బాధల్లో మేముంటే..విూకు రీల్సా ? : సోషల్ విూడియా వేదికగా కిచ్చా సుదీప్ కూతరు కామెంట్స్
1 month ago | 5 Views
నటుడు కిచ్చాసుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణంపై కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సుదీప్ కుమార్తె శాన్వీ కూడా తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అంత్యక్రియల్లో విూడియా వ్యవహరించిన తీరుపై శాన్వీ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారన్నారు. నాయనమ్మతో దిగిన ఫొటోను పంచుకున్న శాన్వీ 'నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని క్యాప్షన్ పెట్టారు. వారి బాధకంటే రీల్స్‌కు ప్రాధాన్యమిచ్చిన కొందరు వ్యక్తులు అంత్యక్రియలకు ఎలా అంతరాయం కలిగించారో వివరించారు. 'నాయనమ్మను కోల్పోయిన దుఖ్ఖములో ఉంటే.. కొందరు వ్యక్తులు నా మొహంపై కెమెరాలు పెట్టారు. బాధతో ఉన్న వ్యక్తిపై ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారని నాకు ఇప్పటి వరకు తెలియదు. వారి కారణంగా నేను నాయనమ్మకు సరైన సెండాఫ్ ఇవ్వలేకపోయాను. నాన్నతో కూడా వారు అలానే ప్రవర్తించారు. ఆయన ఏడుస్తుంటే.. జనాలు ఆయన్ని నెట్టేశారు. కొందరు ఆయన విూద పడి లాగడం మొదలుపెట్టారు. మరికొందరు ఆయన్ని ఫొటోలు తీశారు.
వారికి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ మరొకరి భావోద్వేగా లను అర్థంచేసుకోవడంలో లేదు’ అని శాన్వీ రాసుకొచ్చారు. తన తల్లి మరణాన్ని గుర్తుచేసుకుంటూ సుదీప్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.'ఇన్నిరోజులూ మనిషి రూపంలో నా పక్కన తిరిగిన దేవత మా అమ్మ. ఆమె నా గురువు. నా మొదటి అభిమాని. నేను ఎలా నటించినా ఇష్టపడేది. ఇప్పుడు ఆమె ఓ అందమైన జ్ఞాపకం మాత్రమే. 24 గంటల్లో అంతా మారిపోయింది. నేను అనుభవిస్తున్న బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఆమె లేదనే విషయాన్ని నేనింకా అంగీకరించలేకపోతున్నా. ఇకపై నాకు ’గుడ్ మార్నింగ్ కన్నా’ అనే మెసేజ్ రాదు. శుక్రవారం చివరిసారి మెసేజ్ పెట్టింది. శనివారం బిగ్‌బాస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఆమె ఆసుపత్రిలో చేరినట్లు ఫోన్ వచ్చింది. డాక్టర్లతో మాట్లాడి షో వేదికపైకి వెళ్లాను. మనసులో ఎంత బాధ ఉన్నా షూటింగ్ చేశా. షూటింగ్ అయిపోయాక ఆసుపత్రికి వెళ్లేసరికి ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమె స్పృహలో ఉన్నప్పుడు చూడలేకపోయాను. ఆదివారం ఉదయం ఆమె శాశ్వతంగా దూరమైంది. చూస్తుండగానే కొన్ని గంటల్లో అంతా మారిపోయింది. నేను షూటింగ్‌కు వెళ్తున్నప్పుడు నన్ను హత్తుకొని జాగ్రత్తలు చెప్పిన మా అమ్మ.. కొన్ని గంటల్లోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయింది’ అని కిచ్చా సుదీప్ తన బాధను వ్యక్తం చేశారు.
ఇంకా చదవండి: సోషల్ విూడియాలో మంత్రగత్తెల వ్యాఖ్యలు... మహిళల స్వేచ్ఛా స్ఫూర్తి అంటూ కంగనా కామెంట్స్!!