'చీకటి  వెలుగుల రంగేళీ ... జీవితమే ఒక దీపావళి...'

'చీకటి వెలుగుల రంగేళీ ... జీవితమే ఒక దీపావళి...'

25 days ago | 5 Views

ప్రతీ ఏటా ఆశ్వయుజ మాస ప్రారంభంలో దేవీ నవరాత్రులు, నరక చతుర్దశి, దీపావళి పండుగలు రావడం విశేషం. దీపాల వెలుగుల కారణంగా చీడపీడలు, పురుగూ పుట్రా, అడవి జంతువుల భయం ఉండదన్న భావన కూడా ఉంది. నరకాసురుడు మరణించిన రోజుగా నరకచతుర్దశినీ, దీపావళినీ వేడుక చేసుకుంటాం. ఈ పండుగ నుంచి మనం గ్రహించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ పండుగను నరకాసుర వధకు సంకేతంగా కాదు, మన లోపల ఉన్న దోషాలను తొలగించుకోవడానికి ఒక సంకల్పంగా జరుపుకోవాలి. అప్పుడే అది నిజమైన దీపావళి అవుతుంది.  త్రయోదశి రోజు రాత్రి అపమృత్యు నివారణ కోసం దీపాలు వెలిగించి ఇంటిముందు ఉంచాలి.  నరక చతుర్దశి రోజున అభ్యంగన  స్నానం చేయాలి. అమావాస్య కనుక ప్రపంచమంతా చీకట్లు ఆవరించి ఉంటాయి. ఈ చీకట్లను పారదోలేందుకు దీపాలు వెలిగించాలన్న ఆలోచనతోనే దీపావళి జరుపుతారు. దీపావళి అంటే దీపముల వరుస. చీకటి నుంచి వెలుగులోకి రావడం అనేది అంతరార్థం. మనచుట్టూ ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మలలో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షాలతో దూరం అవ్వడమే దీపావళి.   నరకం వలన భయం లేకుండా నరక చతుర్దశి నాడు స్నానం చెయ్యాలని నరక చతుర్దశి గురించి యమధర్మరాజుని ఉద్దేశించి చెప్పినట్లు భవిష్య పురాణం చెబుతోంది. శ్రీరాముడు ఆశ్వయుజ మాసంలో విజయదశమి రోజున శమీ  వృక్షాన్ని పూజించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించాడు. అయినప్పటికీ బలి శ్రీహరినే ధ్యానించాడు. దానికి సంతోషించిన శ్రీహరి ‘నీవు దీపావళి రోజున పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ ఒక్కరోజు పరిపాలన చెయ్యి’ అన్నాడు. ఆ రోజు వెలిగించే దీపాలకే బలిదీపం అని పేరు. వరాహావతారంలో విష్ణుమూర్తికి, భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవతల్ని బాధ పెట్టాడు. దేవతలందరూ దేవేంద్రుని వద్దకు వెళ్లి తమ బాధ చెప్పుకోగా దేవేంద్రుడు దేవతలందరితో కలిసి విష్ణు మూర్తి వద్దకు వెళ్లి ప్రార్థించగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకుడిని వధించారు. భూదేవి కూడా నరకుడి మరణానికి బాధపడలేదు. ఆమె అతనొక్కడికే తల్లి కాదు, భూమి మీద జీవించే ప్రతివారికి తల్లే కదా. పుత్ర శోకాన్ని మరచి నరకుని పేరు మీద  పండుగగా ప్రజలు జరుపుకోవాలని శ్రీమహావిష్ణువుని ప్రార్థించింది. అదే నరక చతుర్దశి. ఆ తర్వాత రోజే ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగ.  దీపావళి పండుగ అంటే ప్రముఖంగా గుర్తొచ్చేవి పట్టుబట్టలు, పిండివంటలు, బాణాసంచా, దీపాల కాంతులు. 

 హారతులు..లక్ష్మీ పూజలు.. నోములు, వ్రతాలకు నేడే ముఖ్యం.. 

