మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని పురస్కారం
1 month ago | 5 Views
నా గురువు, నా మెంటార్, నా స్ఫూర్తిదాత అమితాబ్ బచ్చన్ అంటూ..ఆయనకు అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. నాకు ఎప్పుడు ఏ మంచి జరిగినా, నాకు ఎప్పుడైనా అవార్డు వచ్చినా ఆయన నుంచే తొలుతగా నాకు శుభాకాంక్షలు వస్తాయని గుర్తుచేసుకున్నారు. కొన్నిసార్లు ఇలా వచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఆయన లాంటి బిగ్ స్టార్ నాకు ఈ అవార్డు ప్రదానం చేయడం ఆనందదాయకం అని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఏఎన్నార్ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల విూదుగా అందుకున్న తర్వాత చిరంజీవి మాట్లాడారు. అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఈ క్రమంలో ఏఎన్నార్, అమితాబ్‌తో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. పద్మ భూషణ్ అవార్డు వచ్చినప్పుడు నన్ను సినిమా పరిశ్రమ సన్మానించింది. ఆ సమయంలో అమితాబ్ నా గురించి 'చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని చెప్పారు. ఆ మాటలు విన్నాక నాలో చిన్న వణుకు కనిపించింది. నా నోట మాట రాలేదు. నా మనసు అమితానందంతో నిండిపోయింది. ఆ రోజు ఆయనకు ధన్యవాదాలు సరిగా చెప్పానో లేదో గుర్తులేదు. అప్పుడు నా పరిస్థితి అలాంటిది. ఇండియన్ సినిమాకి బాద్‌షా, షెహన్ షా, చక్రవర్తి అయిన అమితాబ్ బచ్చన్ నోటి నుంచి ఆ మాటలు రావడం అంటే ఎంత పెద్ద విషయమే కదా. ఆయన మాటలు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాయి. ఆ మాటలు నాకు ఎంతో విలువైనవని చిరంజీవి చెప్పారు. నేను 1990లో హిందీలో తొలి సినిమా (ప్రతిబంధ్) చేసినప్పుడు అమితాబ్‌కు చూపించాను. ఆయన సినిమా చూస్తున్నంతసేపూ చాలా ఆందోళనగా ఉన్నాను. ఆయనకు నచ్చుతుందో లేదో అని అనుకుంటూ ఉన్నా. సినిమా అయ్యాక ఆయన వచ్చి 'శక్తివంతమైన నటన నీది, సమాజానికి అవసరమైన సినిమా ఇది’ అని మెచ్చుకున్నారు. ఆ మాటలు నాకు ఎంతో శక్తినిచ్చాయి. ఆ సమయంలో నేను పిల్లాడిని అయిపోయి ఆయన మాటలకు సంతోషించాను. నా కెరీర్ ప్రారంభం నుంచి ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఆయన 70వ జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లినప్పుడు, మా ఇంట్లో శుభకార్యాలకు వచ్చినప్పుడు ఆయన నాపై ఎంతో ప్రేమ చూపిస్తారని తెలిపారు. 'సైరా’లో నా గురువు పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ను ఎలా సంప్రదించాలా? అని సినిమా టీమ్ ఆలోచిస్తుండగా.. నేను ఆయనకు ఓ మెసేజ్ చేశాను. ఆయన నుంచి రిప్లయ్ రాకపోతే అక్కడితో ఆ ప్రయత్నం ఆపేద్దాం అనుకున్నాను. కానీ ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు. దాంతో నేను సినిమాలో పాత్ర కోసం చెప్పాను. సినిమాలో విూరు నాకు గురువుగా నటించాలి అని కోరాను. దానికి ఆయన 'నేను చేస్తాను’ అని చెప్పారు. విూ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అని అడిగాను. దానికి ఆయన 'నా గురించి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయనక్కర్లేదు. నేను నా గురించి చూసుకుంటాను’ అని చెప్పారు. అదీ ఆయన గొప్పతనం. సినిమా ఆఖరి రోజు 'ఫార్మాలిటీస్’ (పారితోషికం) గురించి మొహమాటపడుతూ అడిగాను. దానికి ఆయన 'ఫార్మాలిటీస్ ఏవిూ అక్కర్లేదు. నువ్వు నా స్నేహితుడివి.
నీ విూద ప్రేమాభిమానాలతో ఈ సినిమా చేస్తున్నాను. నన్ను ఇన్‌సల్ట్ చేయొద్దు’ అని అన్నారు. అది ఆయన నా విూద చూపించే అభిమానం అని 'సైరా’ రోజుల్ని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అమితాబ్ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అందరి ముందు నా మనసు లోతుల్లోంచి చెబుతున్న మాటలు ఇవి. నేను విూకు ఏమి తిరిగి ఇవ్వగలను. విూకు ధన్యవాదాలు చెప్పడం తప్ప. విూకు ఆ దేవుడు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. 'తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. నటుడిగా నేను ఎదుగుతున్న సమయంలో బయట ప్రేక్షకులు, సన్నిహితుల నుంచి ప్రశంసలు వచ్చేవి. అయితే ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న సినిమాలు చూసి పొగుడుతారేమో అని అనుకునేవాణ్ని. మా నాన్నకు నటన అంటే చాలా ఇష్టం. అలాంటి మా నాన్న నన్ను ఎందుకు పొగడరు అనిపించేది. ఓ రోజు ఇంటికి వెళ్లినప్పుడు నా కవర్ పేజీలతో కొన్ని పుస్తకాలు చూస్తున్నారు. నేను వెళ్లేసరికి తీసి పక్కన పడేశారు. 'ఫొటోలు బాగున్నాయిరా’ అని ఓ మాట అంటారేమో అని అనుకున్నాను. కానీ ఆయన అలా అనలేదు. లోపలకు అమ్మ దగ్గరకు వెళ్లి.. 'ఏంటమ్మా నాన్న ఎప్పుడూ నా గురించి ఓ మాట అనరు, బాగుందని కూడా చెప్పరు’ అని అడిగాను. బయట రచ్చ ఎంత గెలిచినా సరే.. ఇంట గెలవడం లేదు అనిపిస్తోంది అని అన్నాను. దానికి అమ్మ 'లేదురా నాన్న చాలా పొగుడుతారు. ఏం చేశాడు నా కొడుకు, అదరగొట్టేశాడు’ అని అంటుంటారు అని చెప్పింది. మరి నా దగ్గర ఆ మాటలు అనొచ్చు కదా అని అమ్మను అంటే 'బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం' అని అమ్మ చెప్పింది అని చిరు తెలిపారు. సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేయబోయారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్ బాక్స్‌లో పడేసి.. నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ఏఎన్నార్ అవార్డును అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. 'నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని. అందుకే ఈ పురస్కారం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను. నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్‌లో స్థానం.. ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. అందుకే నాగార్జునతో ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన అవార్డు అని చెప్పా. ఇదే మాట స్టేజీ విూద చెప్పాలి అనుకున్నాను. ఇప్పుడు చెప్పాను అని చిరంజీవి తన ఆనందాన్ని తెలియజేశారు.
