'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి'.. ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేక పోయిన క్రికెట్‌ నేపథ్యం!

'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి'.. ప్రేక్షకులకు కనెక్ట్‌ కాలేక పోయిన క్రికెట్‌ నేపథ్యం!

25 days ago | 15 Views

స్సోర్ట్స్‌ డ్రామాలకి పెట్టింది పేరు బాలీవుడ్‌. హాకీ మొదలుకుని కుస్తీ వరకూ పలు రకాల క్రీడల్ని స్పృశిస్తూ సినిమాలు రూపొందుతుంటాయి. ఈ మధ్యే అజయ్‌ దేవగణ్‌ 'మైదాన్‌’ వచ్చింది. ఇప్పుడు క్రికెట్‌ నేపథ్యంలో 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. రాజ్‌ కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించడం.. అగ్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌ నుంచి వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మహేంద్ర (రాజ్‌ కుమార్‌ రావ్‌) ఓ ఫెయిల్యూర్‌ క్రికెటర్‌.  మరో ఏడాది అవకాశమిస్తే  తానేంటో నిరూపించుకుంటానని బతిమాలతాడు. అయినా తండ్రి వినిపించుకోకుండా తన స్పోర్ట్స్‌ షాప్‌ నిర్వహణ బాధ్యతల్ని అప్పగిస్తాడు.

మహిమ అగర్వాల్‌ (జాన్వీ కపూర్‌)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. తన ఫెయిల్యూర్‌ స్టోరీ చెప్పినప్పటికీ మహేంద్ర మనసు నచ్చి పెళ్లి చేసుకోవడానికి అంగీకారం తెలుపుతుంది మహిమ. వైద్యురాలైన ఆమెకీ క్రికెట్‌ అంటే పిచ్చి. అలా ఆ ఇద్దరి క్రికెట్‌ ప్రేమ వాళ్లని ఎక్కడిదాకా  తీసుకెళ్లింది?విజయవంతమైన  క్రికెటర్‌ కావాలనుకున్న మహేంద్ర కలలు ఎలా నెరవేరాయనేది మిగతా కథ. క్రీడా నేపథ్యంలో సాగే కథలన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఫెయిల్యూర్స్‌తో అప్పటివరకూ అండర్‌డాగ్‌లా కనిపించిన హీరో... చివరికొచ్చేసరికి విజేతగా నిలిచి తన కలని నెరవేర్చుకుంటాడు. ఆ మధ్యలో నడిచే డ్రామా ఎంత వైవిధ్యంగా, ఎంత ఆసక్తికరంగా ఉందన్నదే సినిమా ఫలితాన్ని నిర్దేశిస్తురది. హీరోకి కోచ్‌ కావాలనే కోరిక కలగడం, హీరోయిన్‌ బ్యాట్‌ పట్టడంతోనే ఈ కథ ప్రయాణమేమిటో ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. మధ్యలో డ్రామా కోసమని మైదానం నుంచి బయటికొచ్చి, భార్యాభర్తల మధ్య ఐడెంటిటీ గొడవని సృష్టించినా అదేమంత రక్తికట్టదు. మహిమ ఇంకా పూర్తిస్థాయి క్రికెటర్‌ కాకముందే, హీరో మహేంద్ర తన గుర్తింపు కోసం పాకులాట మొదలుపెట్టే సన్నివేశాలు కథకి అతకలేదు.

చెప్పాల్సిన కథేవిూ లేక ఇలా మరో దారిని ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల నేపథ్యం, పెళ్లి ప్రయాణం వరకూ సినిమా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథ  సాదాసీదాగా మారిపోయింది. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడికి ఊహకు తగ్గట్టుగా సాగుతుంటుంది. ద్వితీయార్ధంలో అయితే హీరోకీ, ఆయన తల్లికీ మధ్య సాగే సన్నివేశాల్లో తప్ప ఎక్కడా మెరుపులు కనిపించవు. కథ, కథనాల కంటే జాన్వీకపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ జోడీ నటనే సినిమాని కొంతవరకు నిలబెట్టింది. సినిమాల్లో  క్రికెట్‌ మ్యాచ్‌ని చూపిస్తున్నప్పుడు, ప్రేక్షకుడు  నిజంగానే ఓ ఉత్కంఠ భరితమైన మ్యాచ్‌ని చూస్తున్న అనుభూతి కలిగేలా సన్నివేశాల్ని మలుస్తుంటారు దర్శకులు. కానీ, ఇందులో ఆ తరహా జాగ్రత్తలూ తీసుకోలేదు. హీరోయిన్‌ వెళ్లి వరుసగా  సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ని గెలిపించేస్తుంది. రచనలోనే చాలా లోపాలు కనిపిస్తాయి.  సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్‌ గోస్వామి  కెమెరా పనితనం మెప్పిస్తుంది. పాటలు బాగున్నాయి. జాన్‌ స్టీవార్డ్‌ ఏడూరి నేపథ్య సంగీతం సినిమాపై ప్రభావం చూపించింది.

ఇంకా చదవండి: టొబాకో యాడ్‌లో నటించేందుకు 'పుష్ప' నిరాకరణ.. పదికోట్లు ఇస్తామని చెప్పినా నో చెప్పిన బన్నీ

# Mrandmrsmahi     # Rajkumarrao     # Janhvikapoor