. భాగవతం, అన్వేషిత, ఎండమావులు, ఆడపిల్ల, పంచతంత్రం లాంటి బ్లాక్‌ బస్టర్‌ ధారవాహికలను అందించారు. కాలంతో పాటు మారుతూ.. రీసెంట్‌గా ఓటీటీలో కూడా ఎంట్రీ ఇచ్చారు రామోజీ రావు. ఈనాడు గ్రూప్‌ నుంచి వచ్చిన ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌. కేవలం తెలుగు సినిమాలతో పాటు తెలుగు ధారవాహికలు, ప్రోగ్రామ్స్‌ ఈ ఓటీటీలో ప్రసారం అవుతుంటాయి.

 ఒకేఒక్క సినిమాలో రామోజీ చిన్న పాత్ర

మార్పు చిత్రంలో న్యాయమూర్తిగా దర్శనం

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీ రావు ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిముషాలకి కన్నుమూశారు. రామోజీ రావు, ఈనాడు దినపత్రికతోపాటు అనేక రంగాల్లో తన వ్యాపార సంస్థలు విస్తరించారు. స్వతహాగా కళాభిమాని అయిన రామోజీ రావు చిన్నతనంలో వాళ్ళ వూరిలో నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారు. అలాగే రామోజీ రావు మంచి సంగీత ప్రియుడు కూడా. రామోజీ గారికి సినిమాలంటే కూడా ఎంతో ఇష్టం. అతను ఒక సినిమాలో నటించారు కూడా. రామోజీ రావు నటించిన సినిమా పేరు ఏంటో తెలుసా? యు. విశ్వేశ్వర రావు దర్శకత్వంలో  వచ్చిన ’మార్పు’ అనే సినిమాలో రామోజీ రావు ఒక అతిధి పాత్రలో కనిపించారు. ఈ సినిమా 1978లో వచ్చింది. ఇందులో రామోజీ రావు న్యాయమూర్తి పాత్ర పోషించారు. రామోజీ రావు నటించింది అతిధి పాత్రలో అయినా, పోస్టర్స్‌ పై రామోజీ రావు బొమ్మ వేయడం ఆసక్తికరం. సినిమాలంటే ఎంతో ఇష్టమున్న రామోజీరావు ఆ తరువాత ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థని ప్రారంభించి, మొదటి సినిమా ’శ్రీవారి ప్రేమలేఖ’ తీశారు. సందేశాత్మక, వినోదాత్మక సినిమాలు మాత్రమే తీయాలన్న సంకల్పంతో ఈ సంస్థని ప్రారంభించి అనేక చిత్రాలు తీశారు రామోజీ రావు. మయూరి అనే ఫిలిం డిస్టిబ్యూష్రన్‌ ఆఫీసును కూడా మొదలుపెట్టి అనేక చిత్రాలను పంపిణీ చేశారు. ఒక్క తెలుగు చిత్రాలే కాకుండా, పరభాషా చిత్రాలను కూడా తన మయూరి డిస్టిబ్యూష్రన్‌ సంస్థ ద్వారా పంపిణీ చేశారు. తన సినిమాల ద్వారా కొన్ని వందలమంది కొత్త తారలను, సాంకేతిక నిపుణలను, కళాకారులను రామోజీ రావు వెండితెరకి పరిచయం చేశారు. అగ్ర నటీమణుల్లో ఒకరైన శ్రియ శరన్‌ ని రామోజీ రావు పరిచయం చేసిన నటీమణి. 'ఇష్టం’ సినిమా ద్వారా శ్రియ శరన్‌ కథానాయికగా తెలుగు తెరకి పరిచయం అయింది.