అమ్మను ఇలా ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెట్టడానికి ఓ కారణం ఉంది. ఏఎన్నార్ గారి అభిమానుల్లో సీనియర్ మోస్ట్ ఫ్యాన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది అమ్మే. ఎలాంటి ఫ్యాన్ అనేది తెలియాలంటే.. కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి చెప్పాలి. అమ్మ మొగల్తూరులో గర్భిణిగా ఉంది. నెలలు నిండి ప్రసవానికి సిద్ధమవుతోంది. ఆమె కడుపులో ఉన్న జీవి.. ఈ చిరంజీవి. ఆ సమయంలో నాన్నను అమ్మ ఓ కోరిక కోరింది. 'నాగేశ్వరరావు సినిమా ’రోజులు మారాయి’ రిలీజైంది. నేను వెళ్లి చూడాలి. మళ్లీ తర్వాత అంటే కుదరదు. ప్రసవం అయితే బయటకు పంపరు’ అని అంది. బస్సు వసతులు సరిగ్గా లేకపోవడంతో జట్కా బండి ఏర్పాటు చేశారు నాన్న. బండిలో వెళ్తుండగా.. బస్సుకు దారిచ్చే క్రమంలో తిరగబడింది. మొత్తంగా పొలంలో బండి సహా అమ్మ, నాన్న తిరగబడ్డారు. దీంతో తిరిగి ఇంటికి వెళ్లిపోదాం’ అని నాన్న అంటే.. 'లేదు లేదు నేను సినిమాకు వెళ్లాల్సిందే’ అని పంతం పట్టి సినిమా చూసింది. అంత పిచ్చి అమ్మకు సినిమాలంటే.. అందులోనూ నాగేశ్వరరావు సినిమాలు అంటే మరీ అభిమానం అని చిరు చెప్పారు. నాగేశ్వరరావు అంటే అమ్మకు ఉన్న అభిమానం.. రక్తం ద్వారా నాకు వచ్చిందేమో అనిపిస్తుంటుంది. ఆయన డ్యాన్స్‌లు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాల్లో పాటలు వస్తే చూస్తూ, అనుకరిస్తూ డ్యాన్స్‌లు వేసేవాణ్ని. అలాంటి ఏఎన్నార్‌గారు నా గురించి గొప్పగా మాట్లాడారు. 'నాకు ఎముకలు ఉన్నాయి, కానీ చిరంజీవికి ఎముకలు లేవని ఓసారి అన్నారు. మరో సందర్భంలో 'నేను డ్యాన్సులు వేయడానికి ఆధ్యుణ్ని. ఆ డ్యాన్స్‌లకు స్పీడ్, గ్రేస్ పెంచింది చిరంజీవే. హీరోయిన్లతో చిరు డ్యాన్స్ వేస్తుంటే నేను ఆయన్నే చూస్తాను’ అని ఏఎన్నార్ చెప్పారు. అంతలా నన్ను ఆయన అభిమానించేవారు‘ అని ఏఎన్నార్‌ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. మేం చెన్నై నుంచి షూటింగ్‌కి వచ్చినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఆయన ప్రత్యేకంగా వచ్చి కలిసేవారు. విూ లాంటి యువ నటులు మద్రాసు నుంచి ఇక్కడకు వచ్చేయాలి. అప్పుడే పరిశ్రమ నిజంగా ఆంధ్రప్రదేశ్ బదిలీ అయింది అనిపిస్తుంది అని ప్రోత్సహిస్తుండేవారు. అప్పుడు ఆయన చేసిన కృషి ఫలితాన్నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం.'కాలేజీ బుల్లోడు’ వంద రోజుల ఫంక్షన్‌కు నన్ను పిలిచారు. ఆయన వెనుక సీట్‌లో నేను కూర్చుని ఉన్నా. ప్రేక్షకులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతున్నారు. చాలాసేపు అయినా ఆ ఉత్సాహం ఆగలేదు. దాంతో ఆయన నావైపు తిరిగి 'ఆ కేరింతలు నీ కోసమే.. లేవు పైకి ప్రేక్షకుల్ని పలకరించు’ అని అన్నారు.'వద్దలెండి సర్’ అని నేనంటే..'ఏంటయ్యా మొహమాటం పడతావ్.. విూరు ముందుండాలి.. రా ముందుకు రా’ అని నాతో అభివాదం చేయించారు. మామూలుగా అయితే అలాంటి సమయంలో సీనియర్ నటులు ఎవరైనా ప్రశంసల్ని ఇంకొకరికి షేర్ చేయడం కాస్త సంశయిస్తారు. కానీ ఆయన నన్ను ప్రోత్సహించారు. అదీ ఆయన గొప్ప మనసు‘ అని చిరంజీవి ఏఎన్నార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 'మెకానిక్ అల్లుడు’లో కలసి నటించినప్పుడు ఆయన నుంచి ఎన్నో మంచి విషయాలు, ఎలా నడుచుకోవాలి అనే విషయాలను నేర్చుకున్నా.
ఆ సినిమాకు నాకో గొప్ప అనుభూతి. ఆ సమయంలో ఆయన్ను చూస్తే నడిచి వచ్చే ఎన్‌సైక్లోపీడియా అని అనిపించేది. ఆయనతో మాట్లాడినప్పుడు ఎంతో సరదాగా కలిసిపోయేవారు. విదేశాలకు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆయన కోసం చిన్నపాటి గిప్ట్‌లు తెచ్చేవాణ్ని. నేను రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా ఆయనతో మాట్లాడేవాణ్ని. పరిశ్రమల గురించి, రాజకీయ పరిస్థితుల గురించి ఆయనతో చర్చించేవాడిని. ఆయనంటే నాకు పితృసమానులు. ఈ విషయం నేను బయట ఎక్కడా చెప్పే అవకాశం రాలేదు. ఇప్పుడు ఇక్కడ చెబుతున్నా. ఆ అభిమానం.. ఆ తర్వాత నాగార్జున విూద చూపిస్తున్నాను. నా గురించి, నా ఆరోగ్యం గురించి నాగార్జునతో అంతే అభిమానంగా చర్చిస్తూ ఉంటా. నాగార్జున నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్ కూడా. నేను ఇప్పటికీ యంగ్‌గా, సరదాగా ఉన్నానంటే కారణం నాగార్జున కూడా. ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ సలహాలు ఇస్తూ ఉంటారు. అందుకే నేను కూడా గుడ్డిగా ఫాలో అయిపోతుంటాను. ఆ భగవంతుడు నాకిచ్చిన అద్భుతమైన స్నేహితుడు నాగార్జున. అఖిల్ నన్ను పెదనాన్న అని పిలుస్తుంటాడు. ఆ మాట వింటుంటే పుత్రవాత్సల్యం అనిపిస్తోంది. వాడు నాకు మరో బిడ్డ లాంటివాడు. అక్కినేని కుటుంబం మొత్తం మా కుటుంబ సభ్యుల్లాంటివారే. మా కుటుంబం పట్ల అక్కినేని కుటుంబం చూపించే ప్రేమకు నేను దాసుడిని.
ఆ ప్రేమను నా జీవితాంతం పదిలపరుచుకుంటా. నాగ్ లాంటి స్నేహితుణ్ని నా మనసులో పదిలం చేసుకుంటాను‘ అని చిరంజీవి అన్నారు. అక్కినేని పురస్కారం నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, హేమ మాలిని, కె.బాలచందర్ లాంటి గొప్పవాళ్లకు ఇచ్చిన పురస్కారం నాకు దక్కడం నా పూర్వ జన్మ సుకృతం. ఈ అవార్డు రావడం నా సినీ జీవితానికి పరిపూర్ణత ఇచ్చింది అని చెప్పాలి. నా జీవితాంతం ఈ అనుభూతిని మనసులో పెట్టుకుంటాను‘ అని చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని నాకు ఇవ్వడం సముచితం అని భావించి నాకు ఇచ్చిన ఏఎన్నార్ అవార్డు కమిటీకి, ఛైర్మన్ సుబ్బరామిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను‘ అని చిరంజీవి ప్రసంగం ముగించారు.
ఇంకా చదవండి: సినిమాకి భాషా సరిహద్దులు ఉండవు.. ‘ఫౌజా’ ప్రత్యేక ప్రదర్శనలో హీరో కార్తీక్ దమ్ము
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !