అక్కినేని చిన్నకోడలు బ్యాక్ గ్రౌండ్ మీకు తెలుసా..?
1 month ago | 5 Views
యువ హీరో అక్కినేని అఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగింది. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అయితే, ప్రస్తుతం అక్కినేని ఇంటికి కాబోయే కోడలు జైనబ్ గురించి తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఆమె ఎవరు..? బ్యాగ్రౌండ్ ఏంటి..? అంటూ నెటిజన్లు, అక్కినేని అభిమానునలు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.. సోషల్ మీడియా కథనాలు, టాలీవుడ్ సర్కిల్ నుంచి అందిన సమాచారం ప్రకారం.. 27 ఏళ్ల జైనబ్‌కు చాలా పెద్ద బ్యాగ్రౌండే ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో పుట్టిన జైనబ్ రవ్జీ ముంబైలో స్థిరపడినట్లు సమాచారం. ఆమెకు చిత్రకారిణి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి పేరుంది. మన దేశంలోనే కాకుండా దుబాయ్, లండన్‌లోనూ ప్రదర్శనలిచ్చినట్లు తెలిసింది. అంతేకాదు.. ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంలో ‘మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ థ్రీ సిటీస్’ సినిమాలో కూడా జైనబ్ రవ్జీ యాక్ట్ చేశారు. ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, కునాల్ కపూర్ నటించారు. పెయింటర్‌గా మంచి పేరున్నా.. జైనబ్ రవ్జీ చాలా లో-ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. ఇక ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ రియల్ ఎస్టేట్ టైకూన్. ఈ రంగంలో ఆయనకు 30 ఏళ్ల అనుభవం ఉంది.
అంతేకాదు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ముఖ్య సలహాదారునిగా పనిచేశారు. మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సేవలు అందించారు. అఖిల్‌తో జైనబ్ ఎంగేజ్మెంట్ వేళ.. జుల్ఫీ రవ్జీని నవంబర్ 13, 2019న ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు వైరల్‌గా మారింది. జుల్ఫీ రైవ్జీ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంత పేరు ప్రఖ్యాతలున్నాయో.. గల్ఫ్ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో జుల్ఫీ రవ్జీకి అంత పేరుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ టైకూన్‌గా ఆయన పేరుగాంచారు. ఇక నాగార్జున, జుల్ఫీ రవ్జీకి కొన్నేళ్లుగా స్నేహ బంధం కూడా ఉన్నట్లు తెలిసింది. ఆ స్నేహానికి తోడు అఖిల్-జైనబ్ మధ్య ప్రేమ ఈ రెండు కుటుంబాలను మరింత దగ్గర చేయబోతోంది. ఇక నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం డిసెంబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. వీరి వివాహం అయిన తర్వాత ఓ మంచి ముహూర్తం చూసి అఖిల్ జైనబ్ పెళ్లి కూడా చేయాలని అక్కినేని కుటుంబం భావిస్తున్నట్లు తెలిసింది.
ఇంకా చదవండి: డాక్యుమెంటరీపై కోర్టును ఆశ్రయించిన హీరో ధనుష్... నయన దంపతులపై దావా
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# అక్కినేని అఖిల్ # జైనబ్ రవ్జీ