థియేటర్లకు రాకుండా చేస్తున్నాం: దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
2 months ago | 34 Views
ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుండా మేమే చెడగొట్టామని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. నాలుగు వారాలకే సినిమాను ఓటీటీలోకి తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించారు. ఎప్పటి కప్పుడు పరిశ్రమలోని పరిస్థితులను అంచనా వేస్తూ, అందుకు తగినట్లు సినిమాలు నిర్మించే వారిలో దిల్‌రాజు ఒకరు. తాజాగా ఓటీటీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయ్యాయి. 'రేవు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. కొత్తవాళ్లతో సినిమాలు తీసే పక్రియ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ, 99శాతం ఫెయిల్ అవుతాయి. ఒకశాతం మాత్రమే సక్సెస్ రేట్. కెరీర్ తొలినాళ్లలో నేను సినిమాలు తీసేటప్పుడు నా సినిమాకు ఆడియన్స్ ఎలా వస్తారు? ఇంకా ఏమేం యాడ్ చేయాలి? అనుకుంటూ తీసేవాడిని. సినిమా తీయడం ఈ రోజుల్లో గొప్ప కాదు. ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి ఆ మూవీని చూడటమే బిగ్ ఛాలెంజ్. మేము తీసిన ’బలగం’, ’కమిటీ కుర్రోళ్ళు’ నెమ్మదిగా మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులకు చేరాయి. అదే సమయంలో సినిమా బాగుందని రివ్యూలు ఇవ్వడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. అసలు ప్రేక్షకులను చెడగొట్టింది మేమేలెండీ.. ’విూరు ఇంట్లో కూర్చోండి. నాలుగు వారాల్లో ఓటీటీకి తెస్తాం’ అని థియేటర్‌కు రాకుండా చేసుకున్నాం.
ఈ సినిమా (రేవు) చూసి నేను కూడా రివ్యూ ఇస్తా (నవ్వులు). మంచి సినిమా.. అదీ చిన్న మూవీ అయితే, ఇండస్టీల్రోని ప్రతి ఒక్కరూ సహకారం అందించాలి‘ అని దిల్‌రాజు అన్నారు. ప్రస్తుతం దిల్‌రాజు వ్యాఖ్యలపై అటు ఇండస్ట్రీతో పాటు, ఇటు సామాజిక మాధ్యమాల వేదికగానూ చర్చ జరుగుతోంది. కరోనా తర్వాత వందల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. థియేట్రికల్ రన్ బాగున్న సినిమాలు కూడా ముందుగానే స్ట్రీమింగుకు వచ్చేశాయి. సినిమా విడుదలకు ముందే ఓటీటీ సంస్థలతో చిత్ర బృందాలు చేసుకున్న ఒప్పందాల కారణంగా రాక తప్పని పరిస్థితి. 'సలార్’, 'టిల్లు స్క్వేర్’, 'ది ఫ్యామిలీ స్టార్’ వంటి చిత్రాలన్నీ జయాపజయాలతో సంబంధం లేకుండా త్వరగా ఓటీటీ బాటపట్టాయి. ఈ ఏడాది 'హనుమాన్’, 'కల్కి 2898 ఏడీ’లు మాత్రం ఓటీటీలోకి వచ్చేందుకు కనీసం 50 రోజులు ఆగాయి. మరోవైపు ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితులు నానాటికీ తగ్గిపోతున్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.
టికెట్ ధరలు, పార్కింగ్ వసూళ్లు, తినుబండారాల ధరలు వెరసి నలుగురున్న కుటుంబ సినిమా చూడాలంటే తక్కువలో తక్కువ రూ.2వేలు ఖర్చు చేయాల్సిందే. వీటిని నియంత్రిస్తే, ప్రేక్షకుడు కచ్చితంగా థియేటర్‌కు వస్తాడన్నది సామాన్యుడి మాట. కనీసం 50రోజులు పూర్తయిన తర్వాతే ఓటీటీలో వచ్చేలా ఒప్పందం చేసుకుంటున్నాయి. తాజాగా తమిళ చిత్ర నిర్మాతల మండలి కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అగ్ర కథానాయకులకు సంబంధించిన ఏ సినిమా అయినా విడుదలైన తేదీ నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించింది. మలయాళంలోనూ ఇలాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు.