
ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన సినిమా "ఛావా"
1 month ago | 5 Views
మిత్రులు ఎలా ఉంటారంటే... సనమ్ తేరి కసమ్ గురించి రాయడం కాదు. దమ్ము ఉంటే ఛావా గురించి రాయమని నా మెసెంజర్ లో సొద పెడుతున్నారు! వారందరి కోసమే రాత్రి సత్వ మాల్ లో ఛావా చూశాను! మా అబ్బాయి సుహాన్ అన్నాడు క్లైమాక్స్ లో! చూడలేనంత క్రూయాలిటీ గా తీశారు అని! నేను అన్నాను... నయం చూడటానికి ఇబ్బంది లేకుండా తీయడంలో డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ అద్భుత ప్రతిభ చూపించాడని! ఔరంగజేబు ఇంకా అంతకన్నా దారుణంగా శంభాజీని హింసించాడని చరిత్ర చెబుతోంది! కొందరి చరిత్రలు జనానికి తెలియకుండానే కాలగర్భంలో కలసిపోతాయి! ఛత్రపతి శివాజీ కి వచ్చిన పేరు గుర్తింపు శంభాజీకి రాలేదు! ఎందుకంటే అంతే! తండ్రి కి వచ్చిన పేరు చాటున మహా యోధుడు శంభాజీ కొట్టుకుపోయాడు!
శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ఒదిగిపోయాడు! పరకాయ ప్రవేశం చేసినట్లు కుదిరిపోయాడు! ఇంకొకరిని శంభాజీ గా ఊహించలేం! ఆ పాత్ర కోసం నాలుగు నెలలు గుర్రపు స్వారీ, కత్తి సాము, ఈటెల సాము, విలు విద్య నేర్చుకున్నాడు! 13 నెలల పాటు ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 9 గంటలకు పడుకోవడం, వంద కిలోల బరువు పెరగడానికి రోజుకు 8 సార్లు భోజనం చేయడం, యోధుడి శరీరాకృతి కోసం కసరత్తు... ఇంతలా కష్టపడితే సినిమా అంత అద్భుతంగా తయారైంది! ఎలాంటి లుక్ టెస్ట్ కూడా లేకుండా ఆ పాత్రకు విక్కీ కౌశల్ ను ఎంపిక చేసుకున్నట్లు డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ సక్సెస్ మీట్ లో తెలిపారు. తాను చూసిన నటుల్లో ద బెస్ట్ జెమ్ విక్కీ అని రష్మిక కాంప్లిమెంట్ ఇచ్చింది!
మొదట ఔరంగజేబు పాత్రకు అనిల్ కపూర్ ను అడిగితే ఆయన తటపటాయించారట! ఇక సెకండ్ ఛాయిస్ గా అక్షయ్ ఖన్నా ను ఎంపిక చేసుకున్నారు! అతను ఔరంగజేబు పాత్రలో జీవించాడు! సంభాషణలు పలకకుండానే కళ్ళతో క్రూరత్వం చూపించాడు! ఇక శంభాజీ భార్య యేసుబాయి భోంసాలె పాత్రలో రష్మిక మందాన్న, హంబీరావు గా అశుతోష్ రాణా, ఔరంగజేబు కుమార్తె జనాత్ బేగం గా డయానా పెంటి అందరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయి నటించారు! అందుకే ప్రేక్షకులు కూడా అలా స్క్రీన్ కు కనెక్ట్ అయిపోయి, క్లైమాక్స్ లో శంభాజీని హింసిస్తున్నప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు! జై భవానీ, జై జగదాంబ, హరహర మహాదేవ నినాదాలు మార్మోగుతున్నాయి థియేటర్ అంతా!
ఛావా ఒక గొప్ప యాక్షన్ ప్యాక్డ్ హిస్టారికల్ మూవీ! మరాఠా నాయకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఈ సినిమా. ఛావా అంటే లయన్ కబ్! శివాజీ సావంత్ పరిశోధన చేసి రచించిన చారిత్రత్మాక నవల ఛావా ఆధారంగా ఈ సినిమాను దినేష్ విజన్ నిర్మించారు. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ప్లస్ అనే చెప్పాలి. అజయ్ దేవగన్ తన స్వరంతో కథ చెప్పడం శుభారంభం! 130 కోట్ల బడ్జెట్, రాయ ఘడ్ లో భారీ సెట్టింగ్, అడవిలో యుద్ధాలు, సంగమేశ్వర్, బుర్హన్ పూర్ లో కత్తి యుద్ధాలు, ఈటెల యుద్ధాలు, నీటిలో బాణాలతో పోరాటాలు వెరసి గొప్ప చరిత్రను కళ్ళముందుంచారు! సింహంతో విక్కీ చేసిన పోరాట విన్యాసం నిజంగానే ఒళ్ళు గగుర్పొడిచింది!
