జటాధర రెండవ పోస్టర్ విడుదల: భారతీయ సినిమాని పునర్నిర్వచించటానికి సుధీర్ బాబు యొక్క సూపర్ నేచురల్ ఎపిక్ సెట్
2 months ago | 48 Views
వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న నవ దళపతి సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’. అనౌన్స్‌మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం 2025 శివరాత్రి విడుదలకు సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో, శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.
ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై జటాధర చిత్రం ఇండియన్ సినిమాల్లో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసేలా రూపొందుతోంది. ఈ తరహా చిత్రాల రూపకల్పనకు ఇది నాంది పలికేలా కనిపిస్తుంది. సూపర్ నేచురల్ శక్తితో అదరగొట్టే లుక్‌లో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. అభిమానులు పోస్టర్‌ను చూసి సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే ఉహాగానాలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా! అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నవ దళపతి సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘‘జటాధర’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను. ఇంత గొప్ప స్పందన రావడంతో సంతోషమేసింది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సినిమాలోకి అడుగు పెట్టటం అనేది ఓ సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. నాకు ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోనర్స్‌కు చెందిన ప్రపంచాలను రేపు ఆడియెన్స్ వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త సినిమా అనుభూతిని పొందుతారు. ఓ సినిమా సక్సెస్‌కైనా కారణం బలమైన స్క్రిప్ట్. దీనికి మంచి టీమ్ తోడైతే అది మంచి సినిమాగా ప్రాణం పోసుకుంటుంది. మా సినిమా విషయంలో అదే జరుగుతుంది. ప్రేరణ అరోరాగారు బెస్ట్ టీమ్‌తో జటాధర సినిమాను ఆవిష్కరిస్తున్నారు. ఆమెతో కలిసి ట్రావెల్ చేయటం గొప్ప అనుభూతి. విజువల్‌గా, ఎమోషనల్‌గా ఓ అద్భుతమైన సినిమాను ఆమె తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పోస్టర్ పౌరాణిక ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉండబోతున్నాయి. వాటి గురించి తెలియజేయటానికి, ప్రేక్షకులు ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
భారీ బడ్జెట్‌తో అంచనాలను మించేలా ఓ అద్భుతమైన సరికొత్త చిత్రాన్ని రూపొందించటానికి నిర్మాతలు ప్రేరణ అరోరా, శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ అహర్నిశలు కష్టపడుతున్నారు. సినిమాలో హీరోయిన్‌గా ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనుంది. అలాగే ప్రతినాయకి పాత్రలో బాలీవుడ్ స్టార్ నటించనుంది. ఆ వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.
ప్రస్తుతం జటాధర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్ ఇండియా ప్రేక్షకులను ఈ చిత్రం అలరించనుందని సెకండ్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. 2025లో విడుదలకు సిద్ధమవుతున్న జటాధర సినిమాతో ఓ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించటానికి సిద్ధంగా ఉండండి. హరోంహరతో సూపర్ హిట్ కొట్టిన సుధీర్ బాబు అక్టోబర్ 11న మా నాన్న సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇంకా చదవండి: 'కన్నప్ప' నుంచి మారెమ్మ పోస్టర్ విడుదల!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!