
సింగపూర్‌లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు
1 month ago | 5 Views
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జరుగుతున్న క్రమంలో జనవరి 26న భారతదేశ రిపబ్లిక్‌డే నాడు సింగపూర్‌లోని ఆర్యసమాజ్ ఆడిటోరియంలో ‘జైఎన్టీఆర్ టీమ్’ సింగపూర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 500 మంది ఆహుతుల సమక్షంలో ఘనంగా, రమణీయంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన నందమూరి తారకరామారావు గారి తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్, ప్రముఖ సినీ నటులు శ్రీ ఎం. మురళీమోహన్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ‘జైఎన్టీఆర్ టీమ్ సింగపూర్’ తరఫున శ్రీ రేణుకుమార్ కన్నెగంటి, శ్రీ సురేష్ మొద్దుకూరి, శ్రీ వెంకట్ భీమినేని, శ్రీ కరుణాకర్ కంచేటిలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
తొలుత దీపప్రజ్జ్వలనచేసి, ఎన్టీఆర్ విగ్రహానికి అతిధులు పూలమాలాలంకరణ చేయడంతో కార్యక్రమం మొదలైంది. ప్రొ॥ బి.వి.ఆర్.చౌదరి, శ్రీ వట్టికూటి శేషగిరి రావులు స్వాగతోపన్యాసం చేసి ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగ విశేషాలను ప్రస్తావించారు. అతిధుల పరిచయం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ చిత్రాల పాటలకు స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలు, యువతులు చేసిన నృత్యాలు; భరతనాట్యం మొదలైన కార్యక్రమాలు అందర్నీ ఎంతగానో అలరించాయి.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు శ్రీ భగీరధ సంపాదకత్వంలో వెలువరించిన ‘తారకరామం’ పుస్తకాన్ని; ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ శ్రీ టి.డి.జనార్ధన్ ఎన్టీఆర్‌పై రూపొందించిన ‘తెలుగువారి గుండెబలం’ వీడియో సాంగ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శ్రీ నందమూరి రామకృష్ణ ప్రసంగిస్తూ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవాడలో ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్ని ‘నభూతోనభవిష్యతి’గా నిర్వహించిన ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ శ్రీ టి.డి.జనార్ధన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ వేడుకల్ని నిర్వహించడానికి శ్రీ టి.డి.జనార్ధన్, శ్రీ అట్లూరి అశ్విన్‌లు చొరవ తీసుకోవడం తెలుగువారందర్నీ సమన్వయం చేసుకోవడం అభినందనీయమన్నారు. తన తండ్రి గారైన శ్రీ ఎన్.టి.రామారావు నుంచి తాము క్రమశిక్షణ, సభ్యత, సంస్కారం వంటి ఉన్నత విలువలు నేర్చుకొన్నామని, ఆ మహోన్నత మూర్తికి కొడుకుగా జన్మించడం తన అదృష్టం అని పేర్కొన్నారు.
శ్రీ మురళీమోహన్ ప్రసంగిస్తూ తనకు అన్నగారితో, తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఎన్టీఆర్ తనను సొంత సోదరుడిగా ఆదరించారని చెబుతూ, ఎన్టీఆర్‌కు భారతరత్న లభిస్తే తనలాంటి కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగు వారికి సంతోషం కలుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ శ్రీ టి.డి.జనార్ధన్ ఉద్వేగభరితంగా, స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. సినీరంగంలో రారాజుగా నిలిచిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓ ధృవతారగా అభివర్ణించారు. ఎన్టీఆర్ ముందు, తర్వాతగా తెలుగునాట రాజకీయాల్ని చెప్పుకోవాలని, రాజకీయాల్లో నైతిక విలువల్ని, ప్రజాస్వామ్య విధానాల్ని, సంక్షేమ శకాన్ని ప్రారంభించిన మహాపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 2023లో ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీని ఏర్పాటు చేశామని; ఎన్టీఆర్ నమ్మి ఆచరించిన మహోన్నత ఆశయాలు, సిద్ధాంతాలు, విధానాల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తాము ఎన్టీఆర్‌కు సంబంధించిన అపురూప గ్రంధాలను వెలువరిస్తున్నామని; అందులో ‘తారకరామం’ తాజాదని; భవిష్యత్తులో మరెన్నో పుస్తకాలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చి ప్రోత్సహించిన ఎన్టీఆర్‌కు ఎంత చేసినా తక్కువే అన్నారు. హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా తమ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. కాగా, తాము చేస్తున్న ఈ కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడి గారి ప్రోత్సాహం, సహకారం ఉన్నాయని తెలిపారు.
దాదాపు 4 గంటలపాటు ఎంతో హృద్యంగా సాగిన ఈ కార్యక్రమానికి సింగపూర్‌లోని తెలుగు సంఘాలన్నీ హాజరు కావడం విశేషం. కార్యక్రమాలలో పాల్గొని అలరించిన వారందరికీ ముఖ్య అతిధులు చేతులు మీదుగా మెమొంటోలు బహూకరించారు.
జై ఎన్టీఆర్ టీమ్ సభ్యులు శ్రీ సర్వేష్, శ్రీ కురిచేటి కరుణాకర్‌లు వందన సమర్పణ చేశారు.
ఇంకా చదవండి: పద్మ పురస్కారాలకు ఎంపికైనవారికి హృదయపూర్వక అభినందనలు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఎన్టీఆర్ # మురళీమోహన్