ఔరంగజేబు తన బలమైన శత్రువుగా భావించే ఛత్రపతి శివాజీ మరణ వార్త తెలుసుకుని ఇక మరాఠా తన వశమైనట్లు అంచనా వేసి పండగ చేసుకుంటారు! కానీ, శివాజీ వారసుడు యోధుడు శంభాజీ బుర్హన్ పూర్ పై దాడి చేసి మొఘలుల ఖజానా స్వాధీనం చేసుకుంటాడు! మొఘల్ యువరాజు మీర్జా అక్బర్ అదే సమయంలో ఔరంగజేబు పై తిరుగు బాటు, శంభాజీ మారు తల్లి సోయరాబాయి తన కుమారుడు రాజారామ్ ను మహారాజు ను చేయాలని కుట్ర పన్నడం, మరాఠా ఆస్థానంలో కుట్రలను భార్య యేసుబాయి ద్వారా తెలుసుకుని దేశద్రోహులను ఏనుగుతో తొక్కించి చంపడం, మరో వైపు శంభాజీ ఓటమి చూసేంత వరకు కిరీటం ధరించనని ఔరంగజేబు శపథం చేయడం, మీర్జా అక్బర్ ను బంధించాలని ఔరంగజేబు కుమార్తె జినాత్ తన సైన్యంతో ప్రయత్నిస్తే, ఆ దాడిని మరాఠాలు తిప్పి కొట్టడం, మరింత కసితో మరాఠా నేతలు శాంతాజీ, ధనాజీలను తమ వైపు తిప్పుకుని కుట్ర పన్నడం, చివరకు సంగమేశ్వర్ లో ఉన్న శంభాజిని దొంగ దెబ్బతో బంధించడం! నిజంగా ఈ సన్నివేశం చూడాలి! వందల మంది చుట్టూముట్టిన ఒక్కడిగా శంభాజీ చేసిన యుద్ధ పోరాటం... ఇక్కడే దర్శకుడు లక్ష్మణ్ మళ్ళీ నచ్చేస్తాడు! అక్కడ వందల మంది సైనికులు వున్నా కళ్ళకు స్క్రీన్ అంతా శంభాజీ మాత్రమే కనిపిస్తాడు!
అక్కడ నుంచి ఔరంగజేబు విడిది ఉన్న ప్రదేశానికి శంభాజీని తీసుకొచ్చి బంధిస్తారు! లొంగిపోయి, ఇస్లాం స్వీకరిస్తే క్షమాబిక్ష పెడతానని ఔరంగజేబు ప్రకటిస్తాడు! సమస్య లేదు, స్వరాజ్ పోరాటం మరాఠా ధీరత్వం అంటూ ససేమిరా అంగీకరించడు శంభాజీ! గోళ్లు పీకేయడం, ఒళ్ళంతా కొరడా దెబ్బలు, ఆ దెబ్బలపై ఉప్పు రాయించడం, కళ్ళు పీకేయడం, నాలుక కోసేయడం... ఇలా వరస క్రూర హింసలు చేస్తున్నా చలించకుండా అదే ధీరత్వంతో రాజీపడని మరాఠా యోధత్వం, ధిక్కారం వీరత్వం శంభాజీ చూపించి కనుమూస్తాడు! ఇదీ ఛావా! గొప్ప యోధుడి చరిత్ర సినిమా గా ఎంపిక చేసుకోవడమే గొప్ప సక్సెస్! అందుకే బాక్స్ ఆఫీస్ లో దూసుకెళుతోంది! వసూళ్లలో ఈ ఐదు రోజుల్లోనే 200 కోట్లు క్రాస్ చేసింది! శంభాజీ పాత్ర ను పోషించిన విక్కీ కౌశల్ ను మరాఠాలు గుండెల్లో పెట్టుకుంటారు! విక్కీ సినిమా చరిత్రలో ఇదొక గొప్ప రికార్డు! నేషనల్ అవార్డు గ్యారంటీ!
ఇంకా చదవండి: త్వరలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న "దీక్ష" మూవీ
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!