''కల్కి 2898 ఏడి'కి  గతంలో ఏ సినిమాకు రానంత క్యూరియాసిటీ!

''కల్కి 2898 ఏడి'కి గతంలో ఏ సినిమాకు రానంత క్యూరియాసిటీ!

3 days ago | 13 Views

ప్రభాస్‌, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌ లో వస్తున్న'కల్కి 2898 ఏడి’ నేటి ఉదయం విడుదల కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రియులు అందరూ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే అనేక సంచలనాలు నమోదు చేస్తోంది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ లను మించి ఈ మూవీకి పబ్లిసిటీ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్‌ తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకోనే, దిశా పటాని లాంటి దిగ్గజ నటీనటులు వున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, సినిమాపై మరింత ఉత్కంఠని పెంచింది. ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా పురాణాల ఆధారంగా కల్పిత కథని తీశానని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుని నిర్యాణంతో ద్వాపరయుగం తరువాత కలియుగం ప్రారంభం అవుతుంది. అమితాబ్‌ బచ్చన్‌ అశ్వద్దామ పాత్రలో కనపడనున్నారు. ఇప్పటికే చాలామంది అశ్వద్దామ గురించి తెలుసుకోవడానికి అంతర్జాలంలో వెతుకుతున్నారు. అడిగి తెలుసుకుంటున్నారు. కమల్‌ హాసన్‌ కలి   పాత్రలో కనపడనున్నారని అంటున్నారు. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం! కలి ప్రభావం గురించి భాగవతంలో వ్యాస మహర్షి చెపుతారు. పోతన గారు ఆ భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. కలి అంటే ఎవరు, అతని ప్రభావం ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ఇప్పుడున్న యువకులు తమ సందేహాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. అశ్వద్దామ పాత్ర వేసిన అమితాబ్‌ బచ్చన్‌ ఎందుకు ఒంటికి గుడ్డలు చుట్టుకొని కనపడ్డారు, మామూలుగా అశ్వద్దామకి శ్రీకృష్ణుడు ఎందుకు శాపం ఇచ్చారు, ఇవన్నీ సందేహాలు అడుగుతున్నారు.


మరి నాగ్‌ అశ్విన్‌ అశ్వద్దామతో మొదలుపెట్టి కలియుగ అంతం ఎలా అవబోతోంది అని కూడా చూపిస్తారా, లేక ద్వాపరయుగం చివర్లో ఏమి జరిగింది, కలియుగం ఎలా మొదలైంది, ఎలా వుండబోతోంది, చివర్లో ఏమవుతుంది ఈ విషయాలను చూపిస్తారా, కథ ఎలా వుండబోతోంది అనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి అని అంటున్నారు. ప్రచార చిత్రాలు చూస్తే అందులో అమితాబ్‌ బచ్చన్‌ ఒక ప్రధాన పాత్రలో కనపడితే, ఇంకో ప్రధాన పాత్ర భైరవ పాత్ర అయిన ప్రభాస్‌. భైరవ అంటే ఈశ్వరుడు అని కూడా ఒక అర్ధం వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏంటంటే, నేపాల్‌ దేశంలో పాండవులలో అతి బలసంపన్నుడు అయిన భీముడిని దేవుడుగా కొలుస్తారు. అక్కడ భీమునికి అనేక దేవాలయాలు వున్నాయి. అక్కడ భీముడిని భైరవుడు అని కూడా పిలుస్తారు. మరి నాగ్‌ అశ్విన్‌ తీసుకున్న భైరవ పాత్ర నేపాల్‌ లో పూజించే భీముడి కి స్ఫూర్తిగా ఏమైనా తీసుకున్నారా. ఇవన్నీ సినిమా చూస్తే కానీ తెలియదు. కలియుగంలో కలి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కలి ఎలా ఉంటాడు అనే విషయంలో అతని వర్ణన కూడా చాలా ఏహ్యంగా ఉంటుంది. పురాణాల్లోనూ కలియుగంలో ప్రజలు ఎలా ఉండబోతున్నారు, ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే విషయాల గురించి వ్యాస మహర్షి చెప్పారు. కలియుగం అంతం అవుతున్న కొద్దీ, సమాజంలో అధర్మం పూర్తిగా నశిస్తుంది, మానవుని ఆయ్ణు ప్రమాణాలు పూర్తిగా తగ్గిపోతాయి, దోపిడీలు, దొంగతనాలు, బలవంతుడిదే రాజ్యం అనే విధంగా ఉంటుంది అని చెప్పారు. తండ్రి, కుమారుడు ఇద్దరూ ఒకే అమ్మాయిని వివాహం చేసుకునే స్థితికి వస్తుంది, అంటే అధర్మం అంతగా ప్రబలుతుంది అని చెప్పారు వ్యాస మహర్షి.

ధర్మం అనేది పూర్తిగా నశించిపోయిన శంభాలా అనే గ్రామంలో రోజు విష్ణుయశుడు, సుమతి అనే దంపతులకు కల్కి అవతారంగా భగవానుడు జన్మిస్తానని చెబుతారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడి’ అని పేరు పెట్టిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ప్రభాస్‌ ని ఏవిధంగా చూపించబోతున్నారు అనేది ఆసక్తికరం.  కాశీకి పురాణాల్లో ఎంతో ప్రత్యేకత వుంది. ఈ నగరం గురించి చాలా గొప్పగా చెపుతారు. యుగాంతం అయిపోయి ప్రళయం వచ్చినప్పుడు, ప్రపంచం అంతా నీటితో మునిగిపోయి, చిమ్మ చీకటితో నిండి ఉంటే, ఒక్క కాశీ నగరం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది అని పురాణాల్లో చెపుతారు. ఈశ్వరుడు కాశీ నగరంలో తపస్సు చేసాడని అతను సృష్టించిన నగరమే ఇది, అందుకని ఎంత ప్రళయం వచ్చినా ఈ కాశీ నగరం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని అంటారు. ’కాశ్యాన్తు మరణాన్‌ ముక్తి: అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని విశ్వాసం. అటువంటి కాశీ నగరాన్ని ఒక ప్రధాన పాత్ర చేశారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇలా పురాణాల ప్రాతిపదికగా ఒక కల్పిత కథతో ప్రేక్షకుల ముందుకు ’కల్కి 2898ఏడి’ అనే సినిమా వస్తోంది. ఇందులో నాగ్‌ అశ్విన్‌ తన కల్పిత పాత్రలతో ఎటువంటి కథని ప్రేక్షకులకి అందించబోతున్నారు అనే విషయం నేటి  ఉదయం తెలుస్తుంది.

ఇంకా చదవండి: నాగ్‌ అశ్విన్‌ అసాధారణ ప్రతిభావంతుడు.. ఆయన చిత్రాల తీరు చూస్తేనే అర్థం అవుతుంది: కమల్‌ హాసన్‌

# Kalki 2898 AD     # Prabhas     # Deepika Padukone     # Kamal Haasan    

related

View More
View More