స్టార్‌ హీరో మూవీల సందడి..దసరాతో టీజర్లు, పోస్టర్ల విడుదల

స్టార్‌ హీరో మూవీల సందడి..దసరాతో టీజర్లు, పోస్టర్ల విడుదల

2 months ago | 5 Views

దసరా సందర్భంగా పలు సినిమాల టీజర్‌లు విడుదలయ్యాయి. ఇందులో మెగాస్టార్  'విశ్వంభర' ముందుంటుంది. విర్రవీగుతున్న అరాచకానికి ముగింపు పలికే మహాయుద్ధం ఏ రూపంలో వచ్చిందో తెలియాలంటే 'విశ్వంభర’ చూడాల్సిందే. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలు. కునాల్‌ కపూర్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వశిష్ఠ దర్శకుడు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. విక్రమ్‌ రెడ్డి సమర్పకులు. ఈ సినిమా టీజర్‌ని దసరా సందర్భంగా విడుదల చేశారు. 'విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు. ప్రశ్నలు పుట్టించిన కాలమే సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది’ అంటూ మొదలయ్యే టీజర్‌లో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశారు. సోషియో ఫాంటసీ కథతో రూపొందుతున్న చిత్రమిది. అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలని,  రామ్‌చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌’ కోసం వాయిదా వేశారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన 'గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ముందుగా ఈ సినిమాని క్రిస్మస్‌కు విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. కానీ పంపిణీదారుల కోరిక మేరకు సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్టు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ''మూడేళ్లుగా నిర్మాణంలో ఉన్న భారీ బ్జడెట్‌ చిత్రమిది. అంచనాలున్న ఇలాంటి సినిమాలు క్రిస్మస్‌ కంటే సంక్రాంతికి వస్తేనే బాగుంటుందని నాతో సహా పంపిణీదారులంతా భావించాం. ఇదే విషయాన్ని కథానాయకుడు చిరంజీవితోనూ, యు.వి.క్రియేషన్స్‌ నిర్మాతలు వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌తోనూ పంచుకున్నాం. వాళ్లు సానుకూలంగా స్పందించి, సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న 'విశ్వంభర’ని వాయిదా వేశారు. 'గేమ్‌ ఛేంజర్‌’ కోసం వాళ్లు తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు‘ అన్నారు. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'గేమ్‌ ఛేంజర్‌’ వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటించారు. 


ఇకపోతే బాలకృష్ణ 109వ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  బాబీ కొల్లి దర్శకత్వంలో... సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా పేరుతోపాటు, టీజర్‌ని దీపావళికి విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. దసరా సందర్బంగా ఓ పోస్టర్‌ని విడుదల  చేశారు. అందులో బాలకృష్ణ గుర్రంపై స్వారీ చేస్తూ, రాజసంతో కనిపించారు. బాలకృష్ణ శైలి మాస్‌, యాక్షన్‌ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ- బోయపాటి శ్రీను మరోసారి చేతులు కలుపుతున్నారు. విజయవంతమైన ఈ కలయికలో నాలుగో చిత్రం ఈ నెల 16న ప్రారంభం కానుంది. 'సింహా’, 'లెజెండ్‌’, 'అఖండ’ తర్వాత రూపొందుతున్న ఈ సినిమాని 14 రీల్స్‌ ప్లస్‌, ఎమ్‌.తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఇకపోతే పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు’ పనులు చకచకా సాగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పున్ణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ నిక్‌ పావెల్‌ నేతృత్వంలో భారీ యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఈ నెల 14 నుంచి మరో షెడ్యూల్‌ ఆరంభం కానుంది. ఈ సినిమా కోసం పవన్‌కల్యాణ్‌ ఓ పాట పాడారు. ఆ పాటని త్వరలోనే విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. దసరా సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. నవంబరు 10 నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకోనున్న ఈ  సినిమాలో పవన్‌కల్యాణ్‌ సరసన నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.దయాకర్‌ రావు నిర్మాత. ఎ.ఎం.రత్నం సమర్పకులు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలోని తొలి భాగం మార్చి 28న తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఇకపోతే విజయవంతమైన 'దసరా’ తర్వాత ఆ కలయికలో మరో చిత్రం  మొదలైంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాని ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. 'దసరా’ సినిమాలోనే నానిని మాస్‌ అవతారంలో చూపించిన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల, ఈసారి మరో కొత్త రకమైన పాత్రని తీర్చిదిద్దారని, వీరోచితంగా కనిపించే ఆ పాత్ర కోసం నాని ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారని సినీ వర్గాలు తెలిపాయి. నాని కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా, 'దసరా’ చిత్రం కంటే వంద రెట్లు అధికంగా ప్రభావం చూపిస్తుందని చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. కథానాయకుడు రామ్‌ పోతినేని 22వ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కనుంది. దసరా సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ.'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ ఫేమ్‌ మహేశ్‌బాబు పచ్చిగొల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ''రామ్‌ కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచే చిత్రమిది. ఈమధ్య కాలంలో యాక్షన్‌ ప్రధానమైన సినిమాల్లో ఎక్కువగా నటించిన రామ్‌ ఇందులో ఓ విభిన్నమైన పాత్రలో సందడి చేస్తారు. సున్నితంగా హృదయాల్ని స్పృశించే అంశాలు, భావోద్వేగాలున్న ఈ కథని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తామ''ని సినీ వర్గాలు తెలిపాయి. 'డీజే టిల్లు’, 'టిల్లు స్క్వేర్‌’ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. 'కోహినూర్‌’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవికాంత్‌ పేరేపు దర్శకుడు. ఇదివరకు ఆయన... సిద్ధుతో కలిసి 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’ తెరకెక్కించారు. ఈసారి కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే అంశం ఆధారంగా సోషియో ఫాంటసీ కథతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అమర్‌దీప్‌, లిషి గణేష్ కల్లపు జంటగా సాయివర్మ దాట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'నా నిరీక్షణ’. చైతన్యవర్మ, రమ్య ప్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి.సంతోష్‌ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం విజయ దశమి రోజున హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, రాజా రవీంద్ర స్క్రిప్ట్‌ అందజేశారు. నిర్మాత గణపతి రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. నిర్మాత సురేశ్‌బాబు, నటుడు రాజా రవీంద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ రెండు జంటల చుట్టూ సాగే కథ ఇది. తప్పకుండా ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని పంచుతామన్నారు. పాత, కొత్తతరం నటుల మేళవింపుతో సీనియర్‌ దర్శకుడు పి.సునీల్‌కుమార్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'కాక్రోచ్‌’. విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథతో దీన్ని రూపొందిస్తున్నారు. విజయదశమి సందర్భంగా సినిమా పేరుని, ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ కథాంశం విభిన్నంగా ఉంటుందని, ఈ కథకి 'కాక్రోచ్‌’ అనే పేరు ఎందుకు పెట్టామన్నది తెరపైనే చూడాలన్నారు దర్శకుడు సునీల్‌కుమార్‌ రెడ్డి.

ఇంకా చదవండి: పాన్ ఇండియా ఫిల్మ్ 'నాగబంధం', అక్టోబర్ 23 నుంచి షూటింగ్‌ మొదలు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Gamechanger     # Ramcharan     # Kiaraadvani    

trending

View More