 చతుర్దశి నాడు  వేకువజామునే తైలాభ్యంగన స్నానం చేసే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. అంతేకాదు, నువ్వుల నూనెలో లక్ష్మీ కళలు ఆవహించి ఉంటాయి. చతుర్దశి తెల్లవారు జామున నువ్వులతో తలంటుకొని తలస్నానం చేస్తే లక్ష్మీప్రదం. నరక దుర్గతి నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోషకాలంలో దీపారాధన చేయాలి. ఈ దీపాలు లక్ష్మీకటాక్షం కలిగించడంతోపాటు పితృదేవతలకు నరకబాధను విముక్తిచేస్తాయని నమ్మకం. దీపావళి నాడు హారతులు ప్రధానమైన వేడుక. పుట్టింటికి వచ్చిన ఆడకూతుళ్లు ఇంట్లో ఉన్న మగవాళ్లందరికీ హారతులు ఇస్తారు. సంప్రదాయబద్ధంగా కొనసాగే ఈ పక్రియ గురువారం సూర్యోదయానికి ముందుచేసుకోవాలని సిద్దాంతులు సెలవిస్తున్నారు. సూర్యోదయానికి ముందు కుదరని పక్షంలో, వర్జ్యం వెళ్లిపోయిన తర్వాత ఇవ్వొచ్చు. ఏటా అమావాస్య నాడు వచ్చే ఈ పండుగ ఈసారి ఒకేరోజు జరుపుకోనున్నారు. అమావాస్య తిథి గురువారం పరివ్యాప్తమై ఉన్నందున గురువారం ఉదయం హారతులు, సాయంతరం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో హారతులు, లక్ష్మీపూజలు ఒకేరోజు చేసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, అమావాస్య తిథులు కలిసి వచ్చాయి. రాత్రంతా అమావాస్య తిథి పరివ్యాప్తమై ఉండటంతో దీపావళి గురువారమే చేసుకోవాలి. నోముల విషయంలోనూ పండితులు పలు సూచనలు చేస్తున్నారు. లక్ష్మీపూజలకు ఎలాగైతే సాయంత్రం అమావాస్య ఉండాలన్న నియమం ఉన్నదో.. నోములు నిర్వహించాలంటే సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండాలని చెప్తున్నారు. దీపావళి పండుగ విశేషాలలో ముఖ్యమైంది లక్ష్మీపూజలు. వ్యాపారస్తులంతా దీపావళి సాయంత్రం లక్ష్మీదేవికి పూజలు చేసి, కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీపూజలతోనే కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మొదలుపెడతారు. రాత్రిపూట అమావాస్య తిథి ఉన్నప్పుడే లక్ష్మీ పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. గురువారం సాయంత్రం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీపావళికి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచి కొత్తబట్టలు, కానుకలు సమర్పించే సంప్రదాయం తెలుగువారికి ఉంది. 

మనలోని చెడును నరకాలి.. మంచితో ముందుకు సాగాలి!

