'దేవర' : సముద్రతీరం నేపథ్యం...ఆధిపత్యం పోరాటం!
1 month ago | 5 Views
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివది క్రేజీ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో 'జనతా గ్యారేజ్’ వంటి సూపర్‌హిట్ సినిమా వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'దేవర'. సక్సెస్ కాంబో కావడం, ఆరేళ్ల తర్వాత తారక్ సోలోగా తెరపై కనిపిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
కథలోకి వెళితే..ఎర్ర సముద్రం తీరంలో గల రత్నగిరి ప్రాంతంలో నాలుగు గ్రామాలు ఉంటాయి. బ్రిటీష్ కాలం నాటి చరిత్ర ఆ ఊరికి ఉంటుంది. ఆ ప్రాంత వాసులు తమ జీవనం సాగించడం కోసం మురుగ (మురళీ శర్మ) కోసం సముద్రం మార్గంలో అక్రమంగా రవాణా జరిగే సరుకును కోస్ట్‌గార్డ్‌లకు చిక్కకుండా మురుగకు అందజేయడం వారి పని. అలా వచ్చిన మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తారు. ఆ నాలుగు గ్రామాల్లో ఒక గ్రామంలో నివశించే దేవర భయానికే భయం పుట్టించేంత వీరుడు. సముద్ర మార్గం గుండా వచ్చిన ఆయుధాల వల్ల తమ ప్రాంతానికి చెందిన ఓ పిల్లాడి ప్రాణం పోయిందని తెలిసి ఇకపై మురగ దగ్గర పని చేయకూడదని, మరో మార్గంలో పని చేసుకుందామని చెబుతాడు. అందుకు భైర (సైఫ్ అలీఖాన్) అంగీకరించడు. దేవరను తప్పించి తను సంద్రాన్ని శాసించాలనుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య అంతర యుద్ధం మొదలవుతుంది. దేవర మాత్రం ఊరికి దూరంగా ఉంటూ సంద్రం ఎక్కాలంటే భయపడేలా చేస్తాడు. దాంతో దేవర ప్రాణం తీయడానికి పన్నాగం పన్నుతాడు భైర. ఆ తర్వాత ఏం జరిగింది? అజ్ఞాతంలో ఉన్న తండ్రి దేవర కోసం భయం భయంగా ఉండే వర (ఎన్టీఆర్) ఏం చేశాడు?. అసలు రత్నగిరి, ఎర్ర సముద్రంలో ఏం జరిగింది అనేది కథ. రత్నగిరి అనే ప్రాంతంలో సముద్రం, అందులో జరిగే వ్యాపారం, ఆ ప్రాంతంలో బతుకుతెరువు కోసం పనిచేసే మనుషులు ఇతివృత్తంగా సాగే కథ ఇది.
బ్రిటీష్ కాలం, ఎర్ర సముద్రం, ఆ ప్రాంత వాసుల ఘనత, ఆ సముద్రానికి కాపలాగా ఉండే దేవర కథను ఓ కేసును చేధించడం కోసం వచ్చిన పోలీస్ ఆఫీసర్ (అజయ్)కు సింగప్ప (ప్రకాశ్‌రాజ్)తో చెప్పిస్తూ కథను నడిపించారు. ఫస్టాఫ్ అంతా ఎర్ర సముద్రం కథ, దేవర, భైరవ పాత్రలు, పోరాటాలు, రత్నగిరిలో జాతర, ఆయుధ పూజ నేపథ్యంలో సాగుతాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి కథ ట్రాక్ తప్పిన ఫీల్ కలుగుతుంది. అప్పటి వరకూ 'అక్రమ ఆయుధాల రావాణాకు పని చేస్తున్నాం’ అనే విషయం తెలియక ఆ పనిని వదిలేసి, కొత్త జీవితం మొదలు పెట్టాలనుకోవడం, అందుకు భైర అండ్ కో అంగీకరించపోవడం అంతా బాగానే సాగింది. దేవరను చంపాలనే స్కెచ్ వేసి దెబ్బ తిన్న భైర బృందం, సంద్రానికి కాపలాగా నేనుంటాను అని చెప్పి దేవర అజ్ఞాతంలోకి వెళ్లడం నుంచి కథ కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. భైరను ఎలా అంతమొం దించాలన్నది రెండో పార్ట్‌లో చూడాలి అన్నట్లు ముగింపు పలికారు. దర్శకుడు కొరటాల శివ బలం రచన. తను తెరకెక్కించిన హిట్ చిత్రాలు చూస్తే.. కథలో బలం కనిపిస్తుంది. తారక్ నటన, పోరాటాలు, అనిరుద్ సంగీతం సినిమాకు ఎసెట్‌గా నిలిచాయి. సముద్రానికి రారాజుగా ఎన్టీఆర్ పాత్రను చూపించారు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తాయి. సమ ఉజ్జీలాంటి రెండు పాత్రలను పవర్‌ఫుల్‌గా తెరపై చూపించారు. దేవరగా తండ్రి పాత్రలో, ’వర’గా యంగ్ ఎన్టీఆర్ పాత్రలో ఆకట్టుకున్నారు.శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌కు తెలుగులో తొలి చిత్రమిది. ఆమె పాత్ర గురించి మొదటి నుంచీ మాంచి ఎలివేషన్ ఇచ్చారు కానీ మూడు సీన్లు, ఓ పాటలకు పరిమితమైంది. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అండర్ వాటర్ సీన్స్‌కు బాగా ఖర్చు చేసినట్లు తెరపై కనిపిస్తోంది. రత్నవేలు కెమెరా పనితనం సినిమాకి హైలైట్. సంగీత దర్శకుడు అనిరుద్ నేపథ్య సంగీతంతో అలరించాడు. ఈ చిత్రంలో కొరటాల శివ గత చిత్రాల సన్నివేశాల పోలికలున్నాయి. ఆయన రచనపై ఇంకాస్త దృష్టి పెట్టుంటే అవుట్‌పుట్ మరోలా ఉండేది.
ఇంకా చదవండి: ఓటిటిలోకి వచ్చేసిన 'భలే ఉన్నాడే'