ఘనంగా 'లక్కీ భాస్కర్' చిత్ర విజయోత్సవ సభ

ఘనంగా 'లక్కీ భాస్కర్' చిత్ర విజయోత్సవ సభ

1 month ago | 5 Views

వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న నిర్మాతలు, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. నిర్మాతల నమ్మకం నిజమై మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. రోజు రోజుకి వసూళ్లను పెంచుకుంటూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, "ముందుగా నాగవంశీకి శుభాకాంక్షలు. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత నాకు దర్శకుడు వెంకీ అట్లూరిపై చాలా గౌరవం పెరిగింది. ప్రేమ కథలతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వెంకీ, సార్ సినిమా నుంచి రూట్ మార్చాడు. ఈ సినిమాలో తను రాసిన డైలాగ్ లకు, క్యారెక్టర్లను హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్. దుల్కర్ గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగులో మూడు సినిమాలు మూడు క్లాసిక్స్. జి.వి. ప్రకాష్ మంచి సంగీతం అందించారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా చక్కగా నటించింది. టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమాను ఇచ్చారు. ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ లో రావడం మరింత సంతోషంగా ఉంది. నేను ఒకప్పుడు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా చేస్తూ ఘన విజయాలు సాధించాను. ఇప్పుడు వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు. అందుకే వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను అని చెప్పాను." అన్నారు. 

దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, "నాకు సినిమా వేడుకకు వచ్చినట్టు లేదు. కుటుంబ వేడుకకు వచ్చినట్టు ఉంది. అందరూ నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరూ కలిసి ఓ కుటుంబంలా ఈ సినిమా చేసి ఉంటారు. అదే ఈ వేడుకలో కనిపిస్తోంది. నాకు వెంకీ ఎప్పటినుంచో తెలుసు. సినీ పరిశ్రమలో ఎంతో జీవితాన్ని చూశాడు. అందుకే ఇప్పుడు ఇంతమంచి సినిమాలు చేస్తున్నాడు. వెంకీ, దుల్కర్ కలిసి లక్కీ భాస్కర్ చేయడం, అది ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉంది. మీనాక్షికి మంచి పాత్ర లభించింది. జి.వి. ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. లక్కీ భాస్కర్ టీం అందరికీ కంగ్రాట్స్." అన్నారు.

దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ, "తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ, దానిని చాలా పద్ధతిగా చెప్పి, చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి, సక్సెస్ ఫుల్ సినిమా చేయడం అనేది కష్టమైన పనే. అది వెంకీ సార్ సినిమాతో స్టార్ట్ చేసి, లక్కీ భాస్కర్ తో ల్యాండ్ అయ్యాడు. వెంకీ సార్ సినిమా నుంచి నచ్చడం మొదలెట్టాడు. ఎందుకంటే తను ముందు చేసిన లవ్ స్టోరీలు లాంటివి చాలామంది చేశారు. కానీ సార్ సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకొచ్చి అంత హృద్యంగా చెప్పడం గ్రేట్. నేను ఆ సినిమా చూసి ఏడ్చాను. అప్పటినుంచి నేను వెంకీకి ఫ్యాన్ అయ్యాను. మా అమ్మగారు, అమ్మమ్మగారు లక్కీ భాస్కర్ సినిమా చూసి.. నువ్వెప్పుడు ఇలాంటి సినిమా తీస్తావురా అని అడిగారు. ప్రేమకథలు కాదు, ఇలాంటి పనికొచ్చే సినిమాలు చేయమని చెప్పారు. 70-80 ఏళ్ళ వయసున్న వారు కూడా సినిమా గురించి ఇలా మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం." అన్నారు.

కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ, "శ్రీనాథ్ మాగంటి, మాణిక్ రెడ్డి గారు, శివన్నారాయణ గారు, శశిధర్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, మహేష్, రిత్విక్, బెనర్జీ గారు, సాయి కుమార్ గారు అందరితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సాయి కుమార్ గారి వాయిస్ అనేది ఆయనకు మాత్రమే కాదు, సినీ పరిశ్రమకి బ్లెస్సింగ్. నా చిన్నప్పుడు రాంకీ గారి నటన అంటే ఇష్టం. ఇప్పుడు ఆయనతో కలిసి నటించడమనేది గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. షూటింగ్ లో ఎంతో సహకరించారు. సుమతి పాత్రతో మీనాక్షి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది జి.వి. ప్రకాష్. వెంకీ-జి.వి ఇద్దరూ డైనమిక్ కాంబో. నిర్మాతలకు జి.వి. ప్రకాష్ లాంటి టెక్నీషియన్స్ కావాలి. ఎందుకంటే పాటలు గానీ, నేపథ్య సంగీతం గానీ ఆలస్యం చేయరు. డీఓపీ నిమిష్, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఎడిటర్ నవీన్ అందరూ సినిమా అద్భుతంగా రావడానికి ఎంతో కృషి చేశారు. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. మీతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నాగి, స్వప్న 'మహానటి' కోసం నన్ను సంప్రదించినప్పుడు నాకు తెలుగు రాదు అన్నాను. కానీ నన్ను తీసుకొచ్చి, ఈరోజు ఇలా నిలబెట్టారు. ఆ తర్వాత హను గారు 'సీతారామం'తో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాన్ని అందించారు. ఇప్పుడు వెంకీ. చూడటానికి కుర్రాడిలా ఉంటాడు. కానీ ఎంతో ప్రతిభ ఉంది. అందుకే ఇంత గొప్ప సినిమాలు చేస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాకి, ఇందులోని పాత్రలకు ప్రాణం పోసిన వెంకీకి థాంక్స్. అలాగే ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు." అన్నారు.

కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, "ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. టీం అందరం ఎంతో కష్టపడి పని చేశాము. ఆ కష్టానికి తగ్గ ఫలితంగా ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉంది. మీడియా మరియు ప్రేక్షకులు ఈ సినిమా పట్ల, ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. నాకు సుమతి లాంటి మంచి పాత్రను ఇచ్చిన వెంకీ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, సితార ఎంటర్టైన్మెంట్స్ కి కృతఙ్ఞతలు. దుల్కర్ గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి, మీడియాకి, ప్రేక్షకులకు పేరుపేరునా థాంక్స్." అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, "నాగ్ అశ్విన్, హను గారిని ఇక్కడ చూడటం సంతోషంగా ఉంది. నేను నటుడిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ యేలేటి గారి సినిమా కోసం హను గారు నన్ను ఆడిషన్ చేశారు. అలాగే 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అప్పుడు నాగి నన్ను ఆడిషన్ చేశాడు. ఇప్పుడు మేము ముగ్గురం దుల్కర్ గారితో సినిమాలు చేసి హిట్లు కొట్టాం. లక్కీ భాస్కర్ తో పాటు దీపావళికి విడుదలైన సినిమాలన్నీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నాయి. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ మనతో లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకే ఒకేసారి మూడు మంచి సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఏబీసీడీ సినిమా చూసినప్పటి నుంచి దుల్కర్ గారితో పని చేయాలనుకున్నాను. ఇప్పుడు లక్కీ భాస్కర్ తో కుదిరింది. కథ విన్న వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా సినిమా చేయడానికి అంగీకరించారు. గుంటూరు కారం చేస్తున్నప్పుడు మీనాక్షి పేరుని త్రివిక్రమ్ గారు, వెంకీ గారు సూచించారు. ఆడిషన్ చేసినప్పటి నుంచి తను నా కంటికి సుమతి లాగానే కనిపించింది. అలాగే సాయి కుమార్ గారు, శ్రీనాథ్ మాగంటి, కసిరెడ్డి, మహేష్, శశిధర్ గారు, శివన్నారాయణ గారు, గాయత్రీ భార్గవి గారు, మాణిక్ గారు, సచిన్ ఖేడేకర్, రఘుబాబు గారు, శ్రీకాంత్, మానస్ అందరూ తమ పాత్రలకు న్యాయం చేసి సినిమాని నిలబెట్టారు. హైపర్ ఆదికి స్పెషల్ థాంక్స్. అందరూ సినిమాలో సెట్లు సహజంగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం నా ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్. సినిమాటోగ్రాఫర్ నిమిష్ మరియు బంగ్లాన్ ని నాకు పరిచయం చేసినందుకు దుల్కర్ గారికి థాంక్స్. వీరితో పాటు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్, ఎడిటర్ నవీన్ ఇలా అందరూ కలిసి పని చేయడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. రూపాయి గురించి ఆలోచించకుండా పేరు గురించి మాత్రమే ఆలోచించి ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారు నాగవంశీ గారు. పేరుతో పాటు, సినిమాకి డబ్బులు కూడా రావడం సంతోషంగా ఉంది. ఆ కాలంలో దుస్తులు ఎలా ఉంటాయో రీసెర్చ్ చేసి, అందుకు తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన అర్చన, సంధ్యకి థాంక్స్. కొరియోగ్రాఫర్ రఘు గారికి, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి గారికి, శ్రీమణి గారికి థాంక్స్. అలాగే మా దర్శకత్వ విభాగంతో పాటు, ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. మాకు సపోర్ట్ గా నిలిచిన మీడియాకి, మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు" అన్నారు.

సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ మాట్లాడుతూ, "వెంకీ అట్లూరి, సితార ఎంటర్టైన్మెంట్స్ కలయికలో ఇది నాకు వరుసగా రెండో సినిమా. వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు సాధించడం చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి దుల్కర్ సల్మాన్ గారితో కలిసి పని చేశాను. ఇలాంటి మంచి టీంతో మళ్ళీ మళ్ళీ కలిసి పని చేయాలని ఉంది. ఈ కథపై నేను మొదటినుంచి ఎంతో నమ్మకంగా ఉన్నాను. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ అద్భుతంగా పనిచేశారు. లక్కీ భాస్కర్ విజయం సాధించడం ఆనందంగా ఉంది. వెంకీ, దుల్కర్, మీనాక్షి, నాగవంశీ గారు అందరికీ థాంక్స్." అన్నారు.

ప్రముఖ నటుడు సాయి కుమార్ మాట్లాడుతూ, "లక్కీ భాస్కర్ ఇంతటి విజయం సాధించడం చాలా చాలా ఆనందంగా ఉంది. సినిమా బాగుంది అంటూ ఎన్నో ఫోన్లు, మెసేజ్ లు వస్తూనే ఉన్నాయి. మమ్మూట్టి గారితో నటించలేకపోయాను. కానీ దుల్కర్ సల్మాన్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది. దుల్కర్ ఎంతో డెడికేషన్ ఉన్న యాక్టర్. తెలుగు మాట్లాడే క్రమంలో ప్రతి చిన్న పదం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. వెంకీ అట్లూరితో ఎప్పటినుంచో పరిచయం. సార్ తో మా ప్రయాణం మొదలైంది. సార్, లక్కీ భాస్కర్ విజయం సాధించాయి. తదుపరి సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. జి.వి. ప్రకాష్ అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాలో దుల్కర్ అకౌంట్ లో వంద కోట్లు వచ్చాయి. త్వరలోనే నిర్మాత వంశీ గారి అకౌంట్ లోకి వంద కోట్లు రావాలని కోరుకుంటున్నాను. పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం ఈ సినిమాని అభినందించడం విశేషం. ఇలాంటి సబ్జెక్టుని తీసుకొని, సామాన్యులకు అర్థమయ్యేలా సినిమా తీయడం దర్శకుడి వెంకీ గొప్పతనం." అన్నారు.

నటీనటులు రాజ్‌కుమార్ కసిరెడ్డి, గాయత్రీ భార్గవి, శివన్నారాయణ, శశిధర్, శ్రీనాథ్ మాగంటి, మాణిక్ రెడ్డి, రంగస్థలం మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర విజయం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి: "క" విజయంతో ప్రేక్షకులు తమ ఇంట్లో అబ్బాయిగా నన్ను అక్కున చేర్చుకున్నారు - సక్సెస్ మీట్ లో హీరో కిరణ్ అబ్బవరం

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# లక్కీ భాస్కర్‌     # దుల్కర్‌ సల్మాన్‌     # మీనాక్షి చౌదరి    

trending

View More