నటన కోసం ఎలాంటి సాహసమైనా చేస్తా... 'ఐ' సినిమాలో గుడ్డివాడి పాత్ర కోసం అలాగే చేశా: హీరో విక్రమ్ వెల్లడి
3 months ago | 38 Views
కథ, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకునే, నటుల్లో విక్రమ్ ఒకరు. అంతేకాదు, కమర్షియల్ కథల కన్నా ప్రయోగాత్మక చిత్రాలకే ఆయన పెద్ద పీట వేస్తారు. అందుకే అయన నుంచి 'పితామగన్’, 'కాశీ’, 'అపరిచితుడు’,'ఐ’వంటి వైవిధ్యమైన చిత్రాలు వచ్చాయి. ఇటీవల 'తంగలాన్’తో మరోసారి తన నట విశ్వరూపాన్ని నిరూపించారు. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2001లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన 'కాశీ’ సినిమా విక్రమ్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో ఆయన అంధుడిగా నటించారు. అంతేకాదు... ఉత్తమ నటుడిగానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించడం వల్ల కొన్ని సమయాల్లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ‘సినిమాల్లో పాత్రకు అవసరమైనట్లు మారడం, నటించడమంటే నాకు ఇష్టం. ఇతరులతో పోలిస్తే, ఏదైనా ప్రత్యేకంగా చేయాలి. అది అందరూ చేసినట్లు ఉండకూడదు. నేను మందు తాగను, సిగరెట్ కాల్చను. కానీ, సినిమా పట్ల నాకున్న అభిరుచి నాకు విషంలాంటిది. నేను బాగా నటించాలని అనుకున్నప్పుడు అది మరింత ఎక్కువ విషంగా మారుతుంది. నేను 'కాశీ’ (తెలుగులో శ్రీను, వాసంతి, లక్ష్మి) అనే చిత్రం చేశా. అందులో నటించిన తర్వాత రెండు, మూడు నెలల పాటు నా కంటి చూపు మందగించింది. సరిగా చూడలేకపోయేవాడిని. ఎందుకంటే ఆ మూవీలో అంధుడిగా కనిపించడానికి కళ్లు పైకెత్తి చూడాల్సి వచ్చేది.
ఆ ప్రభావం నా కంటి చూపుపై పడింది. మెల్లకన్ను వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు‘ అంటూ కాశీ మూవీ పూర్తయిన తర్వాత తనకెదురైన పరిస్థితిని గుర్తుచేసుకున్నారు. విక్రమ్ కెరీర్‌లోనే భారీ అంచనాలతో విడుదలైన మూవీ 'ఐ’ . శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కోసం విక్రమ్ పెద్ద రిస్క్ చేశారట. దాని ఫలితంగా మరిన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, తృటిలో తప్పించుకున్నట్లు తెలిపారు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'తంగలాన్’. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతగానో శ్రమించారు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు 15న ఇది విడుదలై దక్షిణాదిలో మంచి సక్సెస్ అందుకుంది. ఆగస్టు 30న హిందీలో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటివరకూ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలుచేసింది.
ఇంకా చదవండి: తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధిత సహాయార్థం కోటి రూపాయలు విరాళం ప్రకటించిన చిరంజీవి
# Thangalan # Chiyaanvikram # Malavikamohanan