ఘనంగా 'మ్యాడ్ స్క్వేర్' ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా 'మ్యాడ్ స్క్వేర్' ప్రీ రిలీజ్ వేడుక

4 days ago | 5 Views

బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన 'మ్యాడ్ స్క్వేర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ వేసవికి వినోదాల విందుని అందించడానికి 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం మార్చి 28న థియేటర్లలో అడుగుపెడుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకొని.. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగించాయి. బుధవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా నిర్వహించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు మారుతి, వెంకీ అట్లూరితో పాటు చిత్ర బృందం పాల్గొంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ, "మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూశాను. అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. నేను మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ, ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్ గా ఉన్నప్పుడు మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. ఫ్రెండ్ షిప్ ని స్ట్రాంగ్ చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాయి. మ్యాడ్ లాంటి సినిమాలు రావడం సంతోషంగా ఉంది. మ్యాడ్ సినిమాతో ఈ ముగ్గురు హీరోలు స్టార్స్ అయిపోయారు. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా వీళ్ళ పేర్లను గుర్తు పెట్టుకుంటారు. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. నార్నె నితిన్, రామ్, సంగీత్ లో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు. ఒక స్టోరీ డిస్కషన్ లో దర్శకుడు కళ్యాణ్ తో కూర్చున్నప్పుడు ఆయన నేరేషన్ కే పడిపడి నవ్వాను. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించగలను. నా ఫేవరెట్ డీఓపీ శామ్‌దత్ గారు ఈ సినిమాకి పనిచేశారు. నిర్మాతగా హారిక మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నాది, నాగవంశీ జర్నీ ప్రేమమ్ తో మొదలైంది. తన ధైర్యమే నాగవంశీని ఇంతదూరం తీసుకొచ్చింది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. అలాగే నిర్మాత చినబాబు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. మ్యాడ్ స్క్వేర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మ్యాడ్ 2 మాత్రమే కాదు, మ్యాడ్ 100 కూడా రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.


దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, "నేను మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చాను. ఆ సమయంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ పేర్లు అప్పుడప్పుడే తెలుస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఈ ముగ్గురు ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ముగ్గురు కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి నేను పగలబడినవ్వాను. హారిక మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు రెండో సినిమాతో ఇంకా పెద్ద హిట్ అందుకుంటారనే నమ్మకం ఉంది. భీమ్స్ గారు స్వరపరిచిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. మ్యాడ్ స్క్వేర్ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ, "సమ్మర్ లో మ్యాడ్. సరైన సమయంలో సరైన సినిమాని తీసుకురావడం అంటే ఇదేనేమో. మ్యాడ్ చూసినప్పుడు.. కొత్త డైరెక్టర్ చాలా బాగా చేశాడు, మంచి టైమింగ్ ఉంది అనుకున్నాను. కళ్యాణ్ లాంటి డైరెక్టర్స్ రావాలి. ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలి. చిన్న సినిమాలు క్వాలిటీ సినిమాలు మిస్ అవుతున్నాం. అలాంటి సమయంలో ఒక చిన్న సినిమాని ఇంత క్వాలిటీగా తీస్తున్న నాగవంశీకి ముందుగా కంగ్రాట్స్ చెప్పాలి. నా సినిమాతోనే సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ మొదలైంది. ఈ బ్యానర్ లో పనిచేయాలని అందరూ అనుకునే స్థాయికి సితార ఎదిగినందుకు నాకు సంతోషంగా ఉంది. చినబాబు గారి బ్లెస్సింగ్స్ తో నాగవంశీ మంచి మంచి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ వేసవిలో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని ఈ సినిమా అందిస్తుందని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.

నిర్మాత హారిక సూర్యదేవర మాట్లాడుతూ, "మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీడియాకి, ఈ ఈవెంట్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. మా వేడుకకు నాగచైతన్య గారు, మారుతి గారు, వెంకీ అట్లూరి గారు అతిథులుగా రావడం సంతోషంగా ఉంది. ఒక కామెడీ సీన్ తీసి నవ్వించడం కష్టం. అలాంటిది మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు రెండు కామెడీ సినిమా తీసి ఫ్రాంచైజ్ రన్ చేసున్నారంటే గ్రేట్. డీఓపీ శామ్‌దత్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ నవీన్ నూలి గారు తన ఎక్సపీరియన్స్ తో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండేలా సినిమాని మలిచారు. భీమ్స్ సిసిరోలియో గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఆయన సంగీతం వల్లే మ్యాడ్ స్క్వేర్ పై ఈ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. నార్నె నితిన్ లో మంచి ప్రతిభ ఉంది. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారు. మొదటి భాగంతో ప్రేక్షకుల ప్రేమను గెలుచుకున్న సంగీత్ శోభన్, రెండో భాగంతో కూడా పొందుతాడు. రామ్ నితిన్ సినిమాకి పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తాడు. నేపథ్య సంగీతం అందించిన తమన్ ప్రత్యేక కృతఙ్ఞతలు. నన్ను సపోర్ట్ చేసిన మా నాన్నగారు చినబాబు గారికి, మా అన్నయ్య నాగవంశీ గారికి ధన్యవాదాలు. మా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్." అన్నారు.

కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ, " ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన నాగచైతన్య గారికి థాంక్స్. ఏడాదిన్నర క్రితం మేము మ్యాడ్ సినిమాతో వచ్చాము. అప్పుడు మా పేర్లు కూడా ఎవరికీ సరిగా తెలియదు. అయినా మా సినిమాని పెద్ద హిట్ చేశారు. మా దేవుళ్ళు ప్రేక్షకులే. ఇప్పుడు మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నాం. మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి సినిమా అంటే చాలా పిచ్చి ఉంది. అందుకే దానిని మ్యాడ్ అనే సినిమా టైటిల్ తో చూపిస్తున్నారు. నన్ను నమ్మి, నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి, చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి ధన్యవాదాలు. డీఓపీ శామ్‌దత్ గారు మమ్మల్ని అందంగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్." అన్నారు.

కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, "నాగచైతన్య గారు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు. ఆయన ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు మా టీజర్ చూసి ఎంజాయ్ చేయడంతో మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. థాంక్యూ సో మచ్ తారక్ అన్న. ఈ వేడుకకు హాజరైన వెంకీ అట్లూరి గారికి, మారుతి గారికి థాంక్స్. చినబాబు గారు, నాగవంశీ గారు, హారిక గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు మిక్సింగ్ పనులుండి రాలేకపోయారు. సక్సెస్ మీట్ కి వస్తారు. మాతో పాటు విడుదలవుతున్న నితిన్ గారి 'రాబిన్ హుడ్' కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అన్నారు.

కథానాయకుడు రామ్ నితిన్ మాట్లాడుతూ, "ముందుగా ముఖ్య అతిథిగా వచ్చిన నాగచైతన్య గారికి, అలాగే మారుతి గారికి, వెంకీ అట్లూరి గారికి థాంక్స్. సినిమా మీద నాకున్న ప్రేమ, అభిమానం, గౌరవం నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చాయి. అలాంటి సినిమాని నాకు పరిచయం మా అమ్మకి, సినిమాల్లోకి వస్తానంటే నన్ను ప్రోత్సహించిన నాన్నకి, అలాగే నన్ను సపోర్ట్ చేసిన మా మావయ్యకి రుణపడి ఉన్నాను. నిహారిక గారు నిర్మించిన 'హలో వరల్డ్' అనే సిరీస్ చూసి, నన్ను నమ్మి 'మ్యాడ్'లో మనోజ్ పాత్ర చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను గైడ్ చేసిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను, ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. " అన్నారు. 

నటి రెబా మోనికా జాన్‌, "స్వాతి రెడ్డి పాట ద్వారా ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. పాటకు మంచి ఆదరణ లభించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.

నటుడు విష్ణు ఓఐ మాట్లాడుతూ, "ఈ సినిమాని నిర్మించి, దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి, మాకు బ్యాక్ బోన్ గా నిలిచిన నిర్మాతలు నాగవంశీ గారికి, హారిక గారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా షూటింగ్ ఎంతో సరదాగా జరిగింది. మార్చి 28న థియేటర్లలో మ్యాడ్ స్క్వేర్ చూడండి.. మీ అందరికీ నచ్చుతుంది." అన్నారు.

ఇంకా చదవండి: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ - అద్భుతమైన ఫస్ట్ లుక్ విడుదల

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# మ్యాడ్ స్క్వేర్     # నార్నె నితిన్     # సంగీత్ శోభన్    

trending

View More