 నరకాసురుడు మంచి వంశం నుంచి వచ్చినవాడే. అతను విష్ణుమూర్తి కుమారుడని పురాణ గాథలు చెబుతున్నాయి. నరకాసురుడిలో కొన్ని చెడు ధోరణులు ఏర్పడ్డాయి. అతనికి మురాసురుడు అనే మిత్రుడున్నాడు. మురాసురుణ్ణి నరకుడు సేనానిగా చేసుకున్నాడు. వారిద్దరూ కలిసి ఎన్నో యుద్దాలు చేశారు. వేలాది మందిని చంపారు. వారిద్దరినీ ఒకేసారి చంపడం కష్టం. కాబట్టి కృష్ణుడు మొదట మురాసురుణ్ణి చంపాడు. కృష్ణుడికి ‘మురారి’ అనే పేరు రావడానికి కారణం ఇదే! మురాసురుడికి మాయలు తెలుసు. వాటి వల్ల అతని ముందు యుద్ధంలో ఎవరూ నిలబడలేకపోయేవారు. మురాసురుడి వధ తరువాత నరకాసుర వధ తేలికయింది. నరకాసురుణ్ణి విడిచిపెట్టినా అతను పద్ధతుల్ని మార్చుకోడని కృష్ణుడికి తెలుసు. యుద్ధంలో నరకుణ్ణి మృత్యు ముఖానికి తీసుకువచ్చేసరికి, అతనికి జ్ఞానోదయం అయింది. అనవసరంగా చాలా చెడును మూట కట్టుకున్నానని అతను గ్రహించాడు. నువ్వు నన్ను చంపడం లేదు. నాలోని చెడును తొలగిస్తున్నావు. నాకు మంచే చేస్తున్నావు. ఈ విషయం అందరికీ తెలియాలి. నేను పోగు చేసుకున్న దోషాలు నాశనం అవుతున్న ఈ రోజును అందరూ పండుగ చేసుకోవాలి. ఈ రోజు నాకు ఒక కొత్త వెలుగును ఇచ్చింది. ఆ వెలుగు ప్రతి ఒక్కరూ పొందాలి అని కృష్ణుణ్ణి నరకాసురుడు కోరాడు. ఆ విధంగా ఆ రోజు దీపావళి పండుగ అయింది. ఈ రోజు దేశమంతా వెలుగులతో నిండిపోవాలి. ఆ వెలుగు మనలోని మలినాలను కాల్చెయ్యాలి. దానికోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. నేను నిన్ను చంపబోతు న్నాను అని నరకుడికి కృష్ణుడు చెప్పాడు. మనకు అలా చెప్పేవారు ఎవరూ ఉండరు. మనకు తెలియ కుండానే అది జరిగిపోవొచ్చు. మృత్యువు మనల్ని ఎప్పుడు తీసుకుపోతుందో మనకు చెప్పదు. అది మనిషి రూపంలో రావొచ్చు. మరణానికి కారణం బ్యాక్టీరియా, వైరస్‌ లేదా మనలోని జీవకణాలూ కావొచ్చు. అప్పటి వరకూ ఎదురు చూడకుండా ఆత్మావలోకనం చేసుకోవాలి. మనలో విషం పోగు చేసుకుంటున్నామా లేదా దివ్యత్వాన్ని వికసింప జేసుకుంటున్నామా అనేది ఆలోచించాలి. ఎంపిక మన చేతిలోనే ఉంది. ప్రతి ఒక్కరికీ వారి జీవితాన్ని కొనసాగించడానికి కొన్ని ఎంపికలు ఉంటాయి.  జీవితంలో ఎదురుదెబ్బలు తగిలే వరకూ ఎదురుచూడకుండా, అలాంటి పరిస్థితి రాకుండా మనల్ని మనం మలచుకోవడం సరైన ఎంపిక. కృష్ణుడు తనను తాను ఆ విధంగా మలచు కున్నాడు. కృష్ణుడి చేతిలో దెబ్బతినే పరిస్థితికి దారితీసే మార్గాలను నరకాసురుడు ఎంచుకున్నాడు. వారిలో ఒకరిని దేవుడిగా పూజిస్తాం. మరొకరిని రాక్షసుడిగా అసహ్యించుకుంటాం. అందుకే, సరైన మార్గంలో జీవితాన్ని మలచుకోవాలి. లేదంటే జీవితం తనద్కెన  పద్ధతుల్లో మనల్ని మలుస్తుంది. ఈ వాస్తవాన్ని దీపావళి గుర్తు చేస్తుంది. మంచి పుట్టుక కలిగి ఉండి కూడా నరకుడు చెడ్డకు ప్రతినిధిగా మారాడు. మరణించే సమయంలో తన స్థితిని అతను గుర్తించాడు. అది ముందే గుర్తించేవారు మరింత ఉన్నతంగా జీవితాలను మలచుకోగలరు. నిర్దిష్టమైన రీతిలో తనను తాను మలచుకోవడానికి మనిషి ఎంతో శ్రమపడాలి. చాలామంది తమకు నిర్బంధాల్కెపోయిన విషయాలను జీవితపు చివరి క్షణాల వరకూ 

