'థగ్‌లైఫ్'లోకి నాజర్, అభిరామి!
4 months ago | 42 Views
కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తోన్న చిత్రం ’థగ్ లైఫ్’. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఇందులో బడా స్టార్స్ నటిస్తుండగా.. తాజాగా మరో ఇద్దరూ నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. సీనియర్ నటుడు నాజర్, అభిరామి ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థలు రాజ్‌కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు పోస్టర్లు షేర్ చేశాయి. కమల్‌హాసన్ చిత్రంలో మరోసారి భాగం కావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని అభిరామి తెలిపారు. 2004లో ఆమె కమల్ హాసన్ సినిమా ’విరుమండీ’లో నటించారు. మళ్లీ 20 ఏళ్లకు ఆయన చిత్రంలో అవకాశం రావడం.. అదీ మణిరత్నం దర్శకత్వంలో చేస్తుండడం కలలా ఉందన్నారు.
నిర్మాణ సంస్థ పోస్ట్‌ను రీ షేర్ చేసిన అభిరామి ’కలలు కనడం ఎప్పటికీ ఆపకండి.. ఎందుకంటే ఏదో ఒకరోజు అవి నిజమవుతాయి’ అని రాసుకొచ్చారు.ప్రస్తుతం ఆమె నాని హీరోగా తెరకెక్కుతోన్న ’సరిపోదా శనివారం’లోనూ నటిస్తోంది. థగ్‌లైఫ్ కథ విషయానికొస్తే.. సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ’నాయకన్’ లాంటి హిట్ తర్వాత కమల్‌హాసన్ ` మణిరత్నం కాంబోలో 36 ఏళ్లకు వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇందులో త్రిష కథానాయిక. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠీ, శింబు మలయాళ నటుడు జోజు జార్జ్, హీరో గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మీ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ఎ.ఆర్.రెహమాన్ స్వరకర్త.
ఇంకా చదవండి: అక్షయ్ కుమార్ ..'ఖేల్‌ఖేల్‌మే..'
# ThugLife # KamalHaasan # ManiRatnam