నటనకు ప్రాణం పోసిన అక్కినేని!

నటనకు ప్రాణం పోసిన అక్కినేని!

3 months ago | 36 Views

అనుకున్నది సాధించాలనే ఆశ అందరిలోనూ ఉంటుంది. కానీ ఆశను ఆశయంగా మార్చుకుని, దాన్ని సఫలీకృతం చేసుకోవడానికి అహర్నిశలూ శ్రమించే వారు అరుదుగా కనిపిస్తుంటారు. అదేకోవలోకి వస్తారు అక్కినేని. అతి చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన నటుడిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎన్నో విలక్షణమైన పాత్రలకు ప్రాణం పోశారు. నటనపై ప్రాణం నిలిపేవారు. అందుకే ఆయన నటించిన పాత్రలు అజరామరం. ఆయన 100వ జయంతి ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాల విశేషాలు ఎన్నో... కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవపురంలో అనే మారుమూల పల్లెలో వెంకటరత్నం,  పున్నమ్మ దంపతులకు తొమ్మిదో సంతానంగా జన్మించారు అక్కినేని. ఆడపిల్లలు లేని పున్నమ్మ నాగేశ్వరరావుని ఆడపిల్లగా అలంకరించి 'నా కూతురు’ అంటూ ఆ ముద్దు తీర్చుకునేవారు. ఓ సారి స్కూల్‌ వార్షికోత్సవంలో 'హరిశ్రంద్ర’ నాటకం వేస్తున్నారు. అందులో చంద్రమతి పాత్ర వేసే కుర్రాడు హఠాత్తుగా హాండ్‌ ఇవ్వడంతో ఆ పాత్ర ఎవరితో వేయించాలా అని ఆలోచిస్తున్న వారికి అక్కినేని గురించి తెలిసింది.

ఆయన సరేననడంతో అతి చిన్నవయసులోనే చంద్రమతి పాత్రతో తొలిసారిగా రంగస్థల ప్రవేశం చేసే అవకాశం ఆయనకి లభించింది. ఆ వేషంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ ప్రశంసలు అక్కినేని అన్నయ్య రామబ్రహ్మంలో కొత్త ఆలోచనలు రేకెత్తించాయి. చదివించడం కన్నా నాటకాల్లో చేరిస్తే రాణిస్తాడన్న అంచనాకు వచ్చి ఆ విషయం తల్లితో చెప్పారు రామబ్రహ్మం. ఆమెకి కూడా అదే మేలనిపించింది. ఐదేళ్ల వయసులో తండ్రి పోవడం, అన్నదమ్ములు వేరుపడటం వంటి పరిణామాల నేపథ్యంలో అక్కినేనికి అండగా నిలిచారు రామబ్రహ్మం. చదువుకోవాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు లేకపోవడంతో  నాటకాల్లోకి వెళ్లక తప్పలేదు  అక్కినేనికి. అందుకే చదువుకోవాలన్న అభిలాషని అణుచుకుని అభినయ కళకు తనని తాను పూర్తిగా అర్పించుకున్నాడు బాల అక్కినేని. అయితే ఒక విద్యార్థి చదువు విషయంలో ఎంతటి శ్రద్దాసక్తులు  కనబరుస్తాడో, అక్కినేని అభినయ అభ్యాసంలో  కూడా అంతే శ్రద్ధ, క్రమశిక్షణ కనబరిచే వారు. అన్న రామబ్రహ్మం కేవలం నాటకాల్లోనే కాకుండా సినిమా ఛాన్సుల కోసం కూడా ప్రయత్నం చేయడంతో 1941లో పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'ధర్మపత్ని’ చిత్రంలో బాలనటునిగా నటించారు అక్కినేని. కుర్రాడు హుషారుగా, చలాకీగా కనిపించడంతో  ఆ సినిమాలో ఆయన విూద రెండు క్లోజప్‌ షాట్స్‌ కూడా తీశారు పుల్లయ్య. ఆ సినిమా విడుదలైన తరువాత మళ్లీ నాటకాలకే అంకితమయ్యారు అక్కినేని.  'హరిశ్చంద్ర’లో చంద్రమతిగా, మాతంగ కన్యగా, ’విప్రనారాయణ’లో దేవదేవిగా, 'జరాసంధ’లో సత్యభామగా, 'తులసీ జలంధర’లో తులసిగా నటించిన అక్కినేని పేరు నానాటికీ సమాజంలో మారుమోగేది. ఆడా.. ఆడు మామూలు తాగుబోతు కాదురోయ్‌. దేవదాసే’... 'ఏంట్రా.. దసరా బుల్లోడులా టిప్‌ టాప్‌గా తయారయ్యావ్‌.

ఎక్కడి కెళ్తున్నావేంటీ?’... ఈ తరహా మాటలు ఎన్నో ఏళ్ల నుంచి తరచూ మన ఇళ్లల్లో వింటూనే ఉంటాం. ఆ మాటల్లోని 'దేవదాసు’, 'దసరా బుల్లోడు’ ఎవరు? ఇంకెవరు మన అక్కినేని నాగేశ్వరరావు! తను సినిమాల్లో పోషించిన పాత్రలకు ఆయన సమకూర్చిపెట్టిన శాశ్వతత్వం అది!! పిరికితనంతో పార్వతిని పొందలేక భగ్న ప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. చిత్రమేమంటే 'దేవదాసు’ పాత్ర అక్కినేనికి ఎంతటి ఘనకీర్తి తెచ్చిందో, ఆ పాత్ర అంతగా ఒక చెడు వ్యసనానికి ప్రతీకగా నిలిచిపోయింది. ఎవరైనా తాగుతున్నారని తెలిస్తే 'ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనీ, ఎవరైనా వీర తాగుబోతు కనిపిస్తే 'ఏంట్రా, మరీ దేవదాసులా ఈ పని?’ అనీ అనడం సర్వ సాధారణమై పోయింది. అక్కినేని ఆ పాత్ర పోషించి ఆరు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ 'దేవదాసు’ ఉపమానం నిలిచే ఉండటం ఆ పాత్ర గొప్పదనం! ఆ పాత్రను పోషించిన అక్కినేని గొప్పదనం!! చదువు పక్కకు వెళ్లినా నాటకరంగంతో మొదలు పెట్టి సినీరంగంలో తనదైన ముద్ర వేశారు.

ఇంకా చదవండి: అక్కినేని దంపతులది ఆదర్శ దాంపత్యం!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# AkkineniNageswaraRao     # Devadas     # Harishchandra    

trending

View More