గ్రహించరు. ముందే వాటి గురించి తెలుసుకోగలిగితే జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు. దానికోసం మనలో చైతన్యాన్ని వెలిగించుకోవాలి. ఈ పండుగ సందర్భంగా కాల్చి బూడిద చేయాల్సింది టపాకాయలను కాదు... మనలోని దోషాలనూ, లోపాలనూ! దీపావళి అందించే సందేశం ఇదే!

 దీపావళి వెనుక కథలెన్నో... !

ప్రతి ఇంటా దీపాల వెలుగులు నింపే పండుగ దీపావళి. చీకటిపై వెలుగు, చెడుపైన మంచి, అజ్ఞానం  మీద  జ్ఞానం సాధించిన గెలుపునకు ప్రతీక ఈ పండుగ.  దీపావళికి ఒక్కోచోట ఒక్కో విధమైన కథ ప్రచారంలో ఉంది. అలాగే బౌద్ధంలోనూ ఓ కథ  ప్రచారంలో ఉంది. ప్రతి ఆషాఢ మాసంలో బౌద్ధ భిక్షువులకు వర్షావాసం ప్రారంభ మవుతుంది. ఆ కాలంలో మూడు నెలల పాటు భిక్షువులు ప్రజల వద్దకు భిక్ష కోసం వెళ్ళరు. అడవుల్లో, గుహల్లో ఉండి... దొరికింది తింటూ, ధ్యానంలో, విద్యలో ప్రత్యేక స్వయం శిక్షణ సాగిస్తారు. ఇలా వర్షావాసం పూర్తి చేసి, ఆశ్వయుజ మాసంలో తిరిగి గ్రామాలకు బయలుదేరుతారు.  గ్రామాలకు వచ్చే భిక్షువులకు దారి పొడవునా దీపాలతో ప్రజలు స్వాగతం పలుకుతారు. అదే దీపావళిగా, బౌద్ధుల ధర్మ దీపావళిగా ప్రసిద్ధం చెందింది. బౌద్థులు మరణాన్ని నిర్వాణం అంటారు. నిర్వాణం అంటే దీపం ఆరిపోవడం. ప్రమిదలోని నూనె, వత్తీ పూర్తిగా మండిన తరువాత ఇక దీపం వెలుగదు. అదే నూనె, అదే వత్తి ఇక ఉండవు. అంటే... అదే దీపాన్ని ఇక ఎప్పటికీ వెలిగించలేం. మనిషి నిర్వాణం తరువాత కూడా అంతే! ఇలా అనిత్యత్వాన్నీ, అనాత్మవాదాన్నీ దీపంతో పోల్చి చెబుతుంది బౌద్ధం. మరణించిన వ్యక్తి తల దగ్గర దీపం ఉంచే సంప్రదాయం బౌద్ధ భిక్షువుల నిర్వాణం నుంచి పుట్టినదే! స్తూపాల మీద  దీపాలు ఉంచే ఆచారం కూడా దాన్నుంచి వచ్చిందే! అందుకే మరణాన్ని దీపం ఆరడంతో పోలుస్తాం. మనుషులు చీకటి నుంచి వెలుగులోకి, వెలుగు నుంచి వెలుగులోకి నడవాలని అంటుంది బౌద్ధం. చీకటి నుంచి వెలుగులోకి నడవడం అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు పయనించడం అని అర్థం. వెలుగు నుంచి వెలుగులోకి’ అంటే ’విజ్ఞానం నుంచి శీలం వైపు పయనించడం’ అని అర్థం. ఇలా మనిషికి శీలం, విజ్ఞానం ఈ రెండూ కలిసి ఉంటేనే పరిపూర్ణత. వేల ఏళ్ల క్రితమే బౌద్ధంలో దీప పూజ మొదలయింది. బౌద్ధ స్తూపాల దగ్గర, బౌద్ధ ఆరామాల్లో వందలాది దీపాలు వెలిగించేవారు. బౌద్ధ ధర్మోపన్యాసాలు, దాన కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను దీపాలతో నింపేవారు. తమ గ్రామానికి బుద్ధుడు భిక్షువులతో కలిసి వచ్చిన సందర్భాల్లో ఇంటింటా దీపాలను వెలిగించి, ఆహ్వానం పలికే సంప్రదాయం బలీయంగా సాగింది. ఇల్లు వొదలి వచ్చిన సిద్దార్థుడు ఆరేళ్ళు కృషి చేసి, చివరకు జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. సారనాథ్‌లో మొదటి వర్షావాసం ముగించి రాజగృహకు వొచ్చాడు. ఆ సమయంలో... బుద్ధుడైన  తన బిడ్డను కపిలవస్తు నగరానికి తీసుకురావాలని మంత్రుల్ని ఆయన తండ్రి శుద్ధోధనుడు ఆదేశిస్తాడు. చివరకు సిద్దార్థుడి బాల్య మిత్రుడైన  కాలు ఉదాయిని పంపుతాడు. కాలు ఉదాయి బుద్దుణ్ణి వెంటబెట్టుకొని కపిలవస్తుకు వస్తాడు. ఆ సందర్బంలో బుద్ధునికి శుద్ధోదనుడు దారిపొడవునా దీపాలు వెలిగించి స్వాగతం పలికాడు. ఆ రోజు రాజ్యమంతటా దీపాలు వెలిగించారు. అలా బుద్ధుడి కపిలవస్తు నగర పునరాగమనానికి సంకేతంగా దీపాలు వెలిగి  బౌద్ధ సంప్రదాయంగా నిలిచిపోయిందని అంటారు. 