 రామోజీ మరణపై రజనీకాంత్‌ దిగ్బ్రాంతి 

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు మృతిపట్ల కోలీవుడ్‌ నటుడు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సంతాపం తెలిపారు. నా గురువు, శ్రేయోభిలాషి అయిన రామోజీ రావు గారి మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. జర్నలిజం, సినిమా, రాజకీయాల్లో గొప్ప కింగ్‌మేకర్‌గా చరిత్ర సృష్టించిన వ్యక్తి. అతను నా జీవితంలో నాకు మార్గదర్శకుడు ప్రేరణ కలిగించిన వ్యక్తి. అతని ఆత్మకు శాంతి కలుగుగాక అంటూ రజినీకాంత్‌ రాసుకోచ్చాడు.

రామోజీ స్ఫూర్తిదాయక వ్యక్తి: అల్లు అర్జున్‌ నివాళి.. భారతరత్నకు అర్హుడన్న రాజమౌళి

ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు మృతిపట్ల టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. రామోజీ రావు మరణవార్త విని చాలా బాధపడ్డాను. నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో ఆయన ఒకరు. విూడియా, సినిమా, ఇతర రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అంటూ అల్లు అర్జున్‌ రాసుకోచ్చాడు. ఈనాడు గ్రూప్‌ చైర్మన్‌ రామోజీ రావు మృతిపట్ల టాలీవుడ్‌ దర్శక దిగ్గజం రాజమౌళి సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో ట్వీట్‌ ద్వారా నివాళులు అర్పించారు. రామోజీకి భారతరత్న ఇవ్వడం సముచిత గౌరవం అని అన్నారు. ఒక మనిషి అనేక రంగాల్లో వివిధ సంస్థలు స్థాపించి వాటిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. వాటిద్వారా ఎన్నో లక్షలమందికి జీవనోపాధి, ఆశలను అందించి మార్గదర్శకంగా నిలిచారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడమే సముచితమని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంటూ రాజమౌళి రాసుకోచ్చాడు. దీనిపై అల్లు అర్జున్‌ రిప్లయ్‌ ఇస్తూ.. నా మనసులో కూడా అదే భావన కలిగింది సార్‌. విూరు నా హృదయంతో మాట్లాడారు. దానికి గాత్రదానం చేసినందుకు ధన్యవాదాలు అంటూ బన్నీ తెలిపాడు.

రామోజీ విజన్‌, ఆలోచనలు గొప్పవి: నివాళి అర్పించిన నటుడు మోహన్‌ బాబు

విూడియా మొగల్‌ రామోజీరావు  మరణవార్త విన్న నటుడు మోహన్‌ బాబు  భావోద్వేగానికి గురయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ’రామోజీరావు మహోన్నత వ్యక్తి. పత్రికా రంగంలో రారాజు, అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్‌సిటీని మన దేశంలో నిర్మించారు. ఆయన విజన్‌, ఆలోచనా విధానం చాలా గొప్పది. ఆయనకు, నాకూ 42 ఏళ్ల నుంచి ఆత్మీయ సంబంధం ఉంది. ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. మంచి విషయాలు చెబుతారు. నేను ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేరంటే నమ్మలేకపోతున్నా. మనసు చాలా ఆవేదనతో నిండిపోయింది. నా కుటుంబానికే కాదు. సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఇది మాటల్లో చెప్పలేనిది. వారు ఎక్కడున్న వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా‘ అని ఆయన ట్వీట్‌ చేశారు.తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అన్ని విభాగములకు సంబంధించిన ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గ సభ్యులు రామోజీ రావు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ రావు మృతికి గౌరవ సూచకంగా ఆదివారం తెలంగాణ, ఆంధప్రదేశ్‌  రాష్టాల్లో  టాలీవుడ్‌లో అన్ని కార్యకలాపాలు మూసివేయబడతాయని పేర్కొన్నారు. అలాగే నిర్మాతల మండలి సభ్యులు కూడా రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సభ్యులు.

ఇంకా చదవండి: గేమ్ ఛేంజర్ చిత్రీకరణలో రామోజీ రావు గారికి అశ్రు నివాళ్లు అర్పించిన రామ్ చరణ్ - దర్శకుడు శంకర్

# Ramojirao     # Ramcharan     # Shankar