రజనీ ఆరోగ్యమే మాకు ముఖ్యం: దర్శకుడు లోకేశ్ కనగరాజ్
2 months ago | 5 Views
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం కంటే తమకు సినిమా ఎక్కువేవిూ కాదని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ అన్నారు. రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా, రజనీకాంత్ ఆరోగ్యం విషయంలో 'కూలీ’ చిత్ర బృందాన్ని తప్పుబడుతూ పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిని ఉద్దేశించి చిత్ర దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని.. అలాంటి ప్రచారాలు చూస్తుంటే ఎంతో బాధగా ఉందని అన్నారు. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి అనారోగ్యం విషయంలో 'కూలీ’ టీమ్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.
దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్ పోర్షన్ మొత్తం పూర్తి చేశాం. 30వ తేదీన ఆయన ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే మాకు షూటింగ్ ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయాలని కోరుతున్నానంటూ లోకేశ్ కనగరాజ్ చెప్పారు. అక్టోబర్ 15 తర్వాత రజనీకాంత్ తిరిగి 'కూలీ’ సెట్లోకి అడుగుపెడతారని లోకేశ్ తెలిపారు.
ఇంకా చదవండి: దక్షిణాదిలో హీరోయిన్‌లంటే చిన్నచూపే: కథానాయిక మాళవికా మోహనన్