ఒక్కో చోట ఒక్కో విధంగా.. 

దేశ ప్రజలు తమదైన శైలిలో  పండుగను ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఉత్తర, దక్షిణ భారత ప్రజలు తమదైన  సంప్రదాయాలతో, భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. అయితే ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో పండుగ జరుపుకునే పద్ధతులే కాదు.. అందుకు గల కారణాలు కూడా వేరు. పండుగ ఎందుకు జరుపుకుంటున్నారనే దానిపై ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథ ప్రచారంలో ఉంది. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో ఉండగా వరాహస్వామి, భూదేవిలకు అసుర సంధ్యా సమయంలో నరకుడు జన్మిస్తాడు. తప్పస్సుతో శివుడి చేత వరం పొంది దేవమానవులను చిత్రహింసలకు గురి చేస్తుంటాడు. నరకాసురుడు తల్లి చేతుల్లోనే చంప బడాలనే వరం పొందిన కారణంగా ఎదురులేని వాడై లోకాలను ముప్పతిప్పలు పెడుతుంటాడు. దీంతో భయాందోళనకు గురైన దేవతలు శ్రీ మహావిష్ణువుని శరణువేడుతారు. వారికి అభయమిచ్చిన విష్ణువు భూదేవీ సమేతంగా శ్రీ కృష్ణ సత్యభామలుగా భూలోకంలో జన్మిస్తారు. నరకుని దురాగతాలు పెచ్చుమీరిన అనంతరం శ్రీకృష్ణుడు నరకుడిపై యుద్ధం ప్రకటిస్తాడు. భార్య సత్యభామను వెంటతీసుకెళతాడు. అక్కడి ఇరు వర్గాలకు భీకర యుద్ధం జరుగుతుంది. చివరకు నరకుడి వరం కారణంగా తల్లి అయిన సత్యభామ చేతిలోనే మరణిస్తాడు. దీంతో అతడి చెరలో ఉన్న దేవమానవులకు విముక్తి దొరకుతుంది. నరకాసురుడు మరణించాడన్న ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి, బాణాసంచా పేల్చి పండుగ చేసుకున్నారు. శ్రీ మహావిష్ణువు ఏడవ అవతారమైన రామచంద్రుడు.. సీతను అపహరించిన రావణుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో రావణుడు మరణిస్తాడు. అప్పటికే రాముడి 14 ఏళ్ల వనవాసం ముగుస్తుంది. దీంతో రాముడు.. సీత,లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా అయోధ్యకు తిరిగి వెళతాడు. అనంతరం రాముడు పట్టాభిషిక్తుడవుతాడు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకున్నారు. గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మలలో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షాలతో దూరం అవ్వడమే దీపావళి అని పెద్దల ఉవాచ.  

