తెలుగు మూవీతో కరీనా ఎంట్రీ ?
3 months ago | 5963 Views
సినీ పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నటి కరీనా కపూర్. కెరీర్ ఆరంభం నుంచి బాలీవుడ్‌లోనే ఉన్న ఆమె ప్రస్తుతం దక్షిణాది సినిమాల్లోనూ నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ భారీ ప్రాజెక్ట్ కోసం సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఓ ప్రతిష్టాత్మక మూవీలో కరీనాకపూర్ భాగమయ్యారంటూ బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలోనే ప్రభాస్ 'స్పిరిట్’ , మహేశ్ బాబు, రాజమౌళి ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. ఆ రెండు చిత్రాల్లో ఒక దాని కోసం ఆమె సైన్ చేశారని టాక్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న భారీ ప్రాజెక్ట్ 'స్పిరిట్’. సుమారు రూ.500 కోట్ల భారీ బ్జడెట్‌తో యాక్షన్ డ్రామాగా సిద్ధం కానుంది. ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో అలరించనున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది. 2026లో విడుదల కానుంది. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్‌గా కరీనాకపూర్ కనిపించనున్నారని.. విలన్‌గా ఆమె భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ నటించనున్నారని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈమేరకు చర్చలు జరిగాయని సమాచారం. దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బ్జడెట్‌తో ప్రతిష్టాత్మకంగా దీనిని సిద్ధం చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. ’గరుడ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో కరీనాకపూర్ నటించనున్నారని.. ఇప్పటికే చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సినిమా కావడంతో కరీనా కూడా వెంటనే ఓకే చెప్పారని టాక్. ఈ వార్తలపై నటి టీమ్ నుంచి ఏ విధమైన స్పందన రాలేదు.
ఇంకా చదవండి: లవ్ కు బ్రేకప్ చెప్పేశా: నటి మృణాళ్ ఠాకూర్ వెల్లడి!