మోహన్ బాబు 50ఏళ్ల సినీ ప్రయాణం!
2 hours ago | 5 Views
మంచు మోహన్‌బాబు నటనా ప్రయాణంలో 50వ వసంతంలోకి అడుగు పెట్టారు. 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది నవంబరు 22 వరకూ ప్రతినెలా ఓ వేడుకని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో మోహన్‌బాబు మాట్లాడుతూ.. భావోద్వేగంగా మాట్లాడారు. ‘నా తల్లిదండ్రులు ఆశీస్సులు, నటనలో నాకు జన్మనిచ్చిన దాసరి నారాయణరావు గారి దీవెనలు నాపై ఎప్పుడూ ఉంటాయి. సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు ఎప్పుడూ నన్ను వారి సొంత తమ్ముడిలా భావించారు. అన్నిటికంటే ముఖ్యంగా అభిమానుల ప్రేమాభిమానాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. 1975 మార్చి వరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. భోజనం కూడా దొరక్క ఎన్నో రోజులు ఇబ్బందులు పడ్డాను. నేడు విూ అందరితో (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కలిసి భోజనం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని విష్ణుని అడిగాను. 'మా’ అధ్యక్షుడిగా విష్ణు ఎలా పనిచేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను.'మా’ బిల్డింగ్ ఆలస్యం అవుతుందేమో కానీ విష్ణు చెప్పిన మాటను కచ్చితంగా నెరవేరుస్తాడు.
దేశమే గర్వించదగ్గ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు‘ అన్నారు. కులం కూడు పెట్టదని పెద్దలు చెబుతారు. నా కులం వాళ్లే నా సినిమా చూడమంటే ఒక్కడు చూడడు. నాకు అందరూ సమానమే. కులమతాలతో సంబంధం లేదు. అన్ని కులాలు ఒక్కటే. అందరూ నన్ను ఆశీర్వదించాలి. ఎన్నో మంచి పనులు చేశాను. వాటిని వేదికలపై చెప్పడం నాకు నచ్చదు. చనిపోయిన నటుడి భార్యకు ఉద్యోగం ఇప్పించాను. వాళ్ల పిల్లల్ని చదివించాను. ఆ పిల్లలు కూడా హీరోలు అయ్యారని విని సంతోషించాను. ఎంతో మంది పిల్లల్ని నేను చదివించాను. ఇలాంటి మంచి పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. నా సినిమాల్లోనూ ఎంతోమందికి అవకాశాలు కల్పించాను. ఎవరికైనా చదువు విషయంలో ఇబ్బందులు ఉంటే నా యూనివర్సిటీ ఉందని మర్చిపోకండి‘ అన్నారు. ఇక 'కన్నప్ప' చిత్రం గురించి చెబుతూ ఇది విష్ణు కెరీర్‌లో ఓ మైలు రాయి కావాలని కోరుకుంటున్నా‘ అన్నారు.
ఇంకా చదవండి: "స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్"ను ప్రారంభించిన దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మంచు మోహన్‌బాబు # ఎన్టీఆర్