 ధరలతో కళతప్పుతున పండగలు... బాణా సంచా ధరల మోత !

ధరల నేపథ్యంలో పండగలకు కళ తప్పింది. అన్ని పండగల్లాగే దీపావళి కూడా ఇంటికే పరిమితం కానుంది. బాణాసంచా కాల్చితేనే దీపావళి కాదు. అయితే దీపావళి ప్రత్యేకతే వేరు. అయితే బాణాసంచా ధరలు కూడా విపరీతంగగా పెరిగాయి. దీపాలతో ఇల్లంతా వెలగించి కొత్త కాంతులను ఆహ్వానించడం ద్వారా పండగ జరుపుకోవాలి. అలాగే ధరలు దాడి చేస్తున్న వేళ కలసి పండగ జరుపుకోవాలని, బాణాసంచా కాల్చాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. దీపావళి రోజు దీపాలు వెలిగించి, లక్ష్మీపూజలతో, ఇంటి పిండి వంటలకే ప్రాధాన్యం ఇస్తూ పండగ జరుపుకోవడం ఉత్తమం. ఏటా దీపావళి పర్వదినాన్ని పిల్లాపెద్దలు కసలి ప్రజలు ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి గెలుపునకు చిహ్నంగా దీపాల పండుగను జరుపుకొంటారు. దీపాల పండుగ వేడుకలకు ప్రజలు ముందుగానే దీపాలు వెలిగించేందుకు సిద్దం కావడం ఈ యేడాది విశేషంగా చెప్పుకోవాలి. తగంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ప్రజలు దీపాలను వెలిగించేందుకు సిద్దం అవుతున్నారు. ఈ మేరకు మహిళలు ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు. ధరలు పెరిగిన నేపథ్యంలో పరిమిత ఖర్చుతోనే  ప్రజలు గ్రీన్‌ దీపావళి జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. పటాసులు కొనుగోలు చేయకుండా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ధరల దెబ్బంతో వెలుగుల పండుగ దీపావళి కళతప్పుతోందన్న భావన రాకుండా దీపాలను వెలగించి పూజలలో భక్తిప్రపత్తులు చాటడం ముఖ్యం. అయితే తారాజువ్వల వెలుగులు, టపాసుల మోతలతో సందడిగా సాగాల్సిన పండుగ రోజు ఈసారి నిశబ్దంగా గడిచిపోనుందన్న భావన పిల్లల్లో ఉండడం సహజం. పర్యావరణహితం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఏటా పండుగకు వారం ముందునుంచే బాణాసంచా విక్రయాలతో సందడి ప్రారంభమవుతుంది. బాణాసంచా దుకాణాలకు అనుమతి పక్రియలో భాగంగా ఒక్కో దుకాణదారుడు రూ.30వేల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక ఒక్కో దుకారణదారుడు సుమారు లక్ష నుంచి రూ.5లక్షల వరకు బాణసంచా కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అమ్మకాలు సాగుతాయా లేవా అన్న భయం ఉంది.

ఇంకా చదవండి: 'లక్కీ భాస్కర్' మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది : నిర్మాత సూర్యదేవర నాగవంశీ

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# దీపావళి     # నవరాత్రులు     # నరకాసురుడు    